రాష్ట్రంలో వచ్చే మూడ్రోజులు వర్షాలు!
28న పలు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన
నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం 28 నాటికి తీవ్ర తుపాన్‌గా మారి ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి స్టెల్లా వెల్లడించారు. తూర్పు మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయు గుండం కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా ఆనుకున్న తీరాలకు తుపాన్ హెచ్చరిక జారీ చేశారు. వాయుగుండం అండమాన్‌దీవులకు 450 కిలోమీటర్లు, విశాఖ పట్నానికి 820 కిలోమీటర్లు, కాకినాడకు 910 కిలోమీటర్లు, మచిలీ పట్నానికి 1010 కిలోమీటర్లు, బాపట్లకు 1080 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొన్నారు. ఆ తీవ్ర వాయుగుండం దాదాపు పశ్చిమ దిశగా కదులుతూ ఈ నెల 26 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫానుగా, 27 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడిం చారు. 28న మధ్యాహ్నానికి ముందు బాపట్ల–విశాఖపట్నం మధ్య తీరం దాటే సూచనలు బలంగా కనిపిస్తున్నాయనీ, ఆ సమయంలో గరిష్ఠంగా గంటకు 115–125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయనీ, కొన్ని సందర్భాల్లో గంటకు 140 కిలోమీటర్ల వరకు కూడా పెరిగే ప్రమాదముందని హెచ్చరించారు.
తెలంగాణకు హెచ్చరికలు ఇలా...
తుఫాన్ ప్రభావం వల్ల తెలంగాణలో వాతావరణ క్రమంగా చల్లబడుతున్నది. సోమ, మంగళ వారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. బుధవారం నాడు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ సూచనలున్నాయి. ఈ మేరకు ఆ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, సూర్యాపేట, నల్లగొండ, నాగర్‌కర్నూల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్న నేపథ్యంలో ఆరెంజ్ హెచ్చరికను విడుదల చేసింది.





కామెంట్‌లు (0)