ఆదివాసీల సభకు ముస్తాబైన ఆసిఫాబాద్
మధ్యాహ్నం ర్యాలీ, బహిరంగ సభ
పాల్గొననున్న ఏఏఆర్‌ఎం జాతీయ వైస్ చైర్‌పర్సన్ బృందాకరత్
రెండ్రోజులపాటు ప్రతినిధుల సభ
ప్రారంభమైన సాంస్కృతిక సంబురాలు
నవతెలంగాణ-ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి భవిష్యత్ పోరాటాల కార్యాచరణ రూపొందించడానికి వీర యోధుడు కుమురంభీం పురిటి గడ్డ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం వేదిక కానుంది. ఆదివాసీల మనుగడ, అస్తిత్వాన్ని కాపాడటానికి ఆవిర్భవించిన తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం(టీఏజీఎస్) రాష్ట్ర 4వ మహాసభకు జిల్లా కేంద్రం ముస్తాబైంది. గిరిజన సంఘం జెండాలు, తోరణలతో పుర వీధులు ఆకుపచ్చ రంగు పులుముకున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్‌లో 28, 29న నిర్వహించే ప్రతినిధుల సభకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. మహాసభ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. మహాసభ మొదటి రోజు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి లుంబిని దీక్ష భూమి వరకు ఆదివాసుల కళా ప్రధర్శన నిర్వహించనున్నారు.. ఈ కార్యక్రమానికి ఆదివాసీ అధికారి రాష్ట్రీయ మంచ్(ఏఏఆర్‌ఎం) జాతీయ వైస్ చైర్‌పర్సన్ బృందాకరత్ హాజరవుతున్నారు. అటవీ హక్కుల చట్టం-2006 రూపకర్త మాజీ ఎంపీ, టీఏజీఎస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మిడియం బాబురావు, ప్రధాన కార్యదర్శి పూసం సచిన్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్‌రాములు పాల్గొంటారు.
ప్రధాన వక్తలుగా ఉపాధ్యక్షులు బండారి రవికుమార్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.విజయలక్ష్మి, ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆశలతతో పాటు ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు ప్రసంగిస్తారు. మహాసభకు టీఏజీఎస్ ఆసిఫాబాద్ జిల్లా కార్యదర్శి నెర్పల్లి అశోక్ అధ్యక్షత వహిస్తారు. రెండో రోజు ఆదివారం రాష్ట్ర నూతన కమిటీ ఎన్నికైన తర్వాత మహాసభ ముగుస్తుంది.
ఆదివాసీ కళా ప్రదర్శనలతో ఆరంభం
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి నుంచి శనివారం మధ్యాహ్నం 12 గంటలకు కుమురంభీం చౌక్ మీదుగా లుంబిని దీక్ష భూమి వరకు ఆదివాసీ కళా ప్రదర్శన సాగనుంది. పుర వీధుల్లో భారీ ప్రదర్శన అనంతరం ప్రేమలత గార్టెన్‌కు చేరుకుని అక్కడ బహిరంగ నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు ప్రతినిధుల సభ ప్రారంభమవుతుంది. మూడేండ్ల కాలంలో చేపట్టిన పోరాటాలు, ఉద్యమ కార్యాచరణకు సంబంధించిన నివేదికను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవేశపెడతారు. అనంతరం పలు తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. రెండో రోజు మహాసభ ఉదయం 9:30 గంటలకు ప్రాంభమవుతుంది. బృందా కరత్ ప్రారంభోపన్యాసం చేస్తారు. ఉదయం 10:45 గంటల నుంచి 11:45 వరకు కార్యదర్శి నివేదికపై చర్చలు ఉంటాయి. కార్యదర్శి సమాధానాల అనంతరం నూతన రాష్ట్ర కమిటీని ప్రకటిస్తారు.






కామెంట్‌లు (0)