నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మళ్లీ సమ్మె సైరన్ మోగింది. వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో సోమవారం నుంచి టాలీవుడ్‌లో అన్ని సినిమా షూటింగ్‌లు నిలిచిపోనున్నాయి. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు విధులకు హాజరుకాబోమని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్పష్టం చేసింది.
ఫెడరేషన్ నాయకులు తమ ప్రధాన డిమాండ్లను మీడియా ముందుంచారు. కార్మికుల వేతనాలను తక్షణమే 30 శాతం పెంచాలని వారు కోరుతున్నారు. అంతేకాకుండా, పెంచిన వేతనాలను ఏ రోజుకు ఆ రోజే చెల్లించాలని మరో కీలకమైన షరతు విధించారు. ఈ నిబంధనలకు అంగీకరించిన నిర్మాతలకు చెందిన సినిమా పనుల్లో మాత్రమే తాము పాల్గొంటామని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఇప్పటికే తెలుగు ఫిలిం ఛాంబర్ కు సమ్మె నోటీసు అందజేశారు.