– ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
గ్రామాల్లో కొనసాగుతున్న ఉపాధి హామీ పథకాన్ని కూలీలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ అన్నారు. గురువారం మండలంలోని చౌట్ పల్లి గ్రామంలోని పల్లె చెరువు గుట్ట వద్ద కొనసాగుతున్న ఉపాధి హామీ పథకం పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధి హామీ కూలీల హాజరు రిజిస్టర్ ను తనిఖీ చేసి, కూలీల హాజరు తీసుకున్నారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి పని ప్రదేశంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒకరు వేసవిలో ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఎండల తీవ్రత పెరుగుతున్నందున ఉపాధి హామీ పని ప్రదేశంలో కూలీలకు ఇబ్బంది లేకుండా వసతులు కల్పించాలని ఈజీఎస్ సిబ్బందికి సూచించారు. కూలీలు ఎండ నుండి సేద తీరేందుకు టెంట్లను, వడదెబ్బకు గురి కాకుండా ఉండేందుకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పని ప్రదేశంలో అందుబాటులో ఉంచాలన్నారు. ఉపాధి కూలీలకు గిట్టుబాటు అయ్యేలా పని కల్పించాలని ఈజిఎస్ అధికారులను ఆదేశించారు.ప్రతి ఉపాధి కూలికి చేతినిండా పని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి శివ, ఫీల్డ్ అసిస్టెంట్ సాదుల్లా, తదితరులు ఉన్నారు.



