– చైనా, రష్యా, భారత్ సూపర్ పవర్‌గా మారనున్నాయా!
– ట్రంప్‌ను వెంటాడుతున్న భయం
– షాంఘై వేదికగా రెండురోజుల శిఖరాగ్ర సమావేశం
మోడీ తీరుపైనే అనుమానాలెన్నో..
ప్రపంచంలో ఆ మూడు దేశాలు కలిసి సూపర్ పవర్‌గా మారితే.. అమెరికా కంటే శక్తివంతమైనవిగా ఎదగడం ఖాయమన్న భయం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను వెంటాడుతోంది. ఓ వైపు అడ్డదిడ్డంగా టారిఫ్ వేసినా.. రష్యా, చైనా దేశాల శక్తికి వైట్‌హౌస్ తట్టుకోలేకపోయింది. సుంకాలపై యూఎస్ వెనక్కి తగ్గింది. కానీ భారత్ విషయంలో మాత్రం ట్రంప్ తగ్గేదేలేదంటున్నారు. దీంతో ఇప్పటికీ మోడీ తీరుపైనే సర్వత్రా అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. ఓవైపు టారిఫ్‌లపై అమెరికాలో లాబీయింగ్ చేస్తూ..మరోవైపు చైనాలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశానికి వెళ్లటానికి ప్రధాని మోడీ సిద్ధంగా ఉన్నారు.
న్యూఢిల్లీ: అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు అన్న చందాన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ట్రంప్ తమ స్నేహితుడని మోడీ చెప్పుకుంటుం టారు. అలాంటిది ఎప్పుడైతే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి భారత్ పేరుఎత్తితే చాలు భగ్గుమంటున్నారు. టారిఫ్‌లు అస్సలు తగ్గించే ప్రసక్తే లేదు. పైగా భారత్ నుంచి వచ్చే దిగుమతులు చాలా తక్కువంటూ కరాఖండిగా చెబుతున్నారు. అయినా ట్రంప్‌ను వదలుకోలేక మోడీ అమెరికాతో లాబీయింగ్‌కి దిగినట్టు కథనాలు వస్తున్నాయి.
ఇది నాణేనికి ఓవైపు..మరోవైపు
ఆగస్టు 31, సెప్టెంబర్ 1న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనటానికి ప్రధాని మోడీ చైనాకు వెళ్లనున్నారు. ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా రానున్నారు. డోనాల్డ్ ట్రంప్ సుంకాల తర్వాత రష్యా, చైనా, భారత్ ఒకే వేదికపై కలవనున్నాయి. ఈ దేశాల సమావేశం దౌత్యపరమైనది కావచ్చు. కానీ ఈ అమరిక కొత్త ప్రపంచ సూపర్ పవర్ ఎదుగుదలకు దారితీస్తుందనే భయం మాత్రం ట్రంప్‌ను కునుకుతీయనీయటం లేదు. 2018 తర్వాత ప్రధాని మోడీ చైనాలో తొలిసారిగా పర్యటించనున్నారు. ట్రంప్ సుంకాలు ప్రస్తుత ప్రపంచ వస్తు వాణిజ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) స్థాపించబడినప్పటి నుంచి ప్రపంచ వాణిజ్య వ్యవస్థ మారిపోయింది.
ట్రంప్ సుంకాలు భౌగోళిక రాజకీయాల్లో గుర్తించదగిన మార్పులను తీసుకువచ్చే అవకాశం ఉంది. అందుకే చైనా, రష్యా, భారతదేశం ఇపుడు స్నేహ హస్తాన్ని చాటుకుంటున్నాయి. ఈ మూడు దేశాల మధ్య పెరుగుతున్న స్నేహానికి మరో ప్రధాన కారణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో యూఎస్ డాలర్‌పై అధికంగా ఆధారపడటంపై వారి ఉమ్మడి ఆందోళన. యూఎస్‌డీ 54 ట్రిలియన్ల విలువైన గ్లోబల్ సూపర్ పవర్ ఆవిర్భవించే అవకాశాలున్నాయి. సీఐఐఏ, వల్లమ్ క్యాపిటల్ వ్యవస్థాపకుడు మనీశ్ భండారి మాట్లాడుతూ, ”8.2 బిలియన్ల ప్రజలు ,యూఎస్ డాలర్ల173 ట్రిలియన్ల ఆర్థిక శక్తి ఉన్న ప్రపంచంలో.. భారత్, చైనా, రష్యా ప్రపంచ వేదికపై కేంద్ర స్థానాన్ని ఆక్రమించాయి. వాటి మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 53.9 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉంది, ఇది ప్రపంచ ఆర్థిక ఉత్పత్తిలో దాదాపు మూడింట ఒక వంతు. ట్రంప్ సుంకాలతో భారతదేశం, చైనా , రష్యా వంటి దేశాలను ప్రపంచ వాణిజ్యం నుంచి వేరుచేసే ప్రయత్నం జరుగుతోందని ఆర్థిక విశ్లేషకులు పేర్కొంటున్నారు.. అయితే.. వైట్ హౌస్ తీసుకున్న టారిఫ్ చర్య ఈ మూడు దేశాలను ఏకతాటిపైకి తీసుకువచ్చే ఏకీకృత శక్తిగా మార్చే అవకాశాలూ లేకపోలేదు.” అని చెప్పారు. ”భారతదేశం, చైనా, రష్యా కలిసి 5.09 ట్రిలియన్ డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేస్తాయి, ఇవి ప్రపంచ వస్తువుల ఎగుమతుల్లో దాదాపు ఐదవ వంతు వాటా కలిగి ఉన్నాయి. ఈ వాణిజ్యం అనేక ఖండాలలో విస్తరించి, ప్రపంచ వాణిజ్యాన్ని పెంచుతుంది. ఇది నూతన ఆవిష్కరణ, సాంకేతికత, పరిశ్రమ ద్వారా బిలియన్ల మందిని కలుపుతుంది. ప్రస్తుతం, అమెరికా డాలర్‌పై ఎక్కువగా ఆధారపడటం జరుగుతోంది.
విమర్శలు వచ్చాక..
ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత పాకిస్తాన్ చాలా వేగంగా ఆయనతో సంబంధాలను బలోపేతం చేసుకుంది. భారత్ మాత్రం కొంత వెనకబడిందనే విమర్శలు వచ్చాయి. ఇక పాక్ నాయకత్వం ట్రంప్ మాజీ బాడీగార్డ్ కీత్ షల్లర్ నిర్వహిస్తున్న లాబీయింగ్ సంస్థను నియమించుకుంది. ”మరోవైపు భారత్ ఇప్పటికే ట్రంప్ మాజీ సహాయకుడు జేసన్ మిల్లర్‌కు చెందిన ఎస్‌హెచ్‌డబ్ల్యూ పార్టనర్స్ ఎల్‌ఎల్‌సీని నియమించుకొని నెలకు 1.50లక్షల డాలర్లు చెల్లిస్తున్నది. అమెరికాలో కీలక ఒప్పందాలు, ఇతర పనులను పూర్తిచేసుకోవడానికి లాబీయింగ్ సంస్థలను నియమించుకోవడం కొత్తేమీ కాదు. చాలా దేశాలు వీటితో కలిసి పనిచేస్తుంటాయి”. అని నిపుణులు అంటున్నారు.
రష్యాను అదుపు చేయడానికే భారత్‌పై చర్యలు..
రష్యా దూకుడును అదుపు చేయడానికి ట్రంప్ సర్కారు చర్యలు తీసుకొందని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెల్లడించారు. దీనిలోభాగంగానే భారత్‌పై సెకండరీ టారిఫ్‌లు విధించినట్టు పేర్కొన్నారు. ఆయన ఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
అమెరికాలో లాబీయింగ్‌కు భారత్ ముమ్మర యత్నాలు..
అమెరికా విధించిన అదనపు సుంకాలు అమల్లోకి రావడానికి కొన్ని రోజుల ముందే భారత్ లాబీయింగ్ యత్నాలను ముమ్మరం చేసింది. ఈక్రమంలో అక్కడి ప్రభుత్వంతో వ్యూహాత్మక అంశాల్లో కమ్యూనికేషన్లు నిర్వహించడం, సోషల్ మీడియా, మీడియా రిలేషన్స్, డిజిటల్ ఆడిట్ వంటి వాటిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక సంస్థను నియమించుకొంది. ఫారెన్ ఏజెంట్ రిజిస్ట్రేషన్ ఫైలింగ్ ప్రకారం.. భారత దౌత్య కార్యాలయం నెలకు 75,000 డాలర్లు చెల్లించేలా మూడు నెలలకు మెర్క్యిరీ పబ్లిక్ అఫైర్స్ సంస్థతో ఒప్పందం చేసుకొంది. ఇది ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చింది. మెర్క్యిరీ సంస్థ మాజీ రిపబ్లికన్ సెనెటర్ డేవిడ్ విట్టర్, 2020 ట్రంప్ ట్రాన్సిషన్ బందం కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా చేసిన బ్రయాన్‌తో కలిసి భారత్ కోసం పనిచేస్తుంది. న్యూయార్క్ రాష్ట్రానికి సెనెటర్‌గా ఎన్నికైన తొలి ఇండో-అమెరికన్ కెవిన్ థామస్ సాయం చేయనున్నారు. ప్రస్తుతం ట్రంప్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ విలిస్‌కు మెర్క్యిరీ సంస్థతో సంబంధాలున్నాయి. 2024 వరకు ఆమె ఈ సంస్థ కోసం రిజిస్టర్డ్ లాబీయిస్ట్‌గా పనిచేశారు. ఆ తర్వాత శ్వేతసౌధంలో బాధ్యతలు చేపట్టారు. బ్రయాన్ గతంలో ట్రంప్ ప్రచార బృందంలో, జేడీవాన్స్ సెనెట్‌కు పోటీ చేసినప్పుడు పనిచేశారు.
వాణిజ్య యుద్ధం నుంచి కరెన్సీ యుద్ధం వరకు…
రష్యా, చైనా యొక్క డీ-డాలరైజేషన్ ప్రచారానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మద్దతు ఇచ్చిన అన్ని దేశాలను ఇప్పుడు అమెరికా పరి పాలన మందలిం చడానికి ప్రయత్నిస్తోంది. బసవ్ క్యాపిటల్ వ్యవస్థా పకుడు సందీప్ పాండే మాట్లాడుతూ, ”అమెరికా , యూరోపియన్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన తర్వాత, భారత్ , చైనా స్థానిక కరెన్సీలలో రష్యన్ ముడి చమురును కొనుగోలు చేయడం ప్రారంభించాయి. ఇది వారి నిల్వలలో మరిన్ని డాలర్లను సేకరించడానికి వీలు కల్పించింది. పెరుగు తున్న వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతల మధ్య ఉద్భవిస్తున్న కరెన్సీ యుద్ధంలో ఇది వారికి సహాయపడుతుందని భావిస్తున్నారు.అందుకే ట్రంప్, మద్దతు దారులు భారత్‌ను టార్గెట్ చేస్తున్నాయి. బెదిరిస్తున్నాయి. టారిఫ్‌ల భారం నుంచి తప్పించు కోవటానికి ట్రంప్‌తో మచ్చిక చేసుకోవాలా.. లేక షాంఘై వేదికపై చేతులు కలుపాలా..అనే విషయంలో ప్రధాని మాత్రం గోడమీద పిల్లిలా వ్యవహరించాలను కుంటున్నారని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.