మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకోవాలి
మాజీ ఐపీఎస్ అధికారి వివి.లక్ష్మీనారాయణ
ఓయూలో ‘అన్వేషణ్–2026’ ప్రారంభం
నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
యువ పరిశోధకులు కేవలం ఉద్యోగార్థులుగా కాకుండా నూతన ఆవిష్కర్తలు, సమస్యల పరిష్కర్తలు, ఉద్యోగ కల్పనకర్తలుగా ఎదగాలని మాజీ ఐపీఎస్ అధికారి వివి. లక్ష్మీనారాయణ సూచించారు. తల్లిదండ్రులకు, దేశానికి మంచి పేరు తీసుకురావాలని, తమ సంతకమే ఆటోగ్రాఫ్‌గా మారే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ ఓయూలో ‘అన్వేషణ్–2026’ దక్షిణ భారత విద్యార్థుల పరిశోధన సదస్సును శుక్రవారం ఆయన ప్రారంభించారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఏఐయూ), ఓయూ సంయుక్త ఆధ్వర్యంలో రెండ్రోజులపాటు జరిగే ఈ సదస్సులో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 20 విశ్వవిద్యాలయాల నుంచి 788 మంది యువ పరిశోధకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అమెరికాలోని సివెంటికెమ్ ప్రెసిడెంట్, సీఈఓ డాక్టర్ భాస్కర్‌రావు వెనెపల్లి హాజరుకాగా, ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. యువత శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత, పట్టుదలతోపాటు నైతిక బాధ్యతను అలవర్చుకోవాలని సూచించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని చెప్పారు. సమాజంలోని సమస్యల పట్ల సానుభూతితో స్పందిస్తూ, వాటి పరిష్కారానికి పరిశోధనలు, ఆవిష్కరణలు చేపట్టాలని కోరారు. డాక్టర్ భాస్కర్‌రావు వెనెపల్లి మాట్లాడుతూ.. విద్యాసంస్థల్లో జరిగే పరిశోధనలకు, పరిశ్రమల అవసరాలకు మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వాణిజ్యపరంగా, సామాజికంగా ఉపయోగపడే ఆవిష్కరణలపై విద్యార్థులు దృష్టి సారించాలని సూచించారు. ఏఐయూ రీసెర్చ్ డివిజన్ జాయింట్ డైరెక్టర్, డైరెక్టర్ ఇన్‌చార్జి డాక్టర్ అమరేంద్ర పానీ మాట్లాడుతూ.. యువతలో పరిశోధనా నైపుణ్యాలను వెలికితీసి ప్రోత్సహించడంలో ‘అన్వేషణ్’ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాలు నూతన ఆవిష్కరణలు, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే వేదికలుగా ఎదగాలన్నారు. విద్యార్థులు తమ అకడమిక్ పరిజ్ఞానాన్ని సమాజ సమస్యల పరిష్కారానికి వినియోగించాలని, 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఏడు విభాగాల్లో పరిశోధనలు
బేసిక్ సైన్సెస్, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, హెల్త్ సైన్సెస్, అగ్రికల్చర్ అండ్ అలైడ్ డిసిప్లిన్స్, సోషల్ సైన్సెస్–హ్యుమానిటీస్–కామర్స్–లా, ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్, రోబోటిక్స్–ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–3డీ ప్రింటింగ్ అండ్ ప్రోటోటైప్స్ విభాగాల్లో ఈ సదస్సులో పోటీలు నిర్వహిస్తున్నారు. ఓయూ, జేఎన్‌టీయూహెచ్, వీఐటీ-ఏపీ, ఎస్‌ఆర్‌ఎం, మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తదితర ప్రముఖ విశ్వవిద్యాలయాల పరిశోధకులు పాల్గొంటున్నారు. యూజీసీ వ్యవహారాల డీన్, డెవలప్‌మెంట్ డీన్, సదస్సు సమన్వయకర్త ప్రొఫెసర్ బి.లావణ్య స్వాగతం పలికి సదస్సు లక్ష్యాలను వివరించారు. కో-కోఆర్డినేటర్ డాక్టర్ పి. మురళీధర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలపగా, మరో కో-కోఆర్డినేటర్‌గా డాక్టర్ హరీష్ గుప్తా వ్యవహరించారు.






కామెంట్‌లు (0)