Magazines

‌ఫీజులు తీసుకుని ధ్రువపత్రాలు ఆపుతారా?

13 నిమిషాల క్రితం

certificates
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026 | 2 నిమిషాల చదవడం

నల్ల మల్లారెడ్డి స్కూల్‌‌పై 
గద్వాల విజయలక్ష్మి ఆగ్రహం

10లోగా సర్టిఫికెట్లు అందేలా చూడాలని ఆర్జేడీకి ఆదేశం

సీఎం రేవంత్‌ దృష్టికి తీసుకెళ్లి 
చర్యలు తీసుకోవాలని కోరతా

నవ తెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌

ఫీజులు చెల్లించినప్పటికీ ఇద్దరు మైనర్ విద్యార్థినుల అకడమిక్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ నల్ల మల్లారెడ్డి ఫౌండేషన్ స్కూల్‌‌పై వచ్చిన ఫిర్యాదుపై రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్‌పర్సన్, సీఎం ప్రజావాణి రాష్ట్ర స్థాయి ఇన్‌చార్జీ గద్వాల విజయలక్ష్మి స్పందించారు. శుక్రవారం సీఎం ప్రజావాణిని ఇద్దరు బాలికలు ఆశ్రయించారు. అవసరమైన సర్టిఫికెట్లు అందక చదువు కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యను స్వయంగా విన్న గద్వాల విజయలక్ష్మి వెంటనే స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్జేడీ సోమిరెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. “ఫీజులు చెల్లించిన తర్వాత కూడా పిల్లల సర్టిఫికెట్లు ఎందుకు నిలిపేస్తున్నారు?. వారి చదువు ఆగిపోయే పరిస్థితి రావడం ఏ మాత్రం సహించేది కాదు. 10 తేదీలోగా వారికి అవసరమైన సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకోవాలి” అని ఆర్జేడీని ఆమె ఆదేశించారు. ఈ సమస్య పరిష్కారం కాకపోతే విషయాన్ని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని గద్వాల విజయలక్ష్మి తెలిపారు. ఈ అంశంపై విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణాకు కూడా ఆమె అధికారికంగా లేఖ రాశారు. విద్యార్థినులకు అవసరమైన విద్యా ధ్రువపత్రాలను వెంటనే అందజేయడంతోపాటు, వారు చేసిన వేధింపుల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.“విద్యార్థుల భవిష్యత్తుతో ఎవరూ ఆటలాడకూడదు. ఫీజులు లేదా పరిపాలనా సమస్యల పేరుతో పిల్లల చదువును అడ్డుకోవడం సహించం. విచారణలో తప్పిదం నిర్ధారణైతే సంబంధిత విద్యాసంస్థలపై కఠిన చర్యలు తప్పవు” అని గద్వాల విజయలక్ష్మి హెచ్చరించారు.రాష్ట్రంలోని ఇతర విద్యాసంస్థలు కూడా ఈ అంశాన్ని గమనించాలనీ, విద్యార్థులను వేధించడం, సర్టిఫికెట్లు నిలిపేయడం లేదా వారి విద్యకు ఆటంకం కలిగించే చర్యలకు పాల్పడితే ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని ఆమె స్పష్టం చేశారు. “పిల్లల చదువు ఆగకూడదు. వారి విద్యా హక్కు, భవిష్యత్తు విషయంలో సీఎం ప్రజావాణి రాజీపడదు” అని గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో 83 దరఖాస్తులు అందాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్