పీఆర్సీని వెంటనే ప్రకటించాలి : టీపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్ సర్వీస్ టీచర్లకు ‘టెట్’ను మినహాయించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పీఆర్సీని వెంటనే ప్రకటించి అమలు చేయాలని కోరింది. పెండింగ్ బిల్లులు, డీఏలను వెంటనే విడుదల చేయాలని తెలిపింది. ఉద్యోగులకు ఆరోగ్య కార్డులను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేసింది. శనివారం హైదరాబాద్‌లో టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. అధ్యక్షత వహించిన ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షలు చకినాల అనిల్ కుమార్ మాట్లాడుతూ 2010కి ముందు నియామకమైన ఉపాధ్యాయులు రెండేండ్లలో టెట్ ఉత్తీర్ణత సాధించకుంటే ఉద్యోగం నుంచి తొలగించాలనే కేంద్ర ప్రభుత్వ నిబంధనలు అశాస్త్రీయమైనవని అన్నారు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు వచ్చే విధంగా చట్టంలో మార్పులు చేసేందుకుగాను కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని కోరారు.
ప్రభుత్వం ఏర్పడిన ఆర్నెల్లలో పీఆర్సీని ప్రకటిస్తామంటూ ఇచ్చిన ఎన్నికల హామీ ముగిసి రెండేండ్లు దాటిందని అన్నారు. పీఆర్సీ ఇంకా ప్రకటించకపోవడంతో ఉద్యోగ వర్గాలు ఆందోళన చెందుతున్నాయని చెప్పారు. టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి మాట్లాడుతూ 2024 నుంచి ఉద్యోగ విరమణ పొందిన వారికి పెన్షనరీ ప్రయోజనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల జీపీఎఫ్, టీఎస్‌జీఎల్‌ఐ, సరెండర్ లీవు తదితర పెండిరగ్ బిల్లులను, డీఏలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఉద్యోగులకు ఇన్సూరెన్స్ ఇవ్వడం ఆహ్వానించదగినదే అయినప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు ఆరోగ్య కార్డులను ఇవ్వాలని కోరారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ దర్శిని ప్రధాన సంపాదకులు పి నాగిరెడ్డి, టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జి తిరుపతిరెడ్డి, అదనపు ప్రధాన క్యార్యదర్శి ముత్యాల రవీందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి నారాయణమ్మ, డి శ్రీనివాస్, బి రాజు, రాష్ట్ర కార్యదర్శులు ఆత్రం భుజంగరావు, రావుల రమేష్, ఎస్ విజయ్, దామెర రాజయ్య, సిద్దోజు కవిత, బోగ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్‌ను మినహాయించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



