జెనీవా : ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ముసాయిదా శాంతి ప్రణాళికపై స్విట్జర్లాండ్‌లోని జెనీవా నగరంలో ఆదివారం చర్చలు మొదలయ్యాయి. అమెరికా, ఉక్రెయిన్ దేశాల సీనియర్ అధికారులు, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల మధ్య సంప్రదింపులు జరుగుతు న్నాయి. మరోవైపు అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్, విదేశాంగ మంత్రి మార్కో రుబియో కూడా జెనీవా చేరుకున్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఘర్షణలను నివారించడానికి ట్రంప్ 28 సూత్రాల ప్రణాళికను రూపొందించిన విషయం తెలిసిందే. అయితే ఇది రష్యాకు అనుకూలంగా ఉన్నదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ట్రంప్ ప్రణాళికలో రష్యా చేసిన అనేక డిమాండ్లను చేర్చడం జరిగింది.
తూర్పున ఉన్న డాన్‌బాస్ ప్రాంతాన్ని ఉక్రెయిన్ అప్పగించాలని ట్రంప్ తన ప్రణాళికలో ప్రతిపాదించారు. అయితే ఇందుకు ఉక్రెయిన్ ఇప్పటికే నిరాకరించింది. అంతేకాదు…ట్రంప్ చేసిన మరికొన్ని ప్రతిపాదనలకు సైతం ఉక్రెయిన్ నో చెప్పింది. ఉక్రెయిన్ తన సైన్యాన్ని పరిమితం చేయాలని, నాటోలో చేరాలన్న యోచనకు స్వస్తి చెప్పాలని ట్రంప్ తన ప్రణాళికలో సూచించారు. ప్రణాళికకు ఆమోదం తెలిపేందుకు ట్రంప్ గురువారం వరకూ గడువు ఇచ్చారు. అయితే అందులో మార్పులు చేయాలని ఉక్రెయిన్ పట్టుపడుతోంది. ట్రంప్ సూచనలకు అంగీకరించడమంటే లొంగిపోవడమే అవుతుందని ఉక్రెయిన్, యూరోపియన్ అధికారులు తెలిపారు.
తాను ప్రతిపాదించిన ప్రణాళిక తుది ఆఫర్ కాదని, అందులో మార్పులు చేర్పులు జరగవచ్చునని ట్రంప్ చెప్పారు. గతంలో ఇరు దేశాల మధ్య అనేక సందర్భాలలో చర్చలు జరిగినప్పటికీ పురోగతి కన్పించకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. కాగా ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్న పశ్చిమ దేశాలు జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న జీ20 సదస్సు సందర్భంగా సంయుక్త ప్రకటన విడుదల చేస్తూ ట్రంప్ ప్రతిపాదనల కారణంగా పోరాడే శక్తిని ఉక్రెయిన్ కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ ప్రకటనపై బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్స్, ఐర్లాండ్, ఫిన్లాండ్, నార్వేతో పాటు ఈయూ నేతలు సంతకాలు చేశారు. కెనడా, జపాన్ ప్రధానులు కూడా దీనిని బలపరిచారు. జొహన్నెస్‌బర్గ్ సదస్సుకు అమెరికా తన ప్రతినిధులను పంపలేదు. దీనిని తాము బహిష్కరిస్తున్నామని ట్రంప్ గతంలోనే ప్రకటించారు.
ట్రంప్ ప్రణాళికపై జెనీవాలో చర్చలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



