Wednesday, January 7, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమీ బెదిరింపులు ఆపండి

మీ బెదిరింపులు ఆపండి

- Advertisement -

గ్రీన్‌లాండ్‌ అమ్మకానికి లేదు : ట్రంప్‌నకు స్పష్టం చేసిన డెన్మార్క్‌

కోపెన్‌హాగెన్‌ : గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటనపై డెన్మార్క్‌ ప్రధాని మెట్‌ ఫ్రెడరిక్‌సన్‌ ఘాటుగా స్పందించారు. ట్రంప్‌ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావని, అవి సన్నిహిత భాగస్వామ్య దేశానికి, దాని ప్రజలకు అవమానకరంగా ఉన్నాయని చెప్పారు. అమెరికా రక్షణ అవసరాలకు గ్రీన్‌ల్యాండ్‌కు వ్యూహాత్మక ప్రాధాన్యత ఉన్నదని, ఆ దీవిపై తమకు ఆసక్తి ఉన్నదని అట్లాంటిక్‌ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ తెలిపారు. దీనిపై ఫ్రెడరిక్‌సన్‌ స్పందిస్తూ ‘గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం అమెరికాకు ఉన్నదని చెప్పడంలో అర్థం లేదు. డానిష్‌ రాజ్యంలోని మూడు దేశాలలో ఏ ఒక్క దాని పైన వేటు వేసే అధికారం అమెరికాకు లేదు’ అని ఒక ప్రకటనలో తెలియజేశారు.

డెన్మార్క్‌ రాజ్యంలో గ్రీన్‌ల్యాండ్‌ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ప్రాంతంగా కొనసాగుతోంది. గ్రీన్‌ల్యాండ్‌పై వైఖరిని మార్చుకోవాలని ట్రంప్‌నకు ఫ్రెడరిక్‌సన్‌ హితవు పలికారు. ‘చారిత్రకంగా సన్నిహితంగా ఉన్న భాగస్వామ్య దేశంపై బెదిరింపులు ఆపాలని అమెరికాను కోరుతున్నా. మరో దేశంపై, దాని ప్రజలపై బెదిరింపులు తగవు. గ్రీన్‌ల్యాండ్‌ అమ్మకానికి లేదు’ అని ఆమె చెప్పారు. కాగా గ్రీన్‌ల్యాండ్‌ ప్రధాని జెన్స్‌-ఫ్రెడరిక్‌ నెల్సన్‌ కూడా ట్రంప్‌ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ‘మాకు గ్రీన్‌ల్యాండ్‌ కావాలని ట్రంప్‌ చెబుతున్నారు. వెనిజులాతో, సైనిక జోక్యంతో మాకు సంబంధాన్ని అంటగడుతున్నారు. అది కేవలం పొరబాటు మాత్రమే కాదు…అగౌరవం కూడా’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -