రాష్ట్ర సర్కారుకు మున్సిపల్ కార్మికుల అల్టిమేటం
వర్షంలోనూ మున్సిపల్ కమిషనరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జీతాలు పెంచకుంటే సమ్మెలోకి వెళ్తామని మున్సిపల్ కార్మికులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలనీ, ఇతర సమస్యలను 15 రోజుల్లో పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. భారీ వర్షంలోనూ అక్కడే బైటాయించారు. అధికారులు వచ్చి తమ సమస్యలపై మాట్లాడే వరకూ కదలబోమని భీష్మించారు. దీంతో ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ భువనగిరి శ్రీనివాస్ వచ్చి కార్మికుల సమస్యలు విన్నారు. వారి నుంచి వినతిపత్రం స్వీకరించారు. తమ పరిధిలోని సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామనీ, ఇతర సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు పాలడుగు భాస్కర్, ప్రధాన కార్యదర్శి రాజమల్లు, కార్యదర్శి పి.సుధాకర్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ.రమ, రాష్ట్ర కమిటీ సభ్యులు వై.సోమన్న, యూనియన్ రాష్ట్ర ఆఫీస్ బేరర్లు వి.నాగమణి, డి.కిషన్, ఎర్రా నర్సింహులు, ఎ. వెంకటేష్, సావణపల్లి వెంకటస్వామి, కిల్లె గోపాల్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ..ఉన్నతాధికారుల మాటలను, ప్రభుత్వమిచ్చిన జీఓలను, సర్క్యూలర్లను కిందిస్థాయి అధికారులు లెక్కచేయట్లేదనీ, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 60 ఏండ్లు పైబడిన వారి స్థానంలోనూ, మరణించిన కార్మికుల స్థానంలోనూ ఎలాంటి షరతులు లేకుండా కుటుంబ సభ్యులను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని శాఖల్లోనూ పీఆర్సీ ఆధారంగా ఇచ్చిన జీఓలను అమలు చేస్తూ వేతనాలు చెల్లిస్తున్నారనీ, మున్సిపల్ శాఖలో మాత్రమే అందుకు విరుద్ధంగా ప్రత్యేక జీవోలను జారీ చేసి వేతనాలను తగ్గిస్తున్నారని వాపోయారు. కేటగిరీల వారీగా మున్సిపల్ కార్మికులకు వేతనాలు చెల్లించాలనీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించబోయే రెండో పీఆర్సీలో కనీస వేతనం రూ.26 వేలు నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీలో జీతాలు పెంచితే ఎప్పుడు జీఓ వస్తే అప్పటినుండే పెరిగిన వేతనాలు చెల్లించాలని కోరారు. మున్సిపల్ కార్మికులందర్నీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్పోరేషన్లలో హార్టికల్చర్, హరితహారం లాంటి విభాగాల్లో కార్మికులను నియమించి మున్సిపల్ కార్మికులకు చెల్లిస్తున్న వేతనాలను ఇవ్వట్లేదన్నారు. రాష్ట్రంలో వర్షాల తీవ్రత పెరిగినందున తక్షణమే కార్మికులందరికీ రెయిన్ కోట్లు, ఇతర పనిముట్లను అందించాలని కోరారు. స్వచ్ఛ ఆటో కార్మికులకు ఇండ్లను అప్పగించి వారి బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుంటున్నదనీ, వారి వేతనాలను కార్పోరేషన్లే చెల్లించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ప్రాపర్టీ ట్యాక్స్‌లను పెంచి వసూలు చేసైనా వారికి జీతాలివ్వాలన్నారు. ఉదయం ఐదు గంటలకే విధుల్లోకి రావాలని ఒత్తిడి చేయడం దుర్మార్గమన్నారు. ఒక్కపూటనే కార్మికులతో పనిచేయించాలని డిమాండ్ చేశారు.
జీతాలు పెంచకుంటే సమ్మె
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES