Tuesday, March 24, 2026
E-PAPER
Homeఖమ్మంస్టెమ్ సెంటర్ ప్రారంభం ..

స్టెమ్ సెంటర్ ప్రారంభం ..

- Advertisement -

గ్రామీణ విద్యార్థుల్లో శాస్త్రీయ విప్లవానికి శ్రీకారం
గ్రామీణ విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలకు కొత్త దిశగా అడుగులు
గోవిందాపురం ఎల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్టెమ్ సెంటర్ ప్రారంభం
నవతెలంగాణ – బోనకల్

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని బోనకల్ మండల పరిధిలోని గోవిందాపురం ఎల్ ఉన్నత పాఠశాలలో స్టెమ్ సెంటర్ ప్రారంభోత్సవం, సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ను మంగళవారం ఘనంగా నిర్వహించారు. అదే వేదికగా విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబించేలా అద్భుతమైన సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అధికారి రచ్చ శ్రీనివాసరావు మాట్లాడుతూ పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రాక్టికల్ లెర్నింగ్ ద్వారానే నిజమైన విజ్ఞానం వస్తుందన్నారు. ఈ స్టెమ్ సెంటర్ వలన గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తును మార్చే శక్తి కలుగుతుంది అన్నారు.

ఈ సైన్స్ ఫెయిర్‌లో విద్యార్థులు రూపొందించిన రోబోటిక్స్ మోడల్స్, పర్యావరణ ప్రాజెక్టులు, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ మోడల్స్, వాతావరణ మార్పులకు సంబంధించినవి, మానవ శరీర నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టులు, వ్యవసాయ పరికరాలకు సంబంధించిన ప్రాజెక్టులు, సైన్స్ ఎక్స్‌పెరిమెంట్స్ సందర్శకులను ఆకట్టుకున్నాయి. చిన్నారుల ఆలోచనల్లోని పెద్ద ఆవిష్కరణలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. చైల్డ్ రైట్స్ అండ్ యు సంస్థ సహకారంతో పాఠశాలలో ఏర్పాటుచేసిన స్టెమ్ సెంటర్ ను గ్రామ సర్పంచ్ మందా కరుణ, జిల్లా సైన్స్ అధికారి రచ్చ శ్రీనివాసరావు, మండల విద్యాశాఖ అధికారి దామాల పుల్లయ్య లాంఛనంగా ప్రారంభించారు.

అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ.. గ్రామీణ విద్యార్థులకు కూడా నగర స్థాయి అవకాశాలు కల్పించడమే లక్ష్యం గా ఈ స్టెమ్ సెంటర్ వారికి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుందని తెలిపారు. ఈ సైన్స్ ఫెయిర్ ద్వారా విద్యార్థులు తమ ఆలోచనలు, పరిశోధనలు ప్రజలతో పంచుకోవడం ద్వారా వారి సామాజిక, సృజనాత్మక అభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు. అదే విధంగా స్టెమ్ ( సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం) విద్య ద్వారా విద్యార్థుల్లో సమస్య పరిష్కార నైపుణ్యాలు, క్రిటికల్ థింకింగ్ ఆవిష్కరణ భావన పెరుగుతాయని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ విద్యార్థులకు ఆధునిక విద్యా అవకాశాలు చేరువకావడంతో పాటు, భవిష్యత్తులో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులుగా ఎదగడానికి బాటలు వేయబడుతాయని వారు ఆకాంక్షించారు.

ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత మరియు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడానికి ఇలాంటి స్టెమ్ సెంటర్ లు దోహదపడతాయని, ఈ స్టెమ్ సెంటర్ ఏర్పాటుచేసిన చైల్డ్ రైట్స్ అండ్ యు సంస్థను వక్తలు ప్రత్యేకంగా అభినందించారు. తదనంతరం పిల్లలచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉత్తమ ప్రాజెక్టులకు బహుమతులు అందజేసి విద్యార్థులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కందుల ప్రభావతి ఉపసర్పంచ్ కారంగుల చంద్రయ్య గ్రామపంచాయతీ కార్యదర్శి కొనిపాక మురళి, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ ధనమ్మ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, రిసోర్స్ పర్సన్ ఉమా శంకర్, క్రై సంస్థ ప్రతినిధులు విజయ్ కుమార్, బోయినపల్లి సురేష్, రేణుక, కార్తీక్, కరుణ, అరుణ, నరసమ్మ, గురవమ్మ, రాణి, లాల్ బి, ఉష, మౌనిక, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -