Thursday, October 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంటెలీ సేవలు.. సూపర్‌ స్పెషాల్టీ వైద్యం

టెలీ సేవలు.. సూపర్‌ స్పెషాల్టీ వైద్యం

- Advertisement -

– ఉస్మానియా నుంచి రోగులకు టెలీ వైద్య సేవలు
– అందుబాటులో అన్ని రకాల సదుపాయాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో

పెద్దాస్పత్రులకు వెళ్లకుండానే సూపర్‌ స్పెషాల్టీ వైద్య సేవలు పొందే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో ఉస్మానియా ఆస్పత్రి విజయవంతంగా ఈ టెలీ సేవలను రోగులకు అందిస్తోంది. నిత్యం 100 మంది వరకు రోగులు ఈ సేవలను వినియోగించుకుంటున్నట్టు వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా బస్తీ దవాఖానాలు, అర్బన్‌ ఆరోగ్య కేంద్రాల్లో ప్రాథమిక వైద్య సేవలు మాత్రమే అందుతున్నాయి. ఏవైనా స్పెషాలిటీ వైద్యం అవసరమైతే దూరప్రాంతాల నుంచి ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు రావాల్సిందే. ఈ నేపథ్యంలో వృద్ధులు, స్త్రీలు ఇబ్బందులు పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తీరా ఆస్పత్రికి వచ్చి క్యూలో నిలబడి చీటి తీసుకుని వైద్యునికి చూపించుకుని ఇంటికెళ్లే సరికి సాయంత్రం అవుతోంది. ఈ టెలీ మెడిసిన్‌ సేవలు అందుబాటులోకి వచ్చాక వైద్య సేవలు సులభతరం అయ్యాయి. ఇంటికి దగ్గరలోనే ఈ సేవలను వినియోగించుకునే అవకాశం ఉంది.

వినియోగించుకోవడం ఎలా..?
గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా 250 వరకు బస్తీ దవాఖానా లున్నాయి. మరో 90కి పైనే అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల ద్వారా రోగులకు సేవలందిస్తున్నారు. జ్వరం, జలుబు, మధుమేహం, అధిక రక్తపోటు, ఇతర చిన్నచిన్న ప్రాథమిక రుగ్మతలకు ఇక్కడ చికిత్స అందిస్తున్నారు. ఇతర ఏమైనా పెద్ద సమస్యలుంటే ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు రిఫర్‌ చేస్తున్నారు. గ్యాస్ట్రో, ఆర్థో, ఇతర సూపర్‌ స్పెషాల్టీ సేవలు పొందాలంటే టెలీ మెడిసిన్‌ ద్వారా నేరుగా పీహెచ్‌సీలో రోగులతో మాట్లాడి సేవలందిస్తున్నారు. బస్తీ దవాఖానాలు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లోని వైద్యుని వద్ద ఉన్న ట్యాబ్‌ ద్వారా ఉస్మానియా టెలీమెడిసిన్‌ కేంద్రంతో అనుసంధానం చేసి సేవలు పొందే వీలు కల్పించారు. ముందురోజు స్లాట్‌ బుక్‌ చేసి నిపుణులు అందుబాటులో ఉండేలా చూస్తారు. రోగులు చెప్పే లక్షణాలను బట్టి అవసరమైన టెస్టులు, మందులు ఈ-సంజీవని పోర్టల్‌ ద్వారా సూచిస్తారు. సర్జరీలు అవసరమైతే ఉస్మానియాకు రెఫర్‌ చేస్తారు.

టెలీ మెడిసిన్‌ ద్వారా అందే కీలక సేవలివే
మధుమేహ సమస్యలు, అధిక రక్తపోటు, కీళ్ల నొప్పులు, గ్యాస్ట్రిక్‌ సమస్యలు, చర్మ సంబంధిత ఇబ్బందులు, జనరల్‌ మెడిసిన్‌, ఫిజియో థెరపీ, గుండె సమస్యలు, జీర్ణకోశ ఇబ్బందులు, స్త్రీలకు సంబంధించిన సమస్యలు కీలకంగా ఉన్నాయి. వీటితోపాటు మరికొన్ని రోగాలకు సైతం ఈ టెలీ మెడిసిన్‌ ద్వారా వైద్య సేవలందిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -