Friday, March 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరెండు లక్షల మెట్రిక్‌ టన్నుల చొప్పున యూరియా ఇవ్వండి

రెండు లక్షల మెట్రిక్‌ టన్నుల చొప్పున యూరియా ఇవ్వండి

- Advertisement -

కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కోరిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

తెలంగాణకు ఖరీప్‌ సీజన్‌లో మొదటి మూడు నెలలకుగానూ నెలకు 2 లక్షల మెట్రిక్‌ టన్నుల చొప్పున యూరియా సరఫరా చేయాలని కేంద్ర రసాయన శాఖ మంత్రి జేపీ.నడ్డాను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఖరీఫ్‌ సీజన్‌కు యూరియా అవసరాల గురించి జేపీ నడ్డా ఫోన్‌ చేసి ఆరా తీశారని తుమ్మల తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న యూరియా యాప్‌ ఫలితాలపై కేంద్ర మంత్రి సంతృప్తి చేశారని తెలిపారు. ఆ యాప్‌ను దేశవ్యాప్తంగా అమలు చేసే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారని పేర్కొన్నారు. మంత్రి తుమ్మల, రాష్ట్ర అవసరాలను కేంద్ర మంత్రికి వివరిస్తూ.. ఖరీఫ్‌ 2026 సీజన్‌కు సంబంధించిన యూరియా కేటాయింపులను 10.00 లక్షల మెట్రిక్‌ టన్నుల నుండి 11.50 లక్షల మెట్రిక్‌ టన్నులకు పెంచాలని కోరారు. రైతులు పత్తి నుండి మక్క సాగు వైపు మొగ్గుచూపడం, ప్రారంభ నిల్వలు తక్కువగా ఉండటం వల్ల రాష్ట్రానికి మొత్తం 11.50 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం ఉందని తెలిపారు.

అలాగే జూలై, ఆగస్టు నెలల్లో గరిష్ట వినియోగం నమోదవుతుందనీ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా బఫర్‌ స్టాక్‌ సిద్ధం చేయడం అత్యవసరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలలో ప్రతి నెలకు 2 లక్షల మెట్రిక్‌ టన్నుల చొప్పున యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని అభ్యర్థించారు. అదేవిధంగా రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి రాష్ట్రానికి గరిష్ట కేటాయింపులు చేయాలనీ, ప్లాంట్‌ తరచూ నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మార్చి నెలలో రాష్ట్రానికి కేటాయించిన 1.34 లక్షల మెట్రిక్‌ టన్నులలో సుమారు 0.65 లక్షల మెట్రిక్‌ టన్నుల కొరత ఏర్పడిందని వివరించారు. యూరియా యాప్‌తో పారదర్శకత పెరిగి బ్లాక్‌ మార్కెటింగ్‌, నిల్వలు దాచిపెట్టడం వంటి సమస్యలు తగ్గుతున్నాయని తుమ్మల తెలిపారు. ఈ యాప్‌ అమలు వల్ల రబీ సీజన్‌లో వినియోగం నియంత్రణలోకి వచ్చిందని తెలిపారు. యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా హామీనిచ్చారని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -