సరెండర్‌ అవ్వండి

Surrender– ‘బిల్కిస్‌ బానో’ దోషులకు సుప్రీంకోర్టు ఆదేశాలు..
న్యూఢిల్లీ : ‘బిల్కిస్‌ బానో’ కేసులో దోషులకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. లొంగిపోవటానికి మరింత సమయం ఇవ్వటం కుదరదనీ, సరెండర్‌ అవ్వాలని ఆదేశించింది. ఈ విషయంలో వారు (దోషులు) దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. 2002 గుజరాత్‌ అల్లర్ల సమయంలో బాధితురాలు బిల్కిస్‌ బానోపై సామూహిక లైంగికదాడి, ఆమె కుటుంబ సభ్యులను హత్య చేసినందుకు దోషులకు జీవిత ఖైదు విధించబడింది. ఆ తర్వాత గుజరాత్‌ ప్రభుత్వం రెమిషన్‌ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయటంతో వారు విడుదలవటం, దీనిపై బిల్కిస్‌ బానో సుప్రీంకోర్టును ఆశ్రయించటంతో దోషులు తిరిగి లొంగిపోవాలని న్యాయస్థానం ఆదేశించిన విషయం విదితమే. దోషులు లొంగిపోవటానికి సుప్రీంకోర్టు విధించిన గడువు రేపటితో(జనవరి 21) ముగుస్తుంది. దోషులు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బి.వి నాగరత్న, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది.
ఈ కేసులో 11 మంది దోషులకు గుజరాత్‌ ప్రభుత్వం మంజూరు చేసిన రెమిషన్‌ను రద్దు చేస్తూ, రెండు వారాల్లోగా జైలు అధికారుల ముందు లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఈ నెల 8న ఆదేశించింది. వేర్వేరు వ్యక్తిగత కారణాలతో లొంగిపోయేందుకు మరింత సమయం కావాలని ముగ్గురు దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి అభ్యర్ధనలను తోసిపుచ్చిన కోర్టు.. సరెండర్‌ అవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

Spread the love