Sunday, September 21, 2025
E-PAPER
Homeజాతీయంబీజేపీ గూండాల బీభత్సం

బీజేపీ గూండాల బీభత్సం

- Advertisement -

త్రిపురలో సీపీఐ(ఎం) కార్యాలయం విధ్వంసం
ఏడోసారి దాడికి దిగిన హిందూత్వ మూకలు

అగర్తలా : పశ్చిమ త్రిపురలోని ప్రతాప్‌ఘర్‌ ఏరియాలో సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయాన్ని శనివారం బీజేపీ గూండాలు ధ్వంసం చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30గంటల సమయంలో బుల్డోజరుతో వచ్చిన గూండాలు సీపీఐ(ఎం) స్థానిక కమిటీ కార్యాలయాన్ని కూల్చివేశారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత సీపీఐ(ఎం) కార్యాలయంపై ఇలా దాడి చేయడం ఇది ఏడవసారి. బీజేపీ మద్దతు గల గూండాలే ఈ విధ్వంసానికి పాల్పడ్డారనడానికి తమ వద్ద వీడియోక్లిప్‌లు వున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి, త్రిపుర ప్రతిపక్ష నేత జితేంద్ర చౌదరి శనివారం తెలిపారు. ఈ విధ్వంసం, కూల్చివేతతో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ప్రజాస్వామ్య విలువలను ఎంతలా గౌరవిస్తున్నాయో తెలుస్తోందని వ్యాఖ్యానించారు. తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ, ప్రజా నిధులను కొల్లగొడుతూ రాష్ట్రంలోని ప్రజాస్వామ్య వాతావరణాన్ని నాశనం చేస్తోందని విమర్శించారు.

ఈ దాడిని ‘చీకటి ముసుగులో పాల్పడిన పిరికిపంద చర్య’గా ఆయన అభివర్ణించారు. ఈ సంఘటనపై తాము ఫిర్యాదు చేశామని, కానీ పోలీసులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రతన్‌దాస్‌ మాట్లాడుతూ, ఇప్పటికి ఏడుసార్లు పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారని చెప్పారు. ఈసారి గూండాలు కార్యాలయం ముందు గేటును, ఆఫీసు తలుపులను విరగ్గొట్టారని చెప్పారు. ముందస్తు ప్రణాళికతో జరిపిన దాడి ఇదని చెప్పారు. పోలీసులు ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. కాగా పోలీసులు దీనిపై స్పందిస్తూ, తమకు ఫిర్యాదు అందిందని చెప్పారు. దాడిలో ఉపయోగించిన జెసిబిని స్వాధీనం చేసుకున్నామని, దర్యాప్తు సాగుతోందని తూర్పు అగర్తలా పోలీసు స్టేషన్‌ ఆఫీసర్‌ ఇన్‌చార్జి సుబ్రతా దేవ్‌నాథ్‌ చెప్పారు. కాగా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అషిమ్‌ భట్టాచార్జి ఈ సంఘటనపై వ్యాఖ్యానించడానికి తిరస్కరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -