Magazines

తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి ...

17 నిమిషాల క్రితం

Telangana should be declared a drought-affected state.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026 | 3 నిమిషాల చదవడం

కుటుంబ సభ్యులందరికీ కుటుంబ భీమాను వర్తింపజేయాలి

సర్ పేరుతో 13 కోట్ల ఓట్ల తొలగింపు

ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్న బీజేపీ ప్రభుత్వం

రైతాంగాన్ని ఆదుకునేందుకు 
రూ.50 వేల కోట్లు విడుదల చేయాలి : సీపీఐ(ఎం) 
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ

పాలకుర్తి మండలం గూడూరులో ఎండిన పంట పొలాల పరిశీలన

నవతెలంగాణ-పాలకుర్తి

రైతాంగాన్ని, ప్రజలను ఆదుకునేందుకు తెలంగాణను పూర్తిగా కరువు రాష్ట్రంగా ప్రకటించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని గూడూరు గ్రామ శివారులో గల ఎండిన పంట పొలాలను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్, జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, ఇతర నేతలతో కలిసి పరిశీలించారు. రైతు బక్క ఎల్లయ్య నుంచి పంట వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా పాలకుర్తిలో గల శ్రీ సోమేశ్వర ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాన్ వెస్లీ మాట్లాడారు. ఎల్‌‌నినో ప్రభావం రాష్ట్రంలో తీవ్రంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి స్వయంగా ప్రకటించారని గుర్తు చేశారు. కరువు మండలాలను వెల్లడించినా, దానికి సంబంధించి చర్యలు తీసుకోవడం లేదన్నారు. పంటల నష్టం పై ఇప్పటివరకు ప్రభుత్వం అంచనా వేయలేదన్నారు. రాష్ట్రంలో 356 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన ప్రభుత్వం 25 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిందని ప్రకటించారని, కరువు ప్రకటించని మండలాల్లో ఇదే పరిస్థితి ఉందని తెలిపారు. రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వరి పంట వేసి నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు 30000, వాణిజ్య పంటలు వేసుకొని నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు 50,000 నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంటలు సాగు చేసుకోవద్దని ప్రచారం చేస్తున్న ప్రజాప్రతినిధులు నెలసరి వేతనాలు తీసుకోకుండా ఉంటున్నారా అని ప్రశ్నించారు. తమ రాష్ట్రాల్లో నష్టపోయిన రైతాంగానికి కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు నష్టపరిహారాన్ని అందిస్తున్నాయని, తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని విమర్శించారు. రాష్ట్రంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రణాళికను రూపొందించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలపై విమర్శలతో కాలం వెళ్లదీస్తుందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపులు చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఘాటుగా విమర్శించారు. రాష్ట్రానికి నిధులు కేటాయించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కుటుంబ భీమా పథకాన్ని కుటుంబంలోని కుటుంబ సభ్యులందరికీ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. విద్యను కాషాయీకరణ చేసేందుకు టెన్ ప్లస్ టు విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంటే దానికి వత్తాసు పలికేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం సరికాదన్నారు. మంత్రివర్గంలో చర్చించకుండా, రాజకీయ పార్టీలతో, ఉపాధ్యాయ సంఘాలతో, మేధావులతో చర్చించకుండా టెన్ ప్లస్ టు విధానాన్ని అమలు చేసేందుకు తీసుకుంటున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సర్ పేరుతో దేశంలో 13 కోట్ల కోట్లను కేంద్ర ప్రభుత్వం తొలగించిందని వివరించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు.

​​రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలి

రాష్ట్రంలోని రైతాంగాన్ని కరువు నుండి విముక్తి చేసేందుకు రైతులందరికీ రుణమాఫీ చేసి ఆదుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అశాస్త్రీయమైన పదాలను వాడుతూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా బీజేపీ నాయకులు చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. టెన్ ప్లస్ టు విద్యా విధానంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధానపరమైన నిర్ణయాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. దేశంలో మూడు కోట్ల మంది చొరపాటుదారులు ఉన్నారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండించారు. కార్మికుల హక్కులను కాపాడేందుకు డిసెంబర్ 3న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యవసర వస్తువులను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలపై ప్రజలను కూడగట్టి సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొట్ల శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, చిట్యాల సోమన్న, సుంచు విజేందర్, గంగాపురం మహేందర్, బిట్ల గణేష్, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎదునూరి మదర్, మండల కమిటీ సభ్యులు మాసంపల్లి నాగయ్య, ముస్కు ఇంద్రారెడ్డి, సోమ అశోక్ బాబు, రజక వృత్తిదారుల సంఘం నాయకులు సోమయ్య లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

- అబ్బాస్


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్