తెలంగాణ సాహితి, ఎ.వి. కాలేజి తెలుగు శాఖ సంయుక్త నిర్వహణలో ‘తెలంగాణ సాహితీ లిటరరీ ఫెస్ట్ – 2026’ ఈనెల 21, 22 తేదీలలో దశాబ్ది సాహిత్యోత్సవాలు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. తెలంగాణ సాహితి ఏర్పడి 2025కు ఒక దశాబ్దం పూర్తయింది. గత పదేండ్లుగా రాష్ట్రంలో ఐదు లిటరరీ ఫెస్ట్‌లు ఐదు థీములతో నిర్వహించాం. సాహిత్యరంగం, వివిధప్రక్రియలపై చర్చలు, సాహిత్య విమర్శ సంకలనం తెచ్చాము. ‘తెలంగాణ భాషాసాహిత్య వికాసం’ పేరుతో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించి పుస్తకాన్ని తెచ్చాం. ‘తెలుగెత్తి జైకొట్టు’ అంతర్జాతీయ సదస్సు నిర్వహించి, 135 మంది సాహితీకారుల ‘జీవితం- సాహిత్యం-పై తెలుగెత్తి జైకొట్టు పుస్తకాన్నితెచ్చాం.
ఆ తర్వాత ‘పాటకు జేజేలు’తో జానపదగీతాల ఉత్సవాన్ని నిర్వహించాం. ‘సినీగీతావరణం’ పేరుతో సినీగీత రచయితల పాటలపై విశ్లేషణ పుస్తకాన్ని వెలువరించాం. యూత్ లిటరరీ ఫెస్టులు, ఉర్దూ లిటరరీ ఫెస్ట్, మహిళా లిటరరీ ఫెస్ట్ లను నిర్వహించాం. చర్చలు, సెమినార్లు, కవి సమ్మేళనాలు, కవిత్వపోటీలు, సాహిత్య కార్యశాలలు, పుస్తకావిష్కరణలూ విస్తతంగా నిర్వహించాం.
ప్రసిద్ధ రచయితల జన్మస్థలాలకు సాంస్కృతిక కేంద్రాలుగా చేయాలని సాహితీయాత్రలు చేశాం. అంతేకాకుండా పాలమూరులో యురేనీయం తవ్వకాలు అక్కడి చెంచుల జీవితాలను ధ్వంసం చేస్తాయని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతుంటే, సామాజిక బాధ్యతగల సాహితీకారులంగా ఆ ప్రాంతాలను సందర్శించి, వారి జీవనాన్ని పరిశీలంచి ‘ఉరేనీయం’ అనే కవితా సంకలనాన్ని తీసుకువచ్చాం. నేరెళ్ల ఇసుక మాఫియా ఆగడాలను ఛిద్రమవుతున్న జనాన్ని కలసి సంఘీభావంగా నిలిచాం. అంతకు ముందు పోలవరం ముంపు బాధిత ఆదివాసీల ప్రాంతాలు సందర్శించి సంఘీభావ కవిత్వం వెలువరించాం. ఢిల్లీలో కర్షకుల పోరాటానికి మద్దతుగా, పాలస్తీనా చిన్నారుల శోకాలకు స్పందనగా జనకవనాలను నిర్వహించాం.
తెలంగాణ నేలన చైతన్యపూరిత సాహితీ పరంపర సాగుతున్నది. దాశరథి, వట్టికోట, మఖూం మొయినుద్దీన్, కాళోజీ లాంటి ధిక్కార కలాల వారసత్వంగా, సుద్దాల హనుమంతు, గద్దర్ లాంటి ప్రజావాగ్గేయకారుల గొంతుకల దారులలో ప్రజాపక్షం వహించే సాహితీసజనను కొనసాగిస్తున్నది తెలంగాణ సాహితి. కుల, మత వైషమ్యాలు వీడి, ఒక మానవీయ సమాజం ఏర్పడలన్న ఆశయ కలల సాకారం కోసం అక్షరాలను ఆయుధంగా చేసుకోవాలన్న సంకల్పంతో ముందుకు పోతున్న వేదిక తెలంగాణ సాహితి. కొత్తగా రాస్తున్న, వస్తున్న యువ కవులు, రచయితలను మరింత సజనశీలంగా తయారు చేయటం, ఉత్సాహాన్ని నింపటం ధ్యేయంగా పని చేస్తున్నది. వ్యక్తిగత ప్రయోజనాలను, పోకడలను పెంపొందిస్తున్న సమాజం- వస్తు వినియోగ సంస్కృతిని, హింస, అమానవీయ విలువలు, మానవ సంబంధాల విధ్వంసమొనరిస్తున్న నేటి పరిస్థితులకు వ్యతిరేకంగా, సమిష్టితత్వాన్ని సమభావనను పెంపొందించే రచనలు, కళాసృజన కోసం నిరంతరం పనిచేస్తున్నాం.
నూతన రాష్ట్రం ఆవిర్భవించి పదేండ్లు గడచిన సందర్భంగా తెలంగాణ సాహిత్య కళారంగాలలో వచ్చి పరిణామం, మార్పులు, వికాసం, ఎలా ఉందో ఒక సారి సమీక్షించుకొని, ఉత్తేజపూరితంగా ముందుకు పోవాల్సి ఉంది. అందుకోసం ఉత్సవాలను నిర్వహిస్తున్నాం. ఇందులో తెలంగాణ సాహిత్య రంగంపై చర్చ, సందేశాలు, కవిసమ్మేళనాలు, పుస్తకావిష్కరణలు, పుస్తక ప్రదర్శనలు, రచయిత్రుల ప్రత్యేక సమావేశాలు, బాల సాహితీవేత్తలు, యువ సాహితికారులు, అభిప్రాయాల కలబోతలు, నాటక ప్రదర్శనలు, ఫొటో ఎగ్జిబిషన్లు వంటివి వుంటాయి. ముఖ్యంగా ఈ పదేండ్ల సాహిత్య రంగం గూర్చిన విశ్లేషణలతో ‘దశాబ్ది సంచిక’ను తెస్తున్నాం. ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరుతున్నాం.
– కె.ఆనందాచారి



