మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క
మహిళల 15 ఏండ్ల కల నెరవేర్చాం : మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
బంజారాహిల్స్‌లో మహిళా భవన్ ప్రారంభం
నవతెలంగాణ-సిటీబ్యూరో
మహిళల సమగ్రాభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క అన్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్‌లోని ఎన్‌బీటీ నగర్‌లో బుధవారం మహిళా భవన్‌ను మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతతో కలిసి ప్రారంభిం చారు.. అనంతరం రూ.29.80 లక్షలతో నిర్మించనున్న అంగన్వాడీ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. చాలా కాలంగా మాటలకే పరిమితమై ఆచరణకు నోచు కోని పనులు ఇప్పుడు హైదరాబాద్ మొత్తం అమలవుతున్నాయని, దానికి నిదర్శనం ఈ మహిళా భవనం ప్రారంభోత్సవమేనని అన్నారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళా సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మహిళలు అన్ని రంగాలలో ఎదిగేందుకు వెన్నుదన్నుగా నిలుస్తోంద న్నారు. స్వయం ఉపాధి పథకాలతో మహిళలు వారి కాళ్ల మీద నిలబడేలా ప్రోత్సహిస్తోందని చెప్పారు. మేయర్ మాట్లాడుతూ.. ఎన్‌బీటీ నగర్‌లో మహిళా భవన్ నిర్మించాలన్న ఈ ప్రాంత ప్రజల 15 ఏండ్ల కలను ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ నెరవేర్చిందన్నారు. ఈ క్రమంలో ఎదురైన కోర్టు కేసుల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పని చేశామన్నారు. మహిళల వివిధ కార్యక్రమాల నిర్వహణకు, శిక్షణలు, గ్రూప్ సమావేశాలకు వేదికగా మహిళా భవన్ ఉపయోగ పడనుందన్నారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి పాల్గొన్నారు.