Wednesday, February 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోండి

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోండి

- Advertisement -

– రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్‌ఎస్‌ నాయకుల ఫిర్యాదు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ నాయకులు, ప్రభుత్వ, పోలీసు అధికారులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారనీ, వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణి కుముదినిని మంగళవారం హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు కురువ విజరు కుమార్‌, బొమ్మెర రామ్మూర్తి, సుర్వి యాదయ్య గౌడ్‌, లీగల్‌ సెల్‌ నాయకులు సదానంద్‌ తదితరులు కలిసి ఫిర్యాదు చేశారు. బీఆర్‌ఎస్‌ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌ సమర్పించిన ఫిర్యాదును అంజేశారు. ఓటర్లను రాజకీయంగా సమీకరించే ఉద్దేశంతో అధికార పార్టీకి చెందిన ఒక మంత్రి, తెలంగాణ గెజిటెడ్‌ అధికారులు, ఉపాధ్యాయులు, స్టేట్‌ ట్రెజరీ ఆఫీసర్‌, టీఎన్జీవో నాయకులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారని వివరించారు. ఇది అవినీతిపూరిత ఎన్నికల పద్ధతులకు పాల్పడటమే కాకుండా, అధికారిక హోదాను, ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమే అవుతుందని తెలిపారు. బీఆర్‌ఎస్‌ మహబూబ్‌ నగర్‌ ప్రతినిధి కెసి నరసింహులు సమర్పించిన ఫిర్యాదుకు సంబంధించి ఆ జిల్లాలోని పోలీసు యంత్రాంగం పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండేలా ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీని బహిరంగంగా ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్‌కు ఓటు వేయాలంటూ ఓటర్లను ప్రత్యక్షంగా బెదిరించడం వంటి ఘటనలకు అధికార పార్టీ నాయకులు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. చట్టవిరుద్ధమైన పద్ధతులను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. తప్పు చేసిన అధికారులు, రాజకీయ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శక వాతావరణంలో జరిగేలా చూడాలని సూచించారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మున్సిపల్‌ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారనీ, ఆయనపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ నాయకులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు మరో ఫిర్యాదు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -