నవతెలంగాణ - హైదరాబాద్ : దీపావళికి అభిమానులు స్వీట్లు పంపిస్తారని ఆశించిన ఓ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన పేరు మీద కొందరు ఆకతాయిలు ఖరీదైన వస్తువులను క్యాష్ ఆన్ డెలివరీ (సీఓడీ)లో ఆర్డర్ చేయడంతో ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన తమిళనాడులోని మదురైలో చోటుచేసుకుంది.
మదురైకి చెందిన వీరమణి.. దీపావళి సందర్భంగా అభిమానులు స్వీట్లు పంపించేందుకు వీలుగా తన ఫోన్ నంబర్, ఇంటి చిరునామాను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే కొందరు నెటిజన్లు ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేశారు. ఆయన పేరు మీద టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు వంటి ఖరీదైన వస్తువులను ఆర్డర్ చేశారు. వీటిలో ఓ టీవీ ధర రూ.1.69 లక్షలని ప్రచారం జరిగింది.
అరగంట వ్యవధిలోనే 15 ఆర్డర్లు వచ్చాయని, వాటన్నింటికీ చెల్లించేందుకు తన వద్ద డబ్బులు లేవని వీరమణి ఆవేదన వ్యక్తం చేశారు. రూ.70 కోట్ల విలువైన టీ-90 యుద్ధ ట్యాంకు, అంబులెన్స్, రాకెట్ కూడా ఆర్డర్ చేశారంటూ కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. అయితే వీటిలో నిజమైన ఆర్డర్లు ఎన్ని, ప్రాంక్ పోస్టులు ఎన్ని అనేది స్పష్టత లేదు.
ఈ వ్యవహారంతో డెలివరీ సిబ్బంది కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాను ఆర్డర్ చేయని వస్తువులను తీసుకొచ్చిన డెలివరీ బాయ్స్‌కు సమాధానం చెప్పాల్సి వచ్చిందని వీరమణి తెలిపారు. ప్రాంక్‌లు ఆపాలంటూ ఇన్‌స్టాగ్రామ్ వీడియోల ద్వారా విజ్ఞప్తి చేశారు.
అయినా వేధింపులు ఆగకపోవడంతో చివరకు ఊరు విడిచి వెళ్తున్నట్లు మరో వీడియోలో వెల్లడించారు. ఖరీదైన వస్తువులు ఆర్డర్ చేశారంటూ తనను తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.






కామెంట్‌లు (0)