సీఈవో సుదర్శన్‌రెడ్డికి బీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదు
ముస్లింలపై దాడులు చేస్తున్న సీఎం : మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లింలపై దాడులు చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఆయన చేస్తున్న ప్రయత్నాలను, చౌకబారు మాటలను పరిశీలించాలని కోరారు. ఈ మేరకు సీఈవో సుదర్శన్‌రెడ్డిని గురువారం హైదరాబాద్‌లో శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూధనాచారితో పాటు ఇతర నాయకులు కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోతుందన్న భయంతో, ఆ తర్వాత తన పదవికి గండం ఉంటుందన్న ఆందోళనతో రేవంత్‌రెడ్డి చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే పథకాలు రద్దవుతాయంటూ ప్రజలను బెదిరిస్తున్నారని అన్నారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలన వల్ల ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబికుతున్నదని చెప్పారు. కల్లుతాగిన కోతిలా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నిక జరుగుతున్న నియోజక వర్గం పరిధిలో సమావేశం పెట్టి, హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టడమనేది ప్రజాస్వా మ్యానికే మాయని మచ్చ అన్నారు.
ఈ ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్ష పాతంగా జరిగేలా ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులతోపాటు అధికార యంత్రాంగం కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వివరించారు. అధికార బలాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రతి పక్ష పార్టీ సభలను విచ్ఛిన్నం చేసి, అధికారి పార్టీ సభలను మాత్రం విజయవంతం చేసుకుంటున్నారని చెప్పారు. బీఆర్‌ఎస్ నాయకులు షకీల్ ఇంటికి కాంగ్రెస్ నాయకులు వెళ్లి బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. జై తెలంగాణ అని అనని రేవంత్‌రెడ్డి ముమ్మాటికీ తెలంగాణ ద్రోహి, శత్రువు అంటూ మండి పడ్డారు.
ఆయనకు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇది పేరుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాత్రమే కానీ నాలుగు లక్షల మంది ఓటర్లున్నారని వివరించారు. స్థానిక పోలీసులు, డీసీపీ లు, ఏసీపీలు, రమేష్ నాయక్ అనే పోలీ సు అధికారి ఎవరి కనుసన్నల్లో, ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరికి తొత్తుగా పని చేస్తున్నాడో తెలుసన్నారు. ఖాకీ బట్టలకు సమాజంలో ఉండే ప్రతిష్టను ఆయన దిగజారుస్తున్నారని అన్నారు. సెంట్రల్ ఆర్మ్‌డ్ రిజర్వ్‌డ్ పోలీసులను పంపాలని కోరారు. ఈ ఎన్నికతో రేవంత్‌రెడ్డికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందన్నారు. ఆయనకు జీవితంలో మరోఎన్నిక చూసే పరిస్థితి ఉండక పోవచ్చని చెప్పారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమైందని మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. ఓ రౌడీకి, లేడీకి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగే అవకాశముందన్నారు. సెంట్రల్ పారా మిలటరీ దళాలను దింపాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలను మోసం చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. మైనార్టీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నదని చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌లో చేరని బీఆర్‌ఎస్ ముస్లిం నేతలపై పథకం ప్రకారమే దాడులు జరుగుతున్నాయని వివరిం చారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు పల్లె రవికుమార్, రామ చంద్రు నాయక్‌తో పాటు పలువురు ముస్లిం నాయకులు తదితరులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిబంధనలను ఉల్లంఘించిందని న్యూఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ కు బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కెఆర్ సురేష్ రెడ్డి ఫిర్యాదు చేశారు.



