Wednesday, March 25, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుసమ్మె.. అంతిమ ఆయుధం

సమ్మె.. అంతిమ ఆయుధం

- Advertisement -

బతిమిలాడుతాం..విన్నవిస్తాం..వినకపోతే తిరగబడతాం
పొరకల్ని, పారల్ని తిరగేసి మున్సిపల్‌ కార్మికుల సత్తా ఏంటో చూపుతాం
పర్మినెంట్‌, రూ.26 వేల జీతం, కారుణ్య నియామకాల హామీలు నెరవేర్చాల్సిందే : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
ధర్నాచౌక్‌కు వేలాదిగా తరలొచ్చిన మున్సిపల్‌ కార్మికులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మున్సిపల్‌ కార్మికుల పర్మినెంట్‌, కనీస వేతనం రూ.26 వేలు, కారుణ్య నియామకాల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలనీ, రాష్ట్ర ప్రభుత్వం వీటిపై స్పందించకుంటే సమ్మెనే అంతిమ ఆయుధంగా మల్చుకుని ముందుకెళ్తామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు పాలడుగు భాస్కర్‌ అల్టిమేటం జారీ చేశారు. తమ డిమాం డ్లను నెరవేర్చాలని మున్సిపల్‌ అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులను బతిమిలాడుతున్నాం.. వినతిపత్రా లు ఇస్తున్నాం.. అప్పటికీ వినకపోతే మున్సిపాల్టీల్లోని కార్మికులు పొరకల్ని, పారల్ని తిరగేసి తిరగబడి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మంగళవారం హైదరాబాద్‌ లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో తెలంగాణ మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌(సీఐటీయూ అను బంధం) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దీనికి 26 జిల్లాల నుంచి మున్సిపల్‌ కార్మికులు వేలాదిగా తరలొచ్చారు. ఆ యూనియన్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పాలడుగు సుధాకర్‌ అధ్యక్షత జరిగిన ఈ ధర్నాలో భాస్కర్‌ మాట్లాడుతూ..మున్సిపాల్టీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, ఎన్‌ఎంఆర్‌, ఫిక్స్‌డ్‌ పే తదితర పద్దతుల్లో పనిచేస్తున్న మున్సిపల్‌ సిబ్బందినందరినీ పర్మినెంట్‌ చేయాలనీ, రెండో పీఆర్సీలో కనీస వేతనం రూ.26 వేలు నిర్ణయించాలనీ, కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. మున్సిపాల్టీల్లో కూడా 12 గంటల పనివిధానం అమలు చేయడం దారుణమన్నారు. మున్సిపల్‌ కార్మికులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జారీ చేసిన జీవోలు వర్తించవని అధికారులు మాట్లాడటం విడ్డూరంగా ఉంద న్నారు. పాత జీవోలన్నింటినీ వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికులకు కనీస రక్షణ సదుపాయాలు కల్పించకపోవడంతో పనిచేసే క్రమంలో ప్రమాదాలు జరిగి అనేకమంది కార్మికులు మరణిస్తున్నారని వాపోయారు. అటువంటివారికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించక పోవడం అన్యాయమన్నారు. అనేక మున్సిపాల్టీల్లో ప్రమాదం లో మరణించిన కార్మికులస్థానంలో వారి కుటుంబ సభ్యులకు పనికల్పించకుండా ఇబ్బందులకు గురిచేయడాన్ని తప్పుబట్టారు. తక్షణమే కారుణ్యనియామకాల సమస్యను పరిష్కరించకుంటే మున్సిపల్‌ డైరెక్టరేట్‌ వద్ద దీక్షలకు పూను కుంటామని ప్రకటించారు. మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడాన్ని నిరసి స్తూ రాష్ట్రవ్యాప్త సమ్మెకు సన్నద్ధం కావాలనీ, మిగతా యూని యన్లతో కలిసి ఐక్యంగా పోరుబాట పట్టేందుకు మున్సిపల్‌ కార్మికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం జీవో నెర.60 ప్రకటించినప్పటికీ జీఓలో పేర్కొన్న కేటగిరీల వారీ వేతనాలను అమలు చేయడంలేదని విమ ర్శించారు. మున్సిపల్‌ కార్మికులతో 12 గంటల పాటు పని చేయిస్తున్నారనీ, పనిభారాన్ని తగ్గించి ఒక్కపూట పని అమ లు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు లక్షలాది రూపాయల జీతం తీసుకుంటున్నారనీ, తమకు కనీస వేతనం అడిగితే ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. మున్సిపల్‌ కార్మికుల దహన సంస్కారాలకు రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పాలడుగు సుధాకర్‌ మాట్లాడుతూ.. ప్రజాపాలనలో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిందేనని సర్కారుకు అల్టిమేటం జారీచేశారు. జీహెచ్‌ఎంసీలో విలీనం చేసిన కార్పొరేషన్ల, మున్సిపాల్టీల కార్మికులకు జీహెచ్‌ఎంసీ సిబ్బందికి ఇచ్చే వేతనాలు ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. స్థానిక వనరుల నుంచి మున్సిపల్‌ సిబ్బందికి వేతనాలు ఇవ్వాలనే నిర్ణయం సరిగాదనీ, ప్రభుత్వమే ట్రెజరరీ ద్వారా వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర మహిళా కన్వీనర్‌ బుజమ్మ, రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.ఉప్పలయ్య, జన్ను ప్రకాష్‌, ఎం.శ్రీనివాస్‌, రాష్ట్ర కార్యదర్శులు రాజనర్సు, ఆకుల వెంకటేష్‌, జినక శ్రీనివాస్‌, ఎస్‌.వెంకటస్వామి, ఎం మహేష్‌, సి.మల్లేష్‌, సంజీవ, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పద్మశ్రీ, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.శ్రీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -