జాతీయ విద్యావిధానం-2020, వీబీఎస్‌ఏ -2025 రద్దు చేయాలి : వామపక్ష విద్యార్ధి సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ
నవతెలంగాణ – ముషీరాబాద్
దేశవ్యాప్తంగా నేడు కార్మిక సంఘాలు, రైతు సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు వామపక్ష విద్యార్ధి సంఘాలు సంఘీభావం తెలుపుతున్నట్టు ప్రకటించారు. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దేశ వ్యాప్త సమ్మెకు సంఘీభావంగా ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐడీఎస్‌ఓ, ఏఐఎఫ్‌డీఎస్, ఏఐఎస్‌బీ, ఏఐపీఎస్‌యూ రాష్ట్ర కమిటీలు మద్దతు తెలిపి పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా టి.నాగరాజు, ఎస్.రజనీకాంత్ (ఎస్‌ఎఫ్‌ఐ), పుట్ట లక్ష్మణ్ (ఏఐఎస్‌ఎఫ్), పొడపంగి నాగరాజు, పి.మహేష్ (పీడీఎస్‌యూ) నితీష్ (ఏఐడీఎస్‌ఓ), రాకేష్ (పీడీఎస్‌యూ), పల్లె మురళీ (ఏఐఎఫ్‌డీఓ) మాట్లాడారు. దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు విద్యారంగంలో మతోన్మాద విధానాలు అమలు చేస్తూ జాతీయ విద్యావిధానం పేరుతో ప్రభుత్వ విద్యను కూనీ చేస్తుందన్నారు.
ఒక పక్క జాతీయ విద్యావిధానం అమలు చేస్తామని చెబుతూనే కేంద్ర బడ్జెట్‌లో మాత్రం సరిపడా నిధులు కేటాయించడం లేదని విమర్శించారు. జీడీపీలో కేవలం 0.3 శాతం మాత్రమే బడ్జెట్‌లో కేటాయింపు చేశారని, 2.3శాతం కేటాయింపు చేసి చేతులు దులుపుకొన్నారని తెలిపారు. ఈ నిధులతో జాతీయ విద్యావిధానం లక్ష్యాలు ఎలా సాధిస్తారని ప్రశ్నించారు. వికసిత్ భారత్ అదిష్టాన్ బిల్లు -2025 పేరుతో విద్యను కార్పొరేట్, ప్రయివేటు వ్యక్తులకు అప్పజెప్పి దేశంలో పేదలకు ఉన్నత విద్య అందకుండా చేస్తోందని అన్నారు. రైతులు, కార్మికులు, విద్యార్ధులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలకు వ్యతిరేకంగా తీసుకొస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాటానికి సార్వత్రిక సమ్మెకు మద్దతు తెలుపుతున్నట్టు చెప్పారు. సమ్మెలో విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.కిరణ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లెనిన్ గువేరా, కె.అశోక్ రెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర నాయకులు డా: గ్యార నరేష్, పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకులు శ్యామ్, నవీన్, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.



