హైదరాబాద్ చారిత్రక, వారసత్వ సంపద
ప్రభుత్వాలు మారినా విధానాలు మారవు
ప్రపంచం మెచ్చే చారిత్రక వారసత్వ సంపదను అందించిన నిజాం
దాన్ని కాపాడుతూనే కొత్త ప్రాంతాల్లో పర్యాటకాన్ని విస్తరించాలి : టూరిజం కాన్‌క్లేవ్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
శిల్పారామంలో ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం
రూ.15 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
”హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ. న్యూయార్క్, టోక్యో నగరాలను తలదన్నే చారిత్రక, వారసత్వ సంపదకు పుట్టినిల్లు” అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని శిల్పారామంలో ఏర్పాటు చేసిన టూరిజం కాన్‌క్లేవ్‌కు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ”రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పదేండ్లలో టూరిజానికి పాలసీ లేదు. దేశంతో పాటు ప్రపంచంలోని అనేక దేశాల విధానాలను అధ్యయనం చేసి తెలంగాణ టూరిజం పాలసీని తీసుకొచ్చాం. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేవారితో పాటు టూరిస్టులకు ఈ పాలసీ రక్షణ కవచంలా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ పర్యాటక రంగం పెట్టుబడులకు స్వర్గధామంగా నిలవనుంది. ప్రపంచంలోని పారిశ్రామిక వేత్తలు విరివిగా పెట్టుబడులు పెట్టి రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోండి” అని సీఎం పిలుపు నిచ్చారు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఈఫిల్ టవర్ లాంటి ప్రఖ్యాత చారిత్రక సంపదలను తలదన్నే చార్మినార్, గోల్కొండ, రామప్ప టెంపుల్, వేయి స్తంభాల గుడిలాంటి ఎన్నో నిర్మాణాలు తెలంగాణ సొంతమని సీఎం కొనియాడారు.
ప్రపంచం మెచ్చే చారిత్రక వారసత్వ సంపదను నిజాం రాష్ట్రానికి అందించారనీ, దాన్ని కాపాడుతూనే కొత్త ప్రాంతాల్లో పర్యాటకాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగాలే కాదు టూరిజం కూడా పెద్ద పరిశ్రమ అని సీఎం అన్నారు. ఇండియా, పాకిస్తాన్ యుద్ధ సమయంలో(ఆపరేషన్ సింధూర్) కూడా తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించామని చెప్పారు. శాంతి భద్రతల విషయంలో తెలంగాణ సర్కార్ అనుసరిస్తున్న విధానాలు భేష్ అని కేంద్రం కితాబునిచ్చిందని గుర్తు చేశారు. ”1994 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు, 2004 నుంచి 2014 వరకు వైఎస్ తదితర కాంగ్రెస్ సీఎంలు, 2014 నుంచి 2023 కే.చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రులుగా పని చేశారు. ప్రభుత్వాలు మారినా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన విధానాలు మారవు. ఈ విషయంలో పెట్టుబడిదారులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు” అని సీఎం రేవంత్‌రెడ్డి వారికి భరోసా ఇచ్చారు.
పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ : జూపల్లి
తెలంగాణ టూరిజం రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి రాష్ట్ర ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుస్తోందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ పర్యాటక రంగంలో కొత్త యుగం ప్రారంభమైందని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన పర్యాటక విధానం (2025-30)లో పేర్కొన్న రూ.15,000 కోట్ల పెట్టుబడి లక్ష్యాన్ని మొదటి సంవత్సరంలోనే సాధించామన్నారు. ఇది పెట్టుబడిదారులు తెలంగాణపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణను ఆర్థిక శక్తిగా, ఉద్యోగావకాశాలను సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తుందని జూపల్లి అన్నారు. కేరళ, దక్షిణ కొరియాలను ప్రస్తావిస్తూ.. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలమైన వెన్నుదన్నుగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ పటేల్ రమేశ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ వల్లూరు క్రాంతి ఇతర అధికారులు పాల్గొన్నారు.
30 ప్రాజెక్టులు..రూ.15,279 కోట్ల పెట్టుబడులు
టూరిజం కాంక్లేవ్‌లో తెలంగాణకు రూ.15,279 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి. వీటితో 19,520 మందికి ప్రత్యక్షంగా, 30 వేల మందికి పరోక్షంగా.. మొత్తం 50,000 మందికి ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. ఇందులో 14 పీపీపీ ప్రాజెక్టులు (7,081 కోట్లు), 16 ప్రయివేట్ రంగ ప్రాజెక్టులు ( రూ.8,198 కోట్లు) ఉన్నాయి. అనంతగిరిలో లగ్జరీ వెల్నెస్ రిట్రీట్, వికారాబాద్‌లో తాజ్ సఫారీ, విన్యార్డ్ రిసార్ట్, మూడు అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లు ఉన్నాయి. మొదటిసారిగా ప్రపంచ ప్రఖ్యాత ఇంటర్‌కాంటినెంటల్, సెయింట్ రీజిస్, ఒబెరారు హౌటల్స్ హైదరాబాద్‌కి రానున్నాయి. ఫిల్మ్ ఇన్ తెలంగాణ, మెడికల్ వాల్యూ టూరిజం (ఎంవీటీ) పోర్టల్‌ను ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రారంభించింది.
పర్యాటక రంగాన్ని నిర్లక్ష్యం చేసిన బీఆర్‌ఎస్: భట్టి
తెలంగాణను పదేండ్లు పాలించిన బీఆర్‌ఎస్ పర్యాటక రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. తాము అధికారం చేపట్టిన రెండేండ్లలోనే రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు అనేక చర్యలు చేపట్టినట్టు వివరించారు. ”రెండు జీవనదుల మధ్యనున్న దక్కన్ పీఠభూమి అయిన తెలంగాణ.. పర్యాటక రంగానికి స్వర్గసీమ అని అభిప్రాయపడ్డారు. శాంతి భద్రతలు, మేధో సంపతి, పారిశ్రామిక, సినిమా రంగాలకు నెలవని కొనియాడారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు పర్యాటకరంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణను ఎంచుకోవడం హర్షణీయమని అన్నారు.