16 క్యాచ్‌లు జారవిడిచి అగ్రస్థానంలోనే..
టి20 ప్రపంచకప్-2026లో నమోదైన రికార్డులివే..
స్పోర్ట్స్ కరస్పాండెంట్
ఐసిసి టి20 ప్రపంచకప్-2026లో 14 రికార్డులు నమోదయ్యాయి. టైటిల్ కైవసం చేసుకున్న టీమిండియా టోర్నీ చరిత్రలో ఫైనల్లో అత్యధిక పరుగులు కొట్టిన జట్టుగా రికార్డుపుటల్లోకెక్కగా.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన సంజు శాంసన్ ఫైనల్, సెమీఫైనల్‌తోపాటు కీలక సూపర్-8 మ్యాచుల్లో వరుసగా మూడు అర్ధసెంచరీ కొట్టి నయా చరిత్ర లిఖించాడు. అత్యధిక పరుగులు కొట్టిన బ్యాటర్ల జాబితాలో ఫర్హాన్(పాకిస్తాన్) 383పరుగులతో అగ్రస్థానంలో నిలువగా.. జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి 14 వికెట్లు చొప్పున తీసిన బౌలర్లుగా నిలిచారు. అలాగే బౌండరీలు, సిక్సర్లు కూడా ఈ టోర్నీల అత్యధికంగా నమోదయ్యాయి.
ఇండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇరుజట్లు కలిపి 499పరుగులు చేసి టి20 చరిత్రలో అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్‌గా నిలిచింది. ఇక టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఫైనల్లో 18బంతుల్లోనే న్యూజిలాండ్‌పై అర్ధసెంచరీ పూర్తిచేసి రికార్డుల్లోకెక్కాడు. ఫైనల్లో న్యూజిలాండ్‌పై భారతజట్టు పవర్ ప్లే 6ఓవర్లలోనే 92పరుగులు చేసిన జట్టుగా నిలిచింది. ఇక సంజు శాంసన్ ఫైనల్లో 89పరుగులు కొట్టిన భారత తొలిబ్యాటర్‌గా నిలువగా.. 2026 టి20 ప్రపంచకప్‌లో 200కు పైగా స్కోర్‌ను 14జట్లు నమోదు చేశాయి. ఇవిగాక మరికొన్ని రికార్డులూ ఈ ప్రపంచకప్‌లో నమోదయ్యాయి. అవేమిటంటే..
బౌండరీలు, సిక్సర్లలోనూ టాప్‌లోనే…
అత్యధిక సిక్సర్లు, అత్యధిక ఫోర్లు 2026 ప్రపంచకప్‌లోనే నమోదయ్యాయి. గ్రూప్, సూపర్-8, సెమీస్, ఫైనల్లో కలిపి మొత్తం 780 సిక్సర్లు నమోదయ్యాయి. ఈ రికార్డు గత ప్రపంచకప్ (517సిక్సర్లు)ను బ్రేక్ చేసింది. 2024 టి20 ప్రపంచకప్‌లో 517సిక్సర్లు నమోదయ్యాయి. అలాగే ఓవరాల్‌గా 1434 ఫోర్లు నమోదయ్యాయి. ఇది గత టోర్నమెంట్‌తో పోల్చిచూస్తే అధికం. 2024 టి20 ప్రపంచకప్‌లో 961ఫోర్లు వచ్చాయి. టోర్నీ మొత్తమ్మీద అన్ని జట్లు కలిపి ఫోర్లు, సిక్సర్ల రూపంలోనే 18.28పరుగులు రాబట్టాయి. ఇది గతంలో 15.42 శాతంగా ఉంది. అది కూడా 2007 టి20 ప్రపంచకప్‌లో నమోదైనదే. ఇక ఫోర్లు, సిక్సర్లు అత్యధికంగా కొట్టిన జట్లలో భారతజట్టు అగ్రస్థానంలో నిలువగా.. 2వ స్థానంలో నిలిచిన వెస్టిండీస్, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి. భారతజట్టు టోర్నీ మొత్తమ్మీద 147ఫోర్లు కొట్టి అగ్రస్థానంలో ఉండగా… ఆ తర్వాత వెస్టిండీస్, న్యూజిలాండ్ జట్లు 106ఫోర్లతో 2వ స్థానంలో నిలిచాయి.
పవర్ ప్లేలో స్పిన్నర్లతోనే..
స్పిన్నర్లతో పవర్ ప్లేలో బౌలింగ్ చేయించి వ్యూహాత్మక విజయాన్ని సాధించిన జట్లూ ఉన్నాయి. 2026 టి20 ప్రపంచకప్ పవర్ ప్లేలో పేసర్లకంటే స్పిన్నర్లే అద్భుతంగా బౌల్ చేశారు. ఫీల్డింగ్ నిబంధనల దృష్ట్యా స్పిన్నర్లు టోర్నీ మొత్తమ్మీద 186.2ఓవర్లను పవర్‌ప్లేలోనే బౌల్ చేశారు. ఎకానమీగానూ 8.23సగటుతో 56వికెట్లను తీసి విజయాన్ని సాధించారు. వీరిలో ఆర్యన్ దత్, ముజీబ్-ఉర్-రెహ్మాన్, విల్ జాక్స్, అకేల్ హొసేన్ వంటి స్పినర్లు ఓపెనింగ్ కాంబినేషన్ బ్యాటర్లను కట్టడి చేయడంలో సఫలీకృతులయ్యారు. ఇది టీమిండియాకు మరోరకంగా కలిసొచ్చిందని చెప్పవచ్చు. టాప్-3 బ్యాటర్లు ప్రత్యర్ధిజట్టు స్పిన్నర్లు వేసిన బంతులను సునాయాసంగా గ్యాలరీకి తరలిచారు. ఇది ఫైనల్లో న్యూజిలాండ్‌పై భారత్‌కు కలిసొచ్చింది. ప్రధానంగా సంజు శాంసన్, అభిషేక్ శర్మ ధనా ధన్ బ్యాటింగ్‌తో చెలరేగారు.
పార్ట్‌టైమ్ బౌలర్‌నుంచి.. రెగ్యులర్ బౌలర్ వరకు..
టి20 ప్రపంచకప్ టోర్నీలో పార్ట్‌టైం బౌలర్‌గా బౌల్ చేసి.. రెగ్యులర్ బౌలర్‌గా ఎదిగిన ఘనత న్యూజిలాండ్ స్పిన్నర్ రచిన్ రవీంద్రకు దక్కుతుంది. న్యూజిలాండ్ జట్టు గ్రూప్ దశలో ఆడిన 4మ్యాచుల్లో కేవలం 5ఓవర్లు మాత్రమే వేసిన రచిన్ రవీంద్ర.. ఆ తర్వాత సూపర్-8లో రెగ్యులర్ బౌలర్‌గా ఎదిగాడు. ఈ క్రమంలోనే ఏడు వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై 3వికెట్లు తీసి కివీస్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. అలాగే పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా కూడా పార్ట్‌టైం బౌలర్ అవతారం ఎత్తి భారత్ స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మను ఔట్ చేయగా.. ఐడెన్ మార్‌క్రమ్(దక్షిణాఫ్రికా) కూడా పార్ట్‌టైమ్ స్పిన్నర్‌గా బౌల్ చేసి ఇషాన్ కిషన్‌ను డకౌట్‌కే ఔట్ చేశాడు.
షాక్‌లోనే ఆస్ట్రేలియా..
2026 టి20 ప్రపంచకప్‌లో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఆశించిన స్థాయిలో రాణించలేదని చెప్పవచ్చు. స్టార్ బౌలర్లు పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ లేకుండా టోర్నీ బరిలో దిగిన ఆసీస్.. గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఆ జట్టు గ్రూప్ దశ మ్యాచుల్లో జింబాబ్వే, శ్రీలంక చేతిలో ఓటమిపాలైంది. దీంతో గ్రూప్-బి నుంచి జింబాబ్వే టాప్‌లో, ఆతిథ్య శ్రీలంక 2వ స్థానంలో నిలిచి సూపర్-8కు చేరాయి. దుర్భేద్య జట్లలో ఒకటైన ఆసీస్.. 2021లో తొలిసారి ఈ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత మూడుసార్లు సెమీస్ వరకు మాత్రమే చేరగల్గింది. హేజిల్‌వుడ్, కమిన్స్ స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్న బౌలర్లు కీలక పోరులో నిరాశపరిచారు. హార్డ్‌హిట్టర్లు గ్రీన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, స్టొయినీస్ వైఫల్యంతో గ్రూప్ దశను దాటలేకపోయింది.
శ్రీలంకకు కలిసిరాని సొంత పిచ్..
సొంత పిచ్‌లపై చెలరేగి ఆడే శ్రీలంక.. లీగ్ దశలో జింబాబ్వే చేతిలో ఓటమిపాలైంది. ఈ టోర్నీలో మ్యాచ్‌లన్నీ సొంత పిచ్‌పై ఆడిన శ్రీలంక జట్టుకు ఏమీ కలిసి రాలేదు. గ్రూప్ దశలో కేవలం 2వ స్థానంలో నిలిచి సూపర్-8కు చేరిన ఆతిథ్య శ్రీలంక జట్టు సూపర్-8లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ జట్టుకు దక్కిన గొప్ప విజయాల్లో ఒకటి ఆస్ట్రేలియాపై గెలుపు మాత్రమే. స్పిన్నర్లకు కలిసొచ్చే కొలంబో, పల్లెకెలే మైదానాల్లో ఆ జట్టు స్పిన్నర్లు ఘోరంగా విఫలమయ్యారు.
మరోవైపు ప్రత్యర్ధి జట్టు స్పిన్నర్లు ఆదిల్ రషీద్, లిమ్ డాసన్, రచిన్ రవీంద్ర, మిఛెల్ సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్ అద్భుతంగా రాణించి శ్రీలంక పిచ్‌లపై 107వికెట్లు పడగొట్టారు. పర్యాటక జట్టు స్పిన్నర్లు 6.69సగటుతో ఒక్కో వికెట్ సాధిస్తే… శ్రీలంక స్పిన్నర్లు 24.26సగటుతో ఒక్కో వికెట్ తీసి నిరాశపరిచారు. దీంతో ఆ జట్టు సెమీస్‌కు చేరడంలో విఫలమైంది. ఇక రెండో సెమీఫైనల్లో సంజు శాంసన్ 15పరుగుల వద్ద ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను ఇంగ్లండ్ కెప్టెన్ హారీ బ్రూక్ చేజార్చాడు.క్యాచ్ డ్రాప్‌తో ఫలితం తారుమారు అయింది.



