వ్యక్తిగా బయటికి వెళ్తున్నా..శక్తిగా తిరిగొస్తా…
నా పంచాయతీ ఆత్మగౌరవం కోసమే
మండలిలో ఎమ్మెల్సీ, కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు
తన పదవికి రాజీనామాపై భావోద్వేగం
బీఆర్‌ఎస్‌లో టార్గెట్ చేసి బయటకు పంపారంటూ ఆవేదన
తనకు మద్దతివ్వాలంటూ వామపక్షాలు, సానుభూతిపరులకు విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ‘తెలంగాణ జాగృతి’ రాజకీయ పార్టీగా మారి పోటీ చేస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ప్రజల తరపున నిలబడి పోరాటం చేయటం ద్వారా బలీయమైన శక్తిగా ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు. వామపక్షాలు, మావోయిస్టుల సానుభూతి పరులు, మనుగడ కొనసాగించలేకపోతున్న మావోయిస్టులు, ప్రజాస్వామ్య పద్ధతుల్లో పనిచేసే వారు తనకు మద్దతివ్వాలని ఆమె అభ్యర్థించారు. సోమవారం శాసనమండలికి హాజరైన కవిత… ఎమ్మెల్సీ పదవికి తాను చేసిన రాజీనామాను ఆమోదించాలని చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తన రాజీనామాకు దారి తీసిన కారణాలను వివరిస్తూ ఆమె తొలుత మండలిలోనూ, అనంతరం గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద ప్రసంగించారు. ఒక వ్యక్తిగా మండలి నుంచి బయటకు వెళ్తున్న తాను శక్తిగా మళ్లీ తిరిగొస్తానని ధీమా వ్యక్తం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తి, నైతికత ఏమాత్రం లేని బీఆర్‌ఎస్‌ను వీడుతున్నందుకు తనకు సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ఒక పార్టీకి ఉండాల్సిన లక్షణాలు బీఆర్‌ఎస్‌కు లేవని విమర్శించారు.
ఆ పార్టీ నియమ, నిబంధనలు వ్యంగ్యంగా ఉంటాయని ఎద్దేవా చేశారు. అక్కడ రాత్రికి రాత్రే క్రమశిక్షణా సంఘం పుట్టుకొస్తుందనీ, షోకాజ్ నోటీసులివ్వకుండానే సస్పెండ్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పోరాటం ఆస్తుల కోసం కాదని, ఆత్మగౌరవం కోసమని స్పష్టం చేశారు. ‘నాకు దైవభీతి ఎక్కువ, ఇష్ట దైవం లక్ష్మి నర్సింహస్వామితోపాటు నా కుమారులపై ప్రమాణం చేసి చెబుతున్నా… నాకు వారితో (కేసీఆర్ కుటుంబంతో) ఆస్తుల పంచాయతీ లేదు. ప్రశ్నిస్తున్నాననే కారణంతో నాపై కక్ష కడితే ఆత్మగౌరవం కోసం పోరాటం మొదలుపెట్టా…’ అంటూ కవిత భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. బీఆర్‌ఎస్‌పైనా, ఆ పార్టీ నేతల వ్యవహారశైలిపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్సీ పదవికి నాలుగు నెలల క్రితం తాను రాజీనామా చేసినా ఆమోదించలేదని గుర్తుచేశారు. ఆవేశంతో కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మండలి చైర్మెన్ సూచించారనీ, అన్ని విధాలుగా ఆలోచించాకే రాజీనామా చేశానని స్పష్టం చేశారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశమిచ్చిన బీఆర్‌ఎస్‌కు, నిజామాబాద్ స్థానిక సంస్థల సభ్యులకు కవిత ధన్యవాదాలు తెలిపారు. బీఆర్‌ఎస్ బంధనాల నుంచి విముక్తి పొందానని చెప్పారు.
స్వీయ రాజకీయ అస్థిత్వం కోసం చేరిక
తెలంగాణకు స్వీయ రాజకీయ అస్థిత్వం కోసం తాను బీఆర్‌ఎస్‌లో చేరినట్టు కవిత తెలిపారు. నిజామాబాద్ ఎంపీగా గెలిచిన తాను అతి తక్కువ కాలంలో నిజామాబాద్ – పెద్దపల్లి రైల్వేలైన్‌ను సాధించానని చెప్పారు. తెలంగాణ రాగానే తనపై కుట్రలు మొదలు పెట్టారనీ, ప్రశ్నించినందుకే తనపై కక్ష కట్టారని వాపోయారు. తానెప్పుడు కాంట్రాక్టర్లు, బడాబాబులతో లేనని తెలిపారు. పేదలు, అంగన్‌వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, అణగారిన వర్గాల పేద ప్రజల మధ్య ఉన్నానని చెప్పారు. బీఆర్‌ఎస్ పదేండ్ల హయాంలో రాష్ట్రానికి, ప్రజలకు చేసిందేమీ లేదని కవిత ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడాన్ని, దాని పేరును బీఆర్‌ఎస్‌గా మార్చడాన్ని, ధర్నా చౌక్ ఎత్తివేతను తాను పార్టీలో అంతర్గతంగా వ్యతిరేకించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన హామీల కోసం బీజేపీపై పోరాడిన సమయంలో తనను ఆ పార్టీ వేధిస్తే అండగా నిలబడలేదని చెప్పారు.
అందువల్ల ఆ బీఆర్‌ఎస్‌లో తాను ఉండటం సమంజసం కాదన్నారు. కేసీఆర్ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేస్తానంటూ ఉద్యమ సమయంలో చెప్పారని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినా.. పదేండ్లలో రద్దు చేయకపోగా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్యను పెంచారని గుర్తుచేశారు. ఉద్యమకారులను విస్మరించారని తప్పుపట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేందుకు సహకరించిన వారిని గుర్తించడంలో విఫలమయ్యారని చెప్పారు. బీఆర్‌ఎస్ పార్టీలో ద్వంద్వవైఖరి కనిపిస్తున్నదని కవిత విమర్శించారు. కేసీఆర్‌ను కాంగ్రెస్ విమర్శిస్తే మౌనంగా ఉంటున్నారనీ, అదే కేటీఆర్, హరీశ్‌రావులపై విమర్శలు గుప్పిస్తే మాత్రం ఎదురుదాడి చేస్తున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ చేసిన వైఫల్యాలనే కాంగ్రెస్ కొనసాగిస్తున్నదని ఆమె విమర్శించారు. రాజకీయ పార్టీల్లో, చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించారు.
ఉద్యమకారులకు దక్కని గౌరవం
తెలంగాణ కోసం పోరాడిన లక్షలాది మంది ఉద్యమకారులకు బీఆర్‌ఎస్‌లో ఇసుమంతైన గౌరవం దక్కలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. మహిళలకు అవకాశాలివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తొమ్మిదిన్నరేండ్ల బీఆర్‌ఎస్ హయాంలో రూ.14 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి రూ.12 లక్షల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. ఒక్క ఇరిగేషన్ కోసమే రూ.1.89 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేశారని వివరించారు. పేదలకు ఇండ్లు ఇవ్వలేదని విమర్శించారు. అదే మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెండేండ్లుగా మహిళలు, నిరుద్యోగులు, ఉద్యమకారులను మోసం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు పార్టీలు ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు తెలంగాణ జాగతిలో చేరాలని ఆమె పిలుపునిచ్చారు.



