ఆకలి రాజ్యం చిత్రంలోని ‘సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి..నీదీ నాదే బ్రదరూ. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే బ్రదర్’ ఈ పాట అప్పట్లో ఊపు ఉపేసింది. యువతను ఉర్రూతలూగించింది. పాలకుల తీరును ఎండగట్టింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట దేశంలోని ఉన్న అనేక రుగ్మతలకు అద్దం పడుతుంది. ఆకలి, నిరుద్యోగం, పేద, ధనిక అనే వ్యత్యాసాలు కండ్లకు కట్టినట్టు రాశారు. అయితే ఈ పాటలో మరో ముఖ్యమైన చరణం ‘స్వతంత్ర దేశంలో చావు కూడా పెండ్లిలాంటిదే బ్రదర్’ ఇప్పుడు కూడా మన కండ్ల ముందు సాక్షాత్కారిస్తున్నది. ఆకలిచావులు ఉన్న దేశంలో ఆడంబరాలు కూడా ఎక్కువే. పెండ్లిల మాదిరిగా చావులను చేస్తున్నారు. తాజాగా తమిళనాడులోని సేలం జిల్లా ఆథూర్‌కు చెందిన వెల్లయ్యమ్మల్(85) ఇటీవల తుదిశ్వాస విడిచింది. ఆమె చివరి కోరిక మేరకు శ్మశానవాటికలోనే పది కేజీల కేక్ కట్‌చేసి, బాణా సంచా పేల్చి, బ్యాండు పెట్టి డాన్సులు వేస్తూ.. అంత్యక్రియలను పెండ్లి వేడుకలా నిర్వహించారు. మనుమలు-మనుమ రాళ్లు అంతా కలిసి ఘనంగా అంతిమయాత్ర నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అక్కడే కాదు తెలంగాణ జిల్లాల్లో చాలా చోట్ల పెండ్లిళ్లు ఎంత ఘనంగా నిర్వహిస్తున్నారో, అంత్యక్రియలను కూడా అంతే ఘనంగా నిర్వహిస్తున్నారు. తమతమ స్థాయిల్లో ఖర్చులకు వెనుకాడకుండా పోటీపడి మరి చేస్తున్నారు. కానీ, శుభకార్యమొచ్చినా, చావొచ్చినా పేదోడికి మాత్రం చచ్చేంతా పనవుతుంది!
- గుడిగ రఘు


