టింబర్ డిపో రెన్యువల్‌కు రూ.12 వేల లంచం తీసుకుంటూ ఎఫ్‌ఎస్‌ఓ అరెస్ట్
నవతెలంగాణ - ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో గురువారం ఆదిలాబాద్ ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. టింబర్ డిపో రెన్యువల్ కోసం లంచం తీసుకుంటున్న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (ఎఫ్‌ఎస్‌ఓ)ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఖానాపూర్ పట్టణానికి చెందిన కామాజీ రవితేజ తన టింబర్ డిపో రెన్యువల్ కోసం గత ఆగస్టు నెలలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఖానాపూర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అయిండ్ల రవీందర్ రూ.50 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందింది. అనంతరం రూ.15 వేలకు ఒప్పందం కుదిరినట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా గురువారం రూ.12 వేల లంచం తీసుకుంటుండగా ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధుకర్ తన బృందంతో దాడి చేసి ఎఫ్‌ఎస్‌ఓ రవీందర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ మధుకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఆదిలాబాద్ ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064 లేదా సెల్‌ఫోన్ నంబర్ 9154388963కు ఫిర్యాదు చేయాలని సూచించారు.





కామెంట్‌లు (0)