అమ్మాయి, అబ్బాయి ప్రేమలో పడడం సర్వసాధారణం. దీని గురించి ఎవ్వరూ ఆశ్చర్యపడరు. కానీ ఈ మధ్య కాలంలో అబ్బాయి ఇంకో అబ్బాయినీ, ఒక అమ్మాయి మరో అమ్మాయిని ప్రేమించడం కూడా చూస్తున్నాం. హార్మోన్ల ప్రభావం దీనికి కారణం కావొచ్చు. ఎవరిని ఇష్టపడితే వాళ్లతో కలిసి ఉండడంలో తప్పేమీ లేదు. అది వారి వ్యక్తిగత విషయం. అయితే ఇలాంటి ఆలోచనలు బయటకు చెప్పుకోడానికి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కొందరైతే ఇంట్లో చెప్పుకోలేక పెండ్లి చేసుకున్న వ్యక్తిని తప్పుగా చూపిస్తుంటారు. దీని వల్ల సమస్య మరింత పెంచుకోవడం తప్ప పరిష్కారం దొరకదు. అలాంటి ఓ కథనమే ఈ వారం ఐద్వా అదాలత్(ఐలమ్మ ట్రస్ట్)లో మీ కోసం…
నవనీతకు దాదాపుగా 26 ఏండ్లు ఉంటాయి. ఆమెకు రెండేండ్ల కిందట రాజుతో పెండ్లి జరిగింది. పెద్దల కుదిర్చిన వివాహం. రాజు వాళ్ల ఇంట్లో మొత్తం ఐదు మంది ఉంటారు. అత్త, మామ, రాజు, నవనీత వాళ్ల మరిది. అందరూ ఉద్యోగాలు చేసేవారే. ఇంట్లో ఎవరూ ఉండరు. అందరూ ఉదయం వెళ్లిపోతే సాయంత్రానికి తిరిగి వస్తారు. ఇంట్లో పనులు చేయడానికి ఒక పని అమ్మాయి ఉంటుంది. ఆమె వంట తప్ప మిగిలిన అన్ని పనులు చేస్తుంది.
నవనీత వాళ్ల అత్తయ్యకు వంట వేరే వారు చేస్తే నచ్చదు. కాబట్టి ఆమెనే వంట చేసేది. అప్పుడప్పుడు నవనీతను చేయమని చెప్పేది. అంతేగానీ వంట కోసం వంటమనిషిని పెట్టుకోవడం ఆమెకు ఇష్టం లేదు. అందరూ ప్రయివేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. కాబట్టి అందరూ ఇంటికి వచ్చే సమయం ఒకే విధంగా ఉండదు. అలాగే అందరూ ఇంట్లో నుండి ఆఫీసుకు వెళ్లే సమయం కూడా ఒకటి కాదు. నవనీతకు వచ్చిన జీతం మొత్తం ఇంట్లో వాళ్లకే ఇవ్వాలనేది వాళ్ల నిబంధన. అయితే నవనీతకు అది ఇష్టం లేదు. ‘నేను ఉద్యోగం చేసి మొత్తం డబ్బులు మీకెందుకు ఇస్తాను. నా జీతంలో నుండి 30శాతం ఇచ్చి మిగిలిన డబ్బులను నేను సేవ్ చేసుకుంటాను’ అంది. దానికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు.
అయితే రాజు వాళ్లకు సర్ధి చెప్పాడు. ‘ఆమె జీతం డబ్బులు తీసుకుంటే ఆమెకు ఇబ్బంది అవుతుంది కదా? ఆమెను ఇబ్బంది పెట్టడం ఎందుకూ?’ అంటూ భార్యకు సపోర్ట్ చేశాడు. అయితే వంట పనిలో వాళ్ల అమ్మకు సహాయం చేయమని చెప్పేవాడు. ‘పెండ్లికి ముందు నేను ఆమెకు సహాయం చేసే వాడిని. ఇప్పుడు కూడా నేనే చేస్తే అందరూ నిన్నే అంటారు. కాబట్టి నువ్వు అమ్మకు వంటలో సహాయం చెయ్యి, ఇంట్లో పనులు నేర్చుకో’ అని చెప్పాడు. అయితే తన తమ్ముడితో భార్య స్నేహపూర్వకంగా ఉండటం అతనికి నచ్చేది కాదు. తన స్నేహితులతో మాట్లాడినా ఒప్పుకునేవాడు కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె తెలిసిన వాళ్లు చెబితే సలహా కోసం ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చింది.
‘ఇంటి పని విషయాల్లో రాజు నన్ను బలవంతంగా ఒప్పించా లని చూస్తున్నాడు. కానీ నా జీవితం నా ఇష్టం. నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను. నాకు పని చేయాలనిపిస్తే చేస్తాను లేక పోతే లేదు. అలాగే నాకు ఎవరితో స్నేహం చేయాలనిపిస్తే వాళ్లతో చేస్తాను. నేను ఎవరితో స్నేహంగా ఉండాలనేది నా ఇష్టం. అంతేగానీ నేను అమ్మాయిలతో మాట్లాడినా అతనికి నచ్చడం లేదు. వాళ్లతో స్నేహం కట్ చేయమని చెబుతున్నాడు. ఇదంతా నాకు నచ్చడం లేదు. నాకు నచ్చినట్టుగా నన్ను ఉండనీయడం లేదు. మీరు అతన్ని పిలిచి నా సమస్యను పరిష్కరించండి’ అంటూ మా దగ్గర చెప్పుకుంది.
మేము రాజుకు, అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పిలిపించాం. నవనీత చెప్పిన దాని గురించి రాజును అడిగితే ‘ఆమె జీవితం ఆమె ఇష్టమే. కానీ ప్రస్తుతం ఆమె జీవితం నా కుటుంబంతో ముడిపడి ఉంది. ఆమెకు ఇష్టం లేకుండా ఏమీ చేయడం లేదు. ఆమె జీతంలో 30శాతం మాత్రమే ఇస్తానంటే నేనే ఇంట్లో వాళ్లను ఒప్పించాను. అలాగే నా జీతం నుండి 40శాతం ఆమెకు ఇస్తున్నాను. ఇకపోతే వంట, ఇంటి పని అంటే నాకు వచ్చు. ఆమె కూడా నేర్చుకుంటే భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా! ఇంటి పని చేయడానికి ఎవరైనా వస్తారు. కానీ వంట పని అయినా నేర్చుకోవాలి కదా! మన వంట మనం చేసుకొని తింటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇందులో తప్పేముంది.
ఇకపోతే స్నేహితుల గురించి అంటే ఆమెకు మనీషా అనే అమ్మాయితో చాలా సాన్నిహిత్యం ఉంటుంది. అది స్నేహానికి మించి. ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు. మేమే అర్థం చేసుకుని మనీషా మా ఇంట్లో వుండటానికి కూడా ఒప్పుకున్నాం. మా తమ్ముడికి ఆమెను ఇచ్చి పెండ్లి చేస్తే స్నేహితులిద్దరూ తోటి కోడళ్లుగా ఉంటారు అనుకున్నాం. కానీ నవనీత, మనీషాకు తోటి కోడలి స్థానం కాదు. భర్త స్థానం ఇవ్వాలి అనుకుంటుంది. నన్ను చూస్తే ఆమెకు ఎలాంటి ఫీలింగ్స్ రావడం లేదంట. అదే మనీషను చూస్తే తనతోనే వుండిపోవాలి అనిపిస్తుందంట. ‘ఆమె కోసం ఏమైనా చేస్తాను, నేను మనీషను ప్రేమిస్తున్నాను, నాకు మీతో కంటే మనీషతో ఉండటమే ఇష్టం. నేను ఎంత చెప్పినా వినకుండా ఈ పెండ్లి చేశారు’ అంటుంది. మా పెండ్లి జరిగి రెండేండ్లు అవుతున్నా నేను ఇప్పటి వరకు ఆమెను తాకను కూడా తాకలేదు. నా మంచితనాన్ని అలుసుగా తీసుకొని ఈరోజు నన్నూ నా కుటుంబాన్ని ఇక్కడి వరకు తీసుకు వచ్చింది. నేను చెప్పిన దాంట్లో ఏదైనా అబద్దం ఉందేమో ఆమెనే అడగండి’ అన్నాడు.
దానికి నవనీత ‘రాజు చెప్పింది నిజమే. అతనితో ఉండటం నాకు ఇష్టం లేదు. నాకు మనీషతో కలిసి జీవించాలని ఉంది. నాకు రాజుపై ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అతనిపై ప్రేమ, ఇష్టం ఏమీ కలగడం లేదు. మీరే ఎలాగైనా నా సమస్యకు పరిష్కారం చెప్పండి’ అంటూ అసలు నిజం బయటపెట్టింది.
ఆమె చెప్పింది విన్న తర్వాత మేము ఇరు కుటుంబాలను కూర్చోబెట్టి ఇద్దరి సమస్య గురించి వివరంగా చెప్పాము. నవనీతతో ‘నీ జీవితం నీ ఇష్టం అన్నప్పుడు రాజు జీవితంతో ఉండాల్సిన అవసరం లేదు. అసలు నువ్వు ఈ విషయం ముందే మీ ఇంట్లో చెప్పాల్సింది. సరే ఇప్పటికైనా ఇద్దరూ మ్యూచువల్‌గా విడిపోతే మంచిది. ఎవరికి నచ్చినట్టు వాళ్లు జీవించవచ్చు. ఇదే మీ సమస్యకు సరైన పరిష్కారం. వీలైతే హాస్పిటల్లో ఓ సారి చూయించుకో’ అని సలహా ఇచ్చాము.
రాజుతో ‘ఈ మధ్య కాలంలో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. నవనీతకు మీతో ఉండడం ఇష్టం లేదు. బలవంతంగా కలిసి ఉన్నా మీరు సంతోషంగా ఉండలేరు. ఆమె ఆలోచనలు వేరే ఉన్నాయని మీకూ తెలుసు. అది హార్మోనల్ సమస్య. కాబట్టి మీరు విడిపోయి ఎవరి భవిష్యత్తు వాళ్లు చూసుకోండి. ఇదే మీకు మంచిది’ అని చెప్పి పంపించాము.
– వై వరలక్ష్మి,
9948794051



