ఉత్తేజపూరిత వాతావరణంలో చర్చలు
ఆయా రాష్ట్రాల పోరాట విజయాలను వివరించిన ప్రతినిధులు
స్ఫూర్తిదాయకంగా మహారాష్ట్ర, రాజస్థాన్ ఉద్యమాలు
రుణమాఫీని ఎజెండాగా మార్చడంలో తెలంగాణ రైతు సంఘం విజయం
సారంపల్లి మల్లారెడ్డి నగర్ నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
నల్లగొండలోని సారంపల్లి మల్లారెడ్డి నగర్లో కొనసాగుతున్న ఏఐకేఎస్ 36వ మహాసభ ఆద్యంతం పోరాట స్ఫూర్తిని నింపుతోంది. మహాసభలో భాగంగా మూడో రోజైన మంగళవారం 27 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ప్రతినిధులు కార్యదర్శి నివేదికపై చర్చలు జరిపారు. చర్చల సారాంశాన్నీ, గత మహాసభ నుంచి ఈ మహాసభ వరకు ఆయా రాష్ర్టాల్లో చేసిన పోరాటాలు, వాటి అనుభవాలను, విజయా లను ప్రతినిధులు సభకు వివరించారు. ఇతర రాష్ర్టాల ప్రతినిధుల్లో చైతన్యం నింపేలా పోరాట స్ఫూర్తితో వారు ప్రసంగించారు.
మహా సర్కార్ మెడలు వంచిన రైతులు
ఏఐకేఎస్ మహారాష్ట్ర ప్రతినిధులు
మహారాష్ట్రలో ఏఐకేఎస్ పోరాటాలతో ప్రభుత్వం దిగొచ్చిందని, అక్కడి రైతుల డిమాండ్లను నెరవేర్చిందని ఆ రాష్ట్ర ప్రతినిధులు కిరణ్, సదాశివ్ సాబ్రమ్ వివరించారు. ఉల్లి పంటకు సబ్బిడీని రాబట్టడంలోనూ, అటవీ హక్కుల చట్టం కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని వేయించడం లోనూ, 88 వేల మందికి రుణమాఫీ కల్పించేందుకు అంగీకారం తెలపడంలోనూ తాము చేసిన కృషిని వివరించారు. మహారాష్ట్ర లో చేపట్టిన ఉద్యమాలు, లాంగ్మార్చ్ల గురించి విశదీకరిం చారు. ఆదివాసీ ప్రాంతాల్లో లక్ష కొత్త ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం అంగీకరించిందని అన్నారు. 2026 జనవరిలో నాసిక్, పాల్ఘర్, థానే జిల్లాల రైతులు, ఆదివాసీలు, వ్యవసాయ కార్మికులు, మత్స్యకారులు కలిసి పెద్ద ఎత్తున పాదయాత్ర చేపట్టారని చెప్పారు. దీంతో ఆదివాసీలకు భూమిహక్కు పత్రాలిచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం రాతపూర్వకంగా అంగీకరించిందని అన్నారు. గ్రామ కమిటీల నివేదికలు, చట్టబద్ధమైన ఆధారాల ప్రకారం హక్కుల కల్పనకు చర్యలు తీసుకుంటామని హామీనిచ్చిందని తెలిపారు. థానే, పాల్ఘర్ జిల్లాలో మేలో ఆరు పాదయాత్రలు చేపట్టామనీ, అందులో 35 వేల మందికిపైగా రైతులు పాల్గొన్నారని తెలిపారు. దీంతో అక్కడి ప్రభుత్వం భూమి హక్కుల దరఖాస్తులను సేకరించటం తాము సాధించిన గొప్ప విజయమన్నారు.
రైతులకు రుణమాఫీ కోసం పోరాటాలు
తెలంగాణ ప్రతినిధి మూడ్ శోభన్
తెలంగాణలో రైతులకు రుణమాఫీ కోసం రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్దఎత్తున పోరాటాలు చేశామని తెలంగాణ ప్రతినిధి మూడ్ శోభన్ తెలిపారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టించడం తోపాటు బ్యాంకుల్లో రూ.2 లక్షల లోపు రుణమున్న రైతులకు రూ.20,600 కోట్లను విడుదల చేయించడంలో విజయం సాధించామని తెలిపారు. అంతకుమించి రుణాలున్న రైతుల రుణమాఫీ కోసం కూడా పోరాడుతున్నామని చెప్పారు. కొడంగల్ లిఫ్టు ఇరిగేషన్లో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారాన్ని రూ.14 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పెంచడంలో విజయం సాధించామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో దళారుల దోపిడీని అడ్డుకునేందుకు కొనుగోళ్ల సమయంలో నిత్యం మార్కెట్లను సందర్శంచి కొంతమేర దోపిడీకి అడ్డుకట్టవే యగలిగామన్నారు. బీఆర్ఎస్ పాలనలో అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున ఇప్పించడంలో ఏఐకేఎస్ చేసిన కృషిని వివరించారు. కౌలు రైతులకు రుణార్హత కార్డులివ్వాలని ఏఐకేఎస్ ఇతర సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేయడం వల్ల ప్రభుత్వం దానిపై ఒక కమిటీనీ వేసిందని గుర్తు చేశారు. కౌలు రైతులకు న్యాయం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ కూడా ఇచ్చిందని తెలిపారు. రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డిజిల్లాల్లో రైతులకు పట్టాపాసు పుస్తకాలు ఇప్పించడంలో ఏఐకేఎస్ కృషిని వివరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు రైతులకు నాలుగు లక్షల ఎకరాలకు సంబంధించిన పట్టాలిప్పించడంలో చేసిన కృషిని విడమర్చి చెప్పారు.

రాజస్తాన్‌లో బలమైన ఉద్యమాలు
ఏఐకేఎస్ ప్రతినిధి హరిపూల్
రాజస్తాన్‌లో మూడేండ్ల కాలంలో ఏఐకేఎస్ ఆధ్వర్యంలో బలమైన ఉద్యమాలు రూపొందించినట్టు ఆ రాష్ట్ర ప్రతినిధి హరిపూల్ వివరించారు. బీమా కంపెనీలు పంట నష్టపరిహారాన్ని ఇచ్చేందుకు నిరాకరిస్తే చురు, సర్దార్‌షహర్, తారానగర్, రాజ్‌గఢ్ ప్రాంతాల్లో వేలాది మంది రైతులను సంఘటితం చేయగలిగామనీ, దాని ప్రభావం స్థానిక రాజకీయాలపైనా పడేలా చేయడంలో విజయం సాధించామని తెలిపారు. వేరే పార్టీలకు చెందిన వారు కూడా పోరాట కేంద్రాల వద్దకు వచ్చి మద్దతు తెలిపేలా చేయడంలో ఏఐకేఎస్ జయప్రదమైందని చెప్పారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటు కోసం వేల ఎకరాల భూములను రాజస్థాన్ ప్రభుత్వం సేకరిస్తోందని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతున్నాయనీ, కొన్నిచోట్ల విజయం సాధించామని వివరించారు. చురు జిల్లాలో చేసిన పోరాటం ద్వారా పంట కోత నివేదికలను కలెక్టర్ ద్వారా సాధించడం గొప్ప విషయమన్నారు.
పేదలపై బీజేపీ సర్కార్ జులుం
మధ్యప్రదేశ్ ప్రతినిధి నీనాశర్మ
రాష్ట్ర ప్రభుత్వం పేదల నుంచి పెద్ద ఎత్తున భూములను స్వాధీనం చేసుకుంటున్నదనీ, దీనికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నామని మధ్యప్రదేశ్ ప్రతినిధి నీనాశర్మ తెలిపారు. అయితే, బీజేపీ ప్రభుత్వ హయాంలో రైతు ఉద్యమాలపై తీవ్ర నిర్బంధాలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి ప్రభుత్వం ప్రజలను విశ్వాసాల పేరిట చీల్చి లబ్ది పొందుతున్నదని తెలిపారు. గుజరాత్‌కు చెందిన పురుషోత్తమ్ మాట్లాడుతూ..తమ రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లోని పోర్టులను బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు కట్టబెడుతున్నదని విమర్శించారు.







కామెంట్లు (0)