జిల్లా ఎస్పీ రావుల గిరిధర్
నవతెలంగాణ – వనపర్తి
విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటూ కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని, ఆ స్థాయితో తల్లిదండ్రులు గర్వపడేలా చేయాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. పెద్దమందడి ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థుల సహకారంతో పాఠ్య పుస్తకాలలోని విజ్ఞాన భాండాగారాన్ని పిల్లల్ని ఆకర్షించేలా తరగతి గదులకు కార్టూన్లు, సైంటిస్టుల చిత్రాలతో పెయింటింగ్ వేయించారు. పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు పెయింటింగ్ వర్క్ ను, పాఠశాల తరగతి గదులను ఎస్పీ చేతుల మీదుగా ప్రారంభించారు. విద్యార్థులకు బూట్లను పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థుల ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ యువత భవితవ్యం కోసం ఏర్పాటు చేసిన ఈ ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విజయం సాధించాలని, మీరు అనుకున్న లక్ష్యాలను సాధించాలనుకుంటే నిబద్ధతతో కఠోర సాధన చేసి, ప్రణాళికబద్ధంగా చదవడం ద్వారా మీ కలలను సాధించుకోవచ్చని సూచించారు.
యువత తమ సమయాన్ని వృధా చేయకుండా కఠోర సాధనపై దృష్టి సారిస్తే అనుకున్న ఉద్యోగాలను సాధింగలరని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. బాలలకు తరగతి గదిలోనే ఉజ్వలమైన భవిష్యత్తు ఉందన్నారు. ప్రజలకు చట్టాలు, శిక్షలు సప్రవర్తన పై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ కష్టపడి చదివి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, మాతృభూమికి మంచి పేరు తేవాలన్నారు. ప్రజలకు సేవలు అందించేలా ఎదగాలన్నారు. చాలా సంత్సరాల క్రితం చదువుకోవడానికి సరియైన వసతులు లేవని, ఇప్పుడు పరిస్థితి మారిందని, ప్రభుత్వ పాఠశాలలో అన్ని మౌలిక వసతులు కల్పించి ఉన్నతమైన నాణ్యమైన సాంకేతిక విద్యను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎన్నో నైపుణ్యాలతో విద్యను బోధిస్తున్నారన్నారు. విద్యార్థులు మంచి పుస్తకం, మంచి స్నేహితున్ని ఎంచుకుంటే చాలా సాధించవచ్చన్నారు. జిల్లాలో రాష్ర్టంలో ఉన్న ప్రముఖులు, విద్యావంతులు, అధికారులు చాలావరకు అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదివి వచ్చినవారే అన్నారు. విజయం సాధించిన వారి జీవితాలను విద్యార్ధులు స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు
అనంతరం ఈ కార్యక్రమానికి సహకరించిన యువతను పాఠశాల ప్రధానోపాధ్యాయులను శాలువాతో ఎస్పీ సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెద్దమందడి విద్యాశాఖ అధికారి,మంజులత, పెద్దమందడి ఎస్సై, శివకుమార్, ఏ సి టి ఓ ప్రసన్న రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, బండి శ్రీనివాసులు, ఉపాధ్యాయులు జీకే శ్రీనివాస్, రోజా రాణి, కిరణ్ కుమార్, సుచిత్ర, ఈశ్వర్, మధు, పాఠశాల, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.