నవతెలంగాణ-పాలకుర్తి
వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం అధికారులతో ఫోన్లో మాట్లాడి సూచనలు చేశారు. రానున్న 72 గంటల పాటు వర్షపాతం పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఎలాంటి సహసాలకు పాల్పడకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రానున్న మూడు రోజులు వర్షాల ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
వర్షాల సందర్భంగా వరదల ఉధృతి ఎక్కువగా ఉంటుందని, చెరువుల మతల వద్ద వరద ఉధృతి ఉంటుందని తెలిపారు. దాటేందుకు ఇలాంటి సాహసం చేయరాదని సూచించారు. ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఇలాంటి ప్రమాదాలు వాటిల్లిన అత్యవసరంగా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు పాటించాలని, చిన్నారులు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలన్నారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటే స్థానిక నాయకులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల భద్రతే ప్రధానమని, రాబోవు మూడు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండి సహకరించాలని సూచించారు.