సర్కారు కీలక నిర్ణయం
జీవో 9 అమలు కోసం ముమ్మర ప్రయత్నాలు
కేంద్రాన్నీ పార్టీ చేద్దాం
రాష్ట్రపతి, గవర్నర్ వద్ద పెండింగ్ ఫైళ్లపైనా వివరణ కోరనున్న ప్రభుత్వం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ల జీవో నెంబర్ 9, ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసి, హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసి ఎన్నికల నిర్వహణకు అనుమతించాలని సుప్రీంను కోరనున్నారు. ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైనందున దీనిలో హైకోర్టు జోక్యం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించనుంది. అదే సమయంలో జీవో 9 అమలు చేసేందుకు అనుమతించాలని కోరనుంది. అలాగే బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీ చేసిన తీర్మానం, గవర్నర్‌కు రెండుసార్లు పంపిన బిల్లులు, అవి రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పార్టీగా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది.
బిల్లుల్ని గవర్నర్, రాష్ట్రపతి పెండింగ్ పెట్టడం అంశంపై సుప్రీంకోర్టు ద్వారానే వివరణ తీసుకోవాలని భావిస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు జూమ్ సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా సుప్రీంకు వెళ్లేందుకు ఉన్న అన్ని దారుల్ని వెతకాలనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూనే, స్థానిక ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు. జీవో నెంబర్ 9ని సవాలు చేస్తూ గతంలో కొందరు వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున అక్కడే వాదనలు వినిపించుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆ కేసును కొట్టివేసిన విషయం తెలిసిందే.
అయితే హైకోర్టు ఈ కేసులో ప్రభుత్వ నిర్ణయాలపై స్టే విధించిన నేపథ్యంలో దాన్ని సవాలు చేస్తూ మళ్లీ సుప్రీంలో వాదనలు వినిపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇదే కేసులోని ప్రత్యర్థి పార్టీలు ఇప్పటికే సుప్రీంలో కేవియెట్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ఇంప్లీడ్ అయిన కక్షిదారుల వాదనలు విన్న తర్వాతే, ప్రభుత్వ వాదనను వినాల్సి ఉంటుందని న్యాయనిపుణులు చెప్తున్నారు. హైకోర్టు ఉత్తర్వులు ప్రతి శుక్రవారం అర్థరాత్రి రాష్ట్ర ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి అందాయి. దీనిపై శనివారం సీఎం రేవంత్‌రెడ్డి న్యాయనిపుణులు, అందుబాటులో ఉన్న మంత్రులో మాట్లాడారు. మరోవైపు బీసీ సంఘాలు కూడా సుప్రీంకు వెళ్లాలని నిర్ణయించాయి.
హైకోర్టు స్టే ఆర్డర్‌లో…
బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో నెంబర్ 9ని పక్కన పెట్టి, 50 శాతం రిజర్వేషన్ల ప్రకారం స్థానిక ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్‌లో పేర్కొంది. బీసీలకు పెరిగిన రిజర్వేషన్ల శాతాన్ని జనరల్ కేటగిరిగా మార్పు చేసుకోవాలని సూచించింది. ఈ ప్రకారం ఎన్నికల నిర్వహణకు ఎలాంటి అభ్యంతరాలు లేవని పేర్కొంది. ఈ సందర్భంగా ఆర్డర్ కాపీలో పలు సుప్రీంకోర్టు తీర్పుల్ని ఉటంకించింది.
ప్రతిపక్షాల విమర్శలకు చెక్
స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టుకు వెళ్లడం వల్ల ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టొచ్చని రేవంత్ సర్కార్ రాజకీయంగా వ్యూహ రచన చేస్తోంది. ఇప్పటికే బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత వల్లే హైకోర్టులో తీర్పు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వచ్చిదంటూ ప్రచారాన్ని మొదలు పెట్టాయి. ఈ కేసులో ఆ రెండు పార్టీలు కూడా ఇంప్లీడ్ అయ్యేలా ఒత్తిడి తేవాలని సీఎం రేవంత్‌రెడ్డికి కొందరు మంత్రులు సూచించినట్టు తెలిసింది. ఇప్పటి వరకు బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు బీసీ రిజర్వేషన్లను రాజకీయాల లబ్ది కోసమే వాడుకుంటున్నాయి తప్ప, చిత్తశుద్ధితో వ్యవహరించట్లేదు. సుప్రీంకు వెళ్లడం వల్ల ఇదే విషయాన్ని ప్రజల్లోకి కూడా తీసుకెళ్లాలని కాంగ్రెస్‌పార్టీ భావిస్తోంది.