Sunday, September 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసరెండరై..క్యాడర్‌ను బతికించుకోండి

సరెండరై..క్యాడర్‌ను బతికించుకోండి

- Advertisement -

మావోయిస్టులకు డీజీపీ జితేందర్‌ సూచన
హింసామార్గానికి భవిష్యత్‌ లేదు
ఇప్పటికే అనేకమంది లొంగిపోతున్నారు
పరువు పోతుందనే కొందరు వెనకాడుతున్నారు : ‘నవతెలంగాణ’తో డీజీపీ మనోగతం

ప్యారక వాసుదేవాచారి

మావోయిస్టు పార్టీ అగ్రనేతల మధ్య సాగుతోన్న లేఖల వార్‌పై రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు నిశితంగా దృష్టి సారించారు. ఆయుధాలను వీడి, వివిధ ప్రాంతాల్లోని క్యాడర్‌తో సంప్రదించి, ప్రశాంత జీవితంపై నిర్ణయం తీసుకుంటామని మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వర్‌రావు ఎలియాస్‌ అభరు పేరుతో పత్రికా ప్రకటన విడుదలైన విషయం తెలిసిందే. ఈ లేఖను ఖండిస్తూ, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమనీ, అభరు వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు జగన్‌ మరో లేఖను పత్రికలకు విడుదల చేశారు. ఈ రెండు అంశాలపై పోలీసు ఉన్నతాధికారులు రెండుమూడ్రోజులగా నిశితంగా దృష్టి సారించారు.

దండకారణ్యంతో పాటు దానిని ఆనుకొని ఉన్న మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో కేంద్రం ఒకపక్క ‘ఆపరేషన్‌ కగార్‌’ పేరుతో నిరంతర యుద్దాన్ని సాగిస్తున్నది. వరుసబెట్టి మావోయిస్టు అగ్రశ్రేణి నాయకులు ఒకరి తర్వాత ఒకరు నేలకొరిగి పోతున్నారు. ఈ దశలో వారి మధ్య సమన్వయ లోపం ఏర్పడి, భిన్నాభిప్రాయాలతో అగ్రశ్రేణి నాయకుల నుంచి పత్రికా ప్రకటనలు విడుదయ్యాయి. దీనితో మావోయిస్టు పార్టీలో నెలకొన్న అంతర్గత కలహాలపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టిపెట్టారు. ఇదే అంశంపై శనివారం ‘నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి’తో డీజీపీ జితేందర్‌ ప్రత్యేకంగా మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్న పరిస్థితిపై వ్యాఖ్యానించారు. మావోయిస్టు పార్టీలో గత కొన్నేండ్లుగానే అంతర్గత కలహాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయనీ, గణపతి కార్యదర్శిగా పక్కకు తప్పుకున్న తర్వాత నాయకత్వ పగ్గాల కోసం తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడిందని డీజీపీ చెప్పారు. కొంత సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగినా, కొత్త నాయకత్వం నంబాల కేశవ్‌రావు నేతృత్వంలో పార్టీని ముందుకు నడపాలని చూసినా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న ప్రజా సంక్షేమ చర్యలు మావోయిస్టుల మార్గం నుంచి ఆదివాసీలు ప్రజాస్వామ్యం వైపునకు రావటానికి బలమైన కారణాలుగా నిలిచాయని చెప్పారు. నంబాల కేశవ్‌రావు ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టు పార్టీ మరింత దిక్కుతోచని పరిస్థితికి చేరుకున్నదని వివరించారు. ఈ నేపథ్యంలోనే వారిలో మిగిలి ఉన్న నాయకుల మధ్య అభిప్రాయ భేదాలను బహిర్గతపరుస్తూ లేఖలు వచ్చాయని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితిని తాము నిశితంగా పరిశీలిస్తున్నామనీ, అందుకు తగిన వ్యూహాలు తమ వైపు నుంచి ఎప్పటికీ సాగుతూనే ఉంటాయని తెలిపారు.

జనజీవన స్రవంతిలో కలవాలి
నిజానికి కొందరు నాయకులు లొంగిపోవాలనే అభిప్రాయంతో ఉన్నా, ఆ మార్గాన నడిస్తే తమ పరువు ఎక్కడ పోతుందోనన్న భయం మరికొందరిలో ఉందని డీజీపీ జితేందర్‌ అభిప్రాయపడ్డారు. అందుకే వారు వెనకా, ముందు ఆలోచిస్తున్నట్టుగా తమకు సమాచారముందన్నారు. సాగుతున్న పోరులో ఇప్పటికే ఎంతగానో నష్టపోయారనీ, ఇప్పటికైనా నాయకులు లొంగుబాటులో నడిచి, అమాయకులైన వారి కేడర్‌ ప్రాణాలను కాపాడు కోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా స్వామ్య పంథాలో మావోయి స్టులు కోరుకుంటున్న సమాజ మార్పులు తీసుకురావచ్చని చెప్పారు. ఇప్పటికైనా సమయం మించి పోలేదనీ, ఆయుధాలను వీడి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసి, కొత్త జీవితాన్ని ప్రారంభించాలని డీజీపీ మావోయిస్టులకు పిలుపునిచ్చారు. లొంగిపోయినవారికి ప్రభుత్వం ఇప్పటికే అన్ని విధాలా సహాయ సహకారాలను అందిస్తూ ఆదుకుంటున్నదని ఆయన చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -