– నివారించదగ్గ హార్ట్ అటాక్‌లు
– ప్రతి రోజు వేలాది మందికి గుండెపోటు
– అత్యధిక మంది చావుకు ఇదే కారణం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వ్యాధులు రెండు రకాలు. మొదటి రకం నివారించ డానికి వీలు లేనివి. అంటే ఆ వ్యాధి రావాల్సి ఉంటే అనివార్యంగా మనం వాటి బారిన పడుతుంటాం. రెండో రకం నివారించదగిన వ్యాధులు. ముందస్తు జాగ్రత్తతో ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకునే అవకాశమున్న వ్యాధులివి. ఈ రెండో కోవకే చెందినది హార్ట్ అటాక్. ప్రజల్లో అవగాహనాలేమి, ఏమవుతుందిలే అనే నిర్లక్ష్య భావనతో అకస్మాత్తుగా గుండెలు ఆగిపోతున్నాయి. గుండె తగినంత ఫిట్నెస్ ఉంటే గుండె పోటు బారిన పడకుండా కాపాడుకునే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మారిన జీవనశైలితో ప్రజారోగ్యంలో పెరిగిన ఈ సమస్యపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా సెప్టెంబర్ 29న ప్రపంచ గుండె దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయా వ్యాధులతో మరణిస్తున్న వారిని పరిశీలిస్తే నివారించదగిన హార్ట్ అటాక్‌లతోనే ఎక్కువ మంది చనిపో వడం బాధాకరం. 2030 కల్లా కనీసం 50కోట్ల మందికి గుండెకు సంబంధించిన నివారణ, చికిత్సను అందించాలని ఇప్పటికే ఆయా దేశాల ప్రభుత్వాలను ప్రపంచ గుండె ఫెడరేషన్ సూచించింది. ఆ మేరకు ప్రణాళికలు రూపొందిం చుకుని అమలు చేయాలని కోరింది. భారతదేశంలోనూ హార్ట్ అటాక్‌లకు గురవుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ప్రతి రోజు గుండెపోటు కారణంగా 13 వేల మంది మరణిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో పరిశీలిస్తే ఒక్క హైదరాబాద్‌లోనే ప్రతి రోజు 80 నుంచి 100 మంది వరకు హార్ట్ అటాక్ బారిన పడుతున్నారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాల నుంచి దీనికి సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. కొంత మంది వైద్యులు వ్యక్తిగతంగా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మరికొంత మంది స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
సమతుల్యాహారం తీసుకోకపోవడం, రెగ్యులర్‌గా శారీరక వ్యాయామం లేకపోవడం, ధూమపానం, దీర్ఘకాలిక ఒత్తిడితో ఉండటం, ఊబకాయం, అధికంగా మద్యం సేవిం చడం, తగినంత నిద్రలేకపోవడం, తగినంతగా నీరు తీసు కోకపోవడం, అధికంగా ఉప్పును ఆహారంలో తీసుకోవడం వంటివి ప్రత్యక్షంగా, పరోక్షంగా గుండె జబ్బులకు దారి తీస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుండె స్పందన అసాధారణంగా లేదా మరీ నెమ్మదిగా ఉండటం, బీపీ నిరంతరం ఎక్కువగా ఉండటం, తేలికపాటి శారీరక శ్రమ చేసినప్పుడు కూడా అలసిపోవడం వంటివి గుండె ఆరోగ్యం దెబ్బ తీస్తున్నదనడానికి సంకేతాలు కావొచ్చనీ, అలాంటి సమయంలో మరింత జాగ్రత్త పడాలని వైద్యులు సూచిస్తున్నారు.
కార్డియాక్ ఫిట్‌నెస్ పెంచుకోవాలి
మారిన జీవనశైలి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కార్డియాక్ పిట్నెస్ పెంచుకోవాలని కార్డియాక్ రిహాబ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కార్డియాక్ రిహాబ్ ఫిజిషియన్ డాక్టర్ మురళీధర్ బాబీ సూచించారు. ఇటీవల హార్ట్ అటాక్ ల సంఖ్య పెరిగిందని ఆయన తెలిపారు. చాలా మందిలో ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత రిస్క్ శాతం పెరుగుతుందనీ, ఆ సమయంలో జాగ్రత్త పడితే మరోసారి రాకుండా రిహాబ్ ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ నెల 21న ఉదయం 6 గంటలకు హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని సంజీవయ్య పార్క్ వద్ద కార్డియాక్ రిహాబ్ రన్ నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటికే రిహాబ్‌తో అనేక మందిని ప్రాణాపాయం నుంచి కాపాడటం సంతోషంగా ఉందన్నారు.
డాక్టర్ మురళీధర్ బాబీ