ఇరాన్‌కు భద్రతామండలి సూచన
న్యూయార్క్ : గల్ఫ్ దేశాలపై తక్షణమే దాడులను ఆపాలని ఇరాన్‌కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సూచించింది. అయితే దీనిపై ఇరాన్ స్పందిస్తూ తమ భూభాగంపై అమెరికా, ఇజ్రాయిల్ జరుపుతున్న దాడులను భద్రతా మండలి పట్టించుకోవడంలేదని ఆరోపించింది. గల్ఫ్ దేశాలపై దాడులను నిలిపివేయాలని కోరుతూ భద్రతా మండలిలో బహ్ రైన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని 13 దేశాలు సమర్ధించాయి. రష్యా, చైనాలు ఓటింగుకు దూరంగా ఉన్నాయి. ఇరాన్‌పై జరుగుతున్న దాడులను తీర్మానంలో ప్రస్తావించలేదని ఆ దేశాలు విమర్శించాయి. గల్ఫ్ దేశాలైన బహ్ రైన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, జోర్డాన్‌లను లక్ష్యంగా చేసుకోవడం, అంతర్జాతీయ నౌకా మార్గాల్లో జోక్యం చేసుకోవడం వంటి చర్యలకు ఇరాన్ స్వస్తి చెప్పాలని తీర్మానం డిమాండ్ చేసింది.
హర్మూజ్ జలసంధి సహా మధ్యప్రాచ్యంలోని సముద్ర మార్గాల్లో నౌకల రవాణాకు ఆటంకం కలిగించవద్దని హెచ్చరించింది. బహ్ రైన్ తీర్మానాన్ని ఐరాసలోని 135 దేశాలు సమర్ధించాయి.
బహ్ రైన్ తీర్మానాన్ని ఐరాసలో ఇరాన్ రాయబారి అమిర్ సయీద్ ఇరావనీ ఖండించారు. ఇది రాజకీయ దురుద్దేశంతో కూడినదని విమర్శించారు. అమెరికా, ఇజ్రాయిల్‌ల రాజకీయ అజెండాలను అమలు చేసేందుకు భద్రతా మండలి నియమాలను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.



