Saturday, November 22, 2025
E-PAPER
Homeజాతీయంఎన్నికల కమిషన్‌కు సుప్రీం నోటీసులు

ఎన్నికల కమిషన్‌కు సుప్రీం నోటీసులు

- Advertisement -

కేరళ సర్‌ పిటిషన్లను విడిగా విచారించనున్న ధర్మాసనం

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌)పై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. కేరళలో ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాల సర్‌ను తొందరపాటుతో అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, సీపీఐ(ఎం), ఇతర రాజకీయ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల కమిషన్‌ స్పందన కోరింది. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యే వరకు సర్‌ను పొడిగించాలనేది పిటిషనర్ల ప్రధాన డిమాండ్‌. ఈ నేపథ్యంలో కేరళ నుంచి వచ్చిన పిటిషన్లను సుప్రీంకోర్టు విడిగా విచారిస్తోంది. బీహార్‌ సర్‌ను పరిగణనలోకి తీసుకునే 26వ తేదీన కేరళ రాష్ట్రం నుంచి వచ్చిన పిటిషన్లను మాత్రమే వివరంగా విచారిస్తామని జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఎస్వీఎన్‌ భట్టి, జస్టిస్‌ జోరుమల్య బాగ్చిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. ఎన్నికల కమిషన్‌ అంతలోపు తన సమాధానం దాఖలు చేయాలని ఆదేశించింది.

కేరళ ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌… ఎన్నికల కమిషన్‌ స్థానిక సంస్థల ఎన్నికలతో ప్రారంభించి సర్‌ను ముగించాలని లక్ష్యంగా పెట్టుకుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉందని, అందువల్ల ఈ విషయంలో కొంత అత్యవసర పరిస్థితి నెలకొందని తెలిపారు. సర్‌ను రద్దు చేయాలని కోరుతూ సీపీఐ(ఎం) కేరళ రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయన తరపున సీనియర్‌ న్యాయవాది రంజిత్‌ కుమార్‌ వాదనలు వినిపించారు. కేపీసీసీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్‌, ముస్లిం లీగ్‌ ప్రధాన కార్యదర్శి పికె కున్హాలికుట్టి, ఉత్తరప్రదేశ్‌, పుదుచ్చేరి నుంచి వచ్చిన పిటిషన్లపై కూడా ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్‌ 26కి వాయిదా వేసింది.

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియతో పాటు నిర్వహిస్తున్న సర్‌ ప్రక్రియ పరిపాలనా ఇబ్బందులకు కారణమవు తోందని, అధికారులపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తోందని ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌లో ప్రధాన వాదన. అయితే ఎస్‌ఐఆర్‌ రాజ్యాంగ విరుద్ధమని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తన పిటిషన్‌లో పేర్కొంది. ఇతర రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన మిగిలిన పిటిషన్లను డిసెంబర్‌ మొదటి లేదా రెండవ వారంలో విచారణకు స్వీకరించాలని ధర్మాసనం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా సర్‌ ప్రక్రియను నిర్వహించాలనే ఎన్నికల కమిషన్‌ నిర్ణయం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల సమూహాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే విచారిస్తోంది. ఇప్పటికే నవంబర్‌ 11న, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితాల ఎస్‌ఐఆర్‌ను సవాలు చేస్తూ డీఎంకే, పశ్చిమ బెంగాల్‌ కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకులు వరుసగా దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టును అత్యున్నత న్యాయస్థానం వేర్వేరు ప్రతిస్పందనలను కోరింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -