నవతెలంగాణ – అశ్వారావుపేట
అంగవైకల్యం ఏ పనికీ అడ్డుకాదని,మనసులో నమ్మకం, కృషి ఉంటే ఎలాంటి శిఖరాన్నైనా అధిరోహించవచ్చని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఇటీవల నిర్వహించిన పాఠశాల విభాగం క్రీడా పోటీలలో పరుగు పందెంలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించి అశ్వారావుపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 8 వ తరగతి విద్యార్థి నాగరంజిత్ ప్రతిభాపాటవాలు పట్ల ఆయనను అభినందించారు.
పాక్షికంగా వికలాంగుడు అయినప్పటికీ చదువుల్లోను ఆటల్లోను ముందంజలో ఉండడం అతని ధైర్యసాహసాలకు నిదర్శనం అని పాఠశాల లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రత్యేకంగా విద్యార్థిని సత్కరించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా పట్టుదలతో శ్రమిస్తే రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించగలరని తెలిపారు.
అలాగే విద్యార్థిని ప్రోత్సహించిన ఉపాధ్యాయులను అభినందించి నాగరంజిత్‌ను సన్మానించారు .భవిష్యత్తులో మరింత మెరుగైన ప్రదర్శన చేయడానికి అవసరమైన రన్నింగ్ క్రీడా సామగ్రి కొనుగోలు చేసేందుకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మండల అధికారి పొన్నగంటి ప్రసాదరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.హరిత, ఉపాధ్యాయుల పాల్గొన్నారు.



