Sunday, March 8, 2026
E-PAPER
Homeఆటలుఅదిగో కప్పు

అదిగో కప్పు

- Advertisement -

– రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
– మూడో టైటిల్‌పై టీమ్‌ ఇండియా గురి
– చారిత్రక విజయంపై కివీస్‌ కన్ను
– టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ నేడు

ఆధునిక క్రికెట్‌లో ఐసీసీ టోర్నమెంట్లలో నిలకడగా రాణించే జట్లలో న్యూజిలాండ్‌ ఒకటి. ఐసీసీ టోర్నమెంట్లలో ఇటీవల అత్యధిక విజయశాతంతో దూసుకెళ్తోన్న జట్టు భారత్‌. టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ వేటలో ఈ రెండు జట్లు నేడు తలపడేందుకు సిద్ధమయ్యాయి. ముచ్చటగా మూడోసారి పొట్టి కప్పు పట్టేయాలని భారత్‌ ఎదురుచూస్తుండగా.. వైట్‌బాల్‌ ఫార్మాట్‌లో తొలిసారి ఐసీసీ టైటిల్‌ సాధించాలనే తపనతో న్యూజిలాండ్‌ కనిపిస్తోంది.

నవతెలంగాణ-అహ్మదాబాద్‌

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఆఖరు ఘట్టానికి చేరుకుంది. టైటిల్‌ రేసులో 20 జట్లు నిలువగా.. నేడు టైటిల్‌ వేటలో అంతిమంగా రెండు జట్లు తాడోపేడో తేల్చుకోనున్నాయి. డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ సొంతగడ్డపై తొలిసారి పొట్టి కప్పు అందుకోవాలని ఆశిస్తుండగా.. న్యూజిలాండ్‌ తొలిసారి టీ20 వరల్డ్‌కప్‌ను ముద్దాడాలని ఉవ్విళ్లూరుతోంది. టైటిల్‌ ఫేవరేట్‌గా బరిలో నిలిచిన భారత్‌ ఓవైపు, ఎటువంటి అంచనాలు లేకుండా టోర్నీలో అడుగుపెట్టిన న్యూజిలాండ్‌ మరోవైపు నేడు ఫైనల్లో పోటీపడుతున్నాయి.

బ్యాటింగే బలం
గత రెండేండ్లలో భారత బ్యాటర్ల దూకుడు చూస్తే టీ20 ప్రపంచకప్‌లో 300 స్కోరు చేస్తారనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ భారత్‌ అనూహ్యంగా బ్యాట్‌తో తడబడుతూ వచ్చింది. కానీ గత మూడు మ్యాచ్‌ల్లో రెండుసార్లు 250 ప్లస్‌ పరుగులు బాదటం సానుకూల పరిణామం. యువ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ రాణిస్తే భారత్‌ భారీ స్కోర్లు చేయటం సులువు. టీ20 ప్రపంచకప్‌లో నిరాశపరిచిన అభిషేక్‌ శర్మ నేడు ఫైనల్లోనైనా సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్నాడు. సంజు శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య, తిలక్‌ వర్మలు దంచికొట్టుడులో దూసుకెళ్తున్నారు. శివం దూబె సైతం ధనాధన్‌ జోరందుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌ లైనప్‌లో అభిషేక్‌ శర్మ ఫామ్‌ మినహా భారత్‌కు పెద్దగా బెంగ లేదు. బ్యాటింగ్‌ లైనప్‌లో ఏ ఇద్దరు మెరిసినా భారత్‌ అలవోకగా 200 ప్లస్‌ పరుగులు చేయగలదు.

ఆఫ్‌ స్పిన్‌ ఆందోళన
అంతా బాగుంది. కానీ ఆఫ్‌ స్పిన్‌ బలహీనత ఒక్కటే భారత ఆటగాళ్లను, అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. స్పిన్‌పై మెరుగైన రికార్డు కలిగిన అభిషేక్‌ శర్మ.. టీ20 ప్రపంచకప్‌లో తేలిపోయాడు. లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్లు ఆఫ్‌ స్పిన్‌ ఆడలేకపోతున్నారు. భారత్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఇషాన్‌ కిషన్‌ సైతం ఆఫ్‌ స్పిన్‌ ఆడేందుకు ఆపసోపాలు పడుతున్నాడు. తిలక్‌ వర్మ, శివం దూబె సైతం ఇదే తరహాలో తడబడుతున్నారు. ఆఫ్‌ స్పిన్‌పై అభిషేక్‌ శర్మ సగటు 9.67, స్ట్రయిక్‌రేట్‌ 107.41. ఆఫ్‌ స్పిన్‌పై బౌండరీ బాదేందుకు ప్రయత్నిస్తూనే అభిషేక్‌ వికెట్‌ కోల్పోతున్నాడు. ఇషాన్‌ కిషన్‌ సగటు 13, తిలక్‌ వర్మ స్ట్రయిక్‌రేట్‌ 97.33. ఆఫ్‌ స్పిన్‌ ఆడటంలో ఎడమ చేతి బ్యాటర్ల వైఫల్యం.. కుడి చేతి వాటం బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌పై ప్రభావం చూపిస్తోంది. సూర్య ఆఫ్‌స్పిన్‌ను ఊచకోత కోస్తాడు. కానీ టీ20 ప్రపంచకప్‌లో స్ట్రయిక్‌రేట్‌ 114.71 మాత్రమే. న్యూజిలాండ్‌ శిబిరంలో మెక్‌కంకీ, గ్లెన్‌ ఫిలిప్స్‌లు ఆఫ్‌ స్పిన్‌ మాయ చేయగలరు. దక్షిణాఫ్రికాతో సెమీఫైనల్లో ఒకే ఓవర్లో లెఫ్ట్‌ హ్యాండర్లు డికాక్‌, రికెల్టన్‌లను అవుట్‌ చేసిన మెక్‌కంకీ సెమీస్‌ గతిని మార్చివేశాడు.

టైటిల్‌పై ఆశలతో..
టీ20 ప్రపంచకప్‌ ముంగిట భారత్‌ చేతిలో దారుణ ఓటమి చవిచూసిన న్యూజిలాండ్‌.. అసలు సమరంలో సమర శంఖం పూరించింది. ఒక్కో బలహీనతను అధిగమిస్తూ.. బలోపేతంగా తయారైంది. నేడు టైటిల్‌ పోరులో డిఫెండింగ్‌ చాంపియన్‌కు సవాల్‌ విసురుతోంది. గతంలో ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత్‌ ఓడించి తొలిసారి ఐసీసీ టైటిల్‌ దక్కించుకున్న న్యూజిలాండ్‌… నేడు టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లోనూ అదే ప్రదర్శన పునరావృతం చేసేందుకు సిద్ధమవుతోంది. గ్రూప్‌ దశలో దక్షిణాఫ్రికా, సూపర్‌8లో ఇంగ్లాండ్‌ చేతిలో అలవోకగా ఓడిన న్యూజిలాండ్‌… సెమీఫైనల్లో బలమైన దక్షిణాఫ్రికాపై అదిరే విజయం సాధించింది. సరైన సమయంలో సమిష్టిగా రాణించటమే అందుకు కారణం. టిమ్‌ సీఫర్ట్‌, ఫిన్‌ అలెన్‌ భీకర ఫామ్‌లో ఉన్నారు. పవర్‌ప్లేలో ఈ ఇద్దరిని నిలువరించటం అంత సులువు కాదు. రచిన్‌ రవీంద్ర, గ్లెన్‌ ఫిలిప్స్‌, మార్క్‌ చాప్‌మన్‌, డార్లీ మిచెల్‌లు ఫైనల్లో సత్తా చాటాలని భావిస్తున్నారు. కెప్టెన్‌ మిచెల్‌ శాంట్నర్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకొచ్చే అవకాశం లేకపోలేదు. బ్యాట్‌తో, బంతితో శాంట్నర్‌ నేడు కీలక పాత్ర పోషించనున్నాడు. అహ్మదాబాద్‌ పిచ్‌ స్పిన్‌ కంటే పేస్‌కు ఎక్కువగా అనుకూలం. దీంతో అదనపు పేసర్‌తో న్యూజిలాండ్‌ బరిలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

పిచ్‌, వాతావరణం
టైటిల్‌ పోరుకు అహ్మదాబాద్‌లో మిడిల్‌ పిచ్‌ను సిద్ధం చేశారు. ఎర్ర, నల్ల మట్టితో తయారు చేసిన పిచ్‌ ఛేదనకు అనుకూలం!. ఇక్కడ మంచు ప్రభావం పెద్దగా ఉండదు. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ పిచ్‌పై గత ఐపీఎల్‌ సీజన్‌ ఫైనల్లో ఆర్‌సీబీ 190 పరుగులను విజయవంతంగా కాపాడుకుంది. ఒత్తిడితో కూడిన ఫైనల్లో కొన్నిసార్లు సమీకరణాలకు ఆవల వ్యూహం రచించాల్సి ఉంటుంది.

తుది జట్లు (అంచనా)

భారత్‌ : అభిషేక్‌ శర్మ, సంజు శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), ఇషాన్‌ కిషన్‌, తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్య, శివం దూబె, అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా, వరుణ్‌ చక్రవర్తి/కుల్దీప్‌ యాదవ్‌.

న్యూజిలాండ్‌ : టిమ్‌ సీఫర్ట్‌ (వికెట్‌ కీపర్‌), ఫిన్‌ అలెన్‌, రచిన్‌ రవీంద్ర, గ్లెన్‌ ఫిలిప్స్‌, మార్క్‌ చాప్‌మన్‌, డార్లీ మిచెల్‌, మిచెల్‌ శాంట్నర్‌ (కెప్టెన్‌), కొలె మెక్‌కాంకీ, జాకబ్‌ డఫ్ఫీ, మాట్‌ హెన్రీ, లాకీ ఫెర్గుసన్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -