– బీసీసీఐలో సౌరవ్ గంగూలీకి దక్కని ప్రాధాన్యత
– బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపకపోవటమే కారణం
విరుద్ధ ప్రయోజనాలతో అవినీతి మరక, ఫిక్సింగ్ ఆరోపణలు, బోర్డుపై అపనమ్మకం. విపత్కర పరిస్థితుల్లో భారత క్రికెట్‌పై విశ్వాసం నిలపటమే అతి పెద్ద సవాల్. కెప్టెన్‌గా భారత క్రికెట్‌ను అగ్రగామిగా నిలిపిన సౌరవ్ గంగూలీ.. అధ్యక్షుడిగా బీసీసీఐని మళ్లీ గాడిలో పెడతాడని అందరూ అనుకున్నారు. 2019లో బీసీసీఐ అధ్యక్షుడిగా దాదా పగ్గాలు అందుకుని బోర్డు పూర్వ వైభవం దిశగా నడిపించాడు. ఆ తర్వాత బీసీసీఐ రాజకీయాల్లో కనుమరుగయ్యాడు. దాదాను ఎవరు? ఎందుకు వద్దనుకున్నారు?!.
నవతెలంగాణ క్రీడావిభాగం
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు. ఇతర క్రీడాంశాల్లో భారత జట్లు ఆట, ఆర్థిక పరంగా అంతర్జాతీయ వేదికపై ఇబ్బందులు పడుతుంటే.. అందుకు భిన్నమైన వాతావరణం క్రికెట్‌లో నెలకొంది. ఖజానాలో వేల కోట్ల నగదు, ఏడాది పొడవునా ఆదాయాన్ని ఆర్జించే వనరులు, కండ్లుచెదిరే మీడియా హక్కుల విలువ బీసీసీఐ సొంతం. ఇన్ని హంగులున్న బీసీసీఐ గద్దెపై రాజకీయ నాయకులు కన్నేయటం సహజం. అధికార భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నుంచి చాలా మంది క్రికెట్ సంఘాల్లో పదవులు అనుభవిస్తున్నారు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, విరుద్ధ ప్రయోజనాలతో అవినీతి, అశ్రిత పక్షపాతం, ఏండ్లుగా ఏకఛత్రాదిపత్యం వంటి జాఢ్యాలను చెదరగొట్టేందుకు జస్టిస్ లోధా కమిటీ విప్లవాత్మక సిఫారసులు చేసింది. సుప్రీంకోర్టు ఆమోదంతో లోధా సిఫారసులు బీసీసీఐలో అమలు అయ్యాయి. ఆ కఠిన సమయంలో ఇటు న్యాయస్థానాలు, అటు ప్రజలు మెచ్చే విధంగా అన్ని విధాలుగా యోగ్యుడైన ఓ వ్యక్తి బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టేందుకు అవసరం అయ్యాడు. 2019 అక్టోబర్‌లో న్యూఢిల్లీలో సమావేశమైన బీసీసీఐ పెద్దలు.. బోర్డు ప్రెసిడెంట్‌గా సౌరవ్ గంగూలీ అందరికీ ఆమోదయోగ్యుడుగా ఉంటారని అనుకున్నారు. కష్టకాలంలో బోర్డును చక్కదిద్దేందుకు దాదా సైతం ముందుకొచ్చాడు. 2019-22 వరకు గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగారు. ఆ తర్వాత సడలించిన నిబంధనల ప్రకారం గంగూలీ మరోసారి అధ్యక్ష పదవి చేపట్టేందుకు అర్హుడు. అయినా, కోల్‌కత ప్రిన్స్‌ను బీసీసీఐ రాజకీయాలకు దూరం పెట్టారు. తాజాగా నేడు మరోసారి బీసీసీఐ ఎన్నికలు జరుగనుండగా.. గంగూలీకి ప్రాధాన్యత దక్కలేదు. అందుకు బలమైన కారణమే ఉంది.
దాదా నిరాకరణ
2019లో సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడి ఎన్నికవగా.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తనయుడు జై షా కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. క్రికెట్ పరిపాలనా పరంగా జై షాతో గంగూలీ చక్కటి అనుబంధం కొనసాగించాడు. అధ్యక్ష, కార్యదర్శుల సఖ్యత బోర్డు పారదర్శక పాలనలో కనిపించింది. జై షాతో సన్నిహితంగా మెలగటంతో 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి గంగూలీని బరిలోకి దింపాలని కాషాయ పార్టీ పెద్దలు భావించారు. కానీ, గంగూలీ ఆ ప్రతిపాదనలను సున్నితంగా తిరస్కరించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి గంగూలీ పార్టీలో చేరకపోవటం ఓ కారణంగా చెబుతారు. ఆ కోపంతోనే 2022 బీసీసీఐ ఎన్నికల్లో గంగూలీని పక్కనపెట్టారు. వరుసగా రెండు పర్యాయాల అనంతరం విరామం అవసరం కనుక.. 2025లో దాదా మళ్లీ ఎంట్రీ ఇస్తాడని చెప్పారు. నేడు బీసీసీఐ సాధారణ ఎన్నికలు జరుగుతుండగా.. గంగూలీ పేరు వినిపించటం లేదు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్షుడిగా ఎన్నికైన దాదా.. బీసీసీఐ ప్రెసిడెంట్ పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని సంకేతాలు ఇచ్చాడు. అయినా, గంగూలీని కాదని మిథున్ మన్హాస్‌ను ఎంచుకున్నారు. బీసీసీఐ అధ్యక్ష పదవి, బోర్డు రాజకీయాలకు దూరం కావటంపై గంగూలీ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. పదవుల కోసం కాషాయ తీర్థం పుచ్చుకోని గంగూలీని బెంగాలీ రాజకీయాలకు అతీతంగా ప్రజలు మరింత అమితంగా ఆదరించటం విశేషం.