Magazines

బొమ్మెనలో సమగ్ర భూ సర్వేపై అవగాహన

1 గంట క్రితం

Land Survey
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 2 నిమిషాల చదవడం

పైలట్ ప్రాజెక్టుగా మల్యాల, వెంకటాపూర్ గ్రామాల ఎంపిక

 నవతెలంగాణ-జన్నారం

గ్రామాల్లో భూముల రీసర్వే ప్రక్రియపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా జన్నారం మండలం మల్యాల గ్రామపంచాయతీ పరిధిలోని బొమ్మెన గ్రామంలో మంగళవారం సమగ్ర భూ సర్వేపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తహశీల్దార్ బక్కయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సర్వే శాఖ అధికారులు గ్రామస్తులకు భూ సర్వే విధానం, దాని ప్రాధాన్యత, భూములకు సంబంధించిన వివరాల నమోదుపై అవగాహన కల్పించారు.


ఈ సందర్భంగా సర్వే శాఖ డీఐ శేషారావు మాట్లాడుతూ.. గ్రామాల్లో భూముల రీసర్వే నిర్వహణపై ప్రజలు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. భూముల సర్వే ద్వారా భూములకు సంబంధించిన వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేసే ప్రక్రియ గురించి వివరించారు. సర్వే సమయంలో భూములకు సంబంధించిన సమాచారం, హద్దులు తదితర అంశాలపై ప్రజలకు స్పష్టత ఉండటం ముఖ్యమని తెలిపారు. భూ సర్వే ప్రక్రియపై ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు.


 పైలట్ ప్రాజెక్టుగా రెండు గ్రామాల ఎంపిక..

జన్నారం మండలంలోని మొత్తం 29 గ్రామపంచాయతీల పరిధిలో భూ సర్వే ప్రక్రియను ప్రజలకు చేరువ చేసే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద మల్యాల, వెంకటాపూర్ గ్రామాలను ఎంపిక చేసినట్లు డీఐ శేషారావు వెల్లడించారు. ఎంపిక చేసిన గ్రామాల్లో సర్వే ప్రక్రియకు సంబంధించిన అంశాలను ప్రజలకు వివరించి, భూ సర్వేపై అవగాహన పెంపొందించనున్నట్లు తెలిపారు.

 భూ సర్వేపై ప్రజలకు అవగాహన అవసరం

భూములకు సంబంధించిన వివరాలు, సరిహద్దులు, సర్వే ప్రక్రియపై ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉండటం అవసరమని అధికారులు వివరించారు. భూ సర్వేకు సంబంధించిన సందేహాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి తగిన సమాచారం తెలుసుకోవాలని సూచించారు. గ్రామస్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సర్వే ప్రక్రియపై అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, కురు భాగ్యలక్ష్మి పోచన్న, లైసెన్సుడ్ సర్వేయర్ కపిల్ చంద్రతో పాటు సంబంధిత అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్