నవతెలంగాణ – హైదరాబాద్: విద్యానగర్ లోని వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాశాల ప్రధానాచార్యులు డా.కె.ప్రభు, నిపుణత వ్యక్తిగా సహ ఆచార్యులు డా. ఎం. మహంతయ్య పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం కాళోజి యొక్క చిత్రపటానికి పూలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రధానాచార్యులు డా.కె.ప్రభు మరియు మహంతయ్యలు మాట్లాడుతూ…. కాళోజి గ్రంథాలయ ఉద్యమంలో, స్వాతంత్ర్య పోరాటంలో, తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉద్యమ జీవిగా బ్రతికాడని అన్నారు. రచయితగా, కవిగా కాలానుగుణంగా సమాజాన్ని చైతన్యవంతం చేసే రచనలు ఒకవైపు చేస్తూనే, మరోవైపు తెలంగాణ ప్రాంతానికి, సంస్కృతికి, భాషకు జరుగుతున్న అవమానాలపై తన కలానికి, గళానికి పదును పెట్టాడని అన్నారు.
లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ గురించి కాళోజి నారాయణరావు’ పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిది’అని చెప్పిన వాక్యాలు కాళోజీకి కూడా వర్తిస్తాయని అన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ‘ నా గొడవ’ అనే కావ్యంగా రచించారని అన్నారు. కాళోజి నారాయణరావు భాషను పలుకుబడుల భాష, బడి పలుకుల భాష అని రెండు రకాలుగా విభజించారు. ప్రజల వ్యవహారికంలో ఉండే పలుకుబడుల భాష వల్లనే తెలుగు జీవద్భాషగా బ్రతుకుతుందని, అందుకే తన రచనలు తెలంగాణ యాసలోనే రచించారని అన్నారు.
ఎవరైతే తమ జీవితాలను సమాజం కొరకు అంకితం చేస్తారో,వారి వల్లనే సమాజము మానవీయంగా విలసిల్లుతుందని, ఆదర్శవంతంగా ఉంటుందని అన్నారు. ఆ కోవకు చెందిన కాళోజి నారాయణ రావు యొక్క జన్మదినోత్సవాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం సముచితమైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యక్షులు డా.ఆర్. రమాదేవి, ఆచార్య జగన్ మోహన్, ఆచార్య బాణాల శ్రీనివాసరావు, డా.కె.నీరజ,డా. సుభాష్ రెడ్డి,NSS కోఆర్డినేటర్ డా.ఓ. పద్మజ, డా. రమావత్ శ్రీను, డా.జి. మల్లికార్జున్, డా.విరాళ సంతోషి, డా. పెబ్బేటి మల్లికార్జున్, డా.యల్. విజయ, డా.వి. కళ్యాణి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES