Friday, February 27, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్తెలంగాణ ఆర్టీసీ సరికొత్త కార్యక్రమం.. దేశంలోనే తొలి ప్రయోగం

తెలంగాణ ఆర్టీసీ సరికొత్త కార్యక్రమం.. దేశంలోనే తొలి ప్రయోగం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తన బస్సుల ద్వారా రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని చాటేందుకు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘జీఐ ఆన్ వీల్స్’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రానికి చెందిన ఆరు భౌగోళిక గుర్తింపు (GI) పొందిన కళారూపాలను బస్సులపై అందంగా ప్రదర్శించనుంది. దేశంలోనే ఇటువంటి ప్రయోగం చేయడం ఇదే తొలిసారి. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఈ ప్రత్యేక బస్సులను జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా పోచంపల్లి ఇక్కత్, నారాయణపేట చేనేత చీరలు, నిర్మల్ పెయింటింగ్స్, చేర్యాల స్క్రోల్ పెయింటింగ్, వరంగల్ తివాచీలు, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకృతులను బస్సులపై ముద్రించారు. జేఎన్‌టీయూ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు ఈ కళారూపాలకు ఆకర్షణీయమైన డిజైన్లను రూపొందించారు. తొలిదశలో ఈ ప్రత్యేక స్టిక్కర్లను ఆరు ఎక్స్‌ప్రెస్ బస్సులపై అంటించి, ఆయా కళలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలకు నడుపుతారు. హైదరాబాద్ నుంచి వయా పోచంపల్లి, హనుమకొండ, నారాయణపేట, కరీంనగర్, నిర్మల్ మార్గాలలో ఈ బస్సులు ప్రయాణిస్తాయి.

తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రజలకు చేరువ చేయడంతో పాటు పర్యాటకులను ఆకర్షించడం, కళాకారులకు ప్రోత్సాహం అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఈ కళారూపాలకు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. 2004-05లోనే పోచంపల్లి ఇక్కత్‌కు జీఐ ట్యాగ్ లభించగా, 2007లో కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీకి ఈ గుర్తింపు దక్కింది. సుమారు 400 ఏళ్ల చరిత్ర ఉన్న నిర్మల్ పెయింటింగ్స్, సిద్దిపేట జిల్లాకు ప్రత్యేకమైన చేర్యాల పెయింటింగ్, వరంగల్ వారసత్వానికి ప్రతీకగా నిలిచే తివాచీలు, నారాయణపేట సంప్రదాయ చేనేత చీరలు ఎంతో ప్రఖ్యాతి గాంచాయి. ఈ కళారూపాలను బస్సులపై ప్రదర్శించడం ద్వారా వాటికి మరింత ప్రచారం లభించనుందని ప్రభుత్వం భావిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -