Monday, September 15, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంనేపాల్‌ ప్రధానిగా సుశీలా కర్కి బాధ్యతలు

నేపాల్‌ ప్రధానిగా సుశీలా కర్కి బాధ్యతలు

- Advertisement -

అవినీతిని అంతం చేస్తానని హామీ
నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని ‘అమరవీరులు’గా ప్రకటన, పరిహారం
గాయపడిన వారికి ఉచిత వైద్యం

ఖాట్మాండు : నేపాల్‌ తాత్కాలిక ప్రధాన మంత్రిగా సుశీలా కర్కి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రధానమంత్రి కర్కి శుక్రవారం ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసింది. ఆదివారం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన కర్కి భద్రతా దళం, ప్రభుత్వ అధికారులతో సమావేశం నిర్వహించారు. మేలో నేపాల్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శాంతిభద్రతలను పునరుద్ధరించడంపై ప్రధానంగా దృష్టి పెట్టారు. నిరసనకారుల డిమాండ్‌కు అనుగుణంగా అవినీతిని అంతం చేస్తానని హామీ ఇచ్చారు. జెన్‌ జెడ్‌ తరం ఆలోచనలకు అనుగుణంగా మనమంతా పనిచేయాలని కర్కి అధికారులకు తెలిపారు. ‘నిరసనకారుల బృందం డిమాండ్‌ చేస్తున్నది అవినీతి అంతం, సుపరిపాలన, ఆర్థిక సమానత్వం. మీరు, నేను వీటిని నెరవేర్చడానికి దృడ నిశ్చయంతో ఉండాలని తెలిపారు. ఆదివారం సింఘా దర్బార్‌లోని ప్రభుత్వ సముదాయంలో సమావేశాలు ప్రారంభమయ్యే ముందు నిరసనల్లో మరణించిన వారికి కర్కి ఒక నిమిషం మౌనం పాటించారు.

కాగా, రెండు రోజుల నిరసనల్లో 72 మంది మరణించారని, 191 మంది గాయపడ్డారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏకనారాయణ్‌ ఆర్యల్‌ ఆదివారం తెలిపారు. అలాగే నిరసనల్లో మరణించిన వారిని ప్రభుత్వం అమరవీరులుగా గుర్తించిందని ఆర్యల్‌ ప్రకటించారు. వీరి కుటుంబాలకు ఒక్కొక్కరికీ 10 లక్షల నేపాలీ రూపాయిల పరిహారం అందచేస్తామని తెలిపారు. అలాగే, గాయపడిన వారికి ఉచిత వైద్య సహాయం అందించాలని ఆసుపత్రులను ప్రభుత్వం ఆదేశించిందని, ఇప్పటికే ఉచిత చికిత్స ప్రారంభమయిందని తెలిపారు.

కర్కి నియామకాన్ని స్వాగతించిన అమెరికా
నేపాల్‌ తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా సుశీలా కర్కి నియామకాన్ని అమెరికా స్వాగతించింది. అశాంతి నుంచి స్థిరత్వం వైపు అడుగుగా దీన్ని వర్ణించింది. ఈ మేరకు నేపాల్‌లోని అమెరికా రాయబారి డిన్‌ ఆర్‌ థాంప్సన్‌ ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు. సంక్షోభ సమయంలో ప్రజాస్వామ పద్ధతిలో పరిష్కారానికి నిబద్ధత చూపినందుకు అధ్యక్షులు రామచంద్ర పౌడెల్‌, యువనాయకులను ప్రశంసించారు. అలాగే, ఈ ప్రక్రియలో నేపాలీ సైన్యం, చీఫ్‌ జనరల్‌ అశోక్‌ రాజ్‌ సిగ్డెల్‌ పాత్రను కూడా ఆయన గుర్తించారు. తాత్కాలిక ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి అమెరికా ప్రభుత్వం ఎదురుచూస్తుందని తెలిపారు. నేపాల్‌ నష్టాలపై అమెరికా విచారం వ్యక్తం చేస్తుందని, అయితే ఈ రాజకీయ పరిష్కారం శాంతియుతంగా నేపాల్‌ ముందుకు సాగడానికి ఒక అవకాశాన్ని అందిస్తుందని అమెరికా రాయబారి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -