ఎవరి వాటా వారికి దక్కేవరకు పోరాటం
42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుపై కేంద్రం నాన్చుడు ?
అణిచివేయాలనుకుంటే తిరుగుబాటు తప్పదు
ప్రధాని చిత్తశుద్ధి నిరూపించుకోవాలి
ఢిల్లీ బీసీ ధర్నాలో అఖిలపక్ష నేతల వెల్లడి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
దేశంలో బీసీలపై విధించిన 50 శాతం పరిమితిని ఎత్తివేసి జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచకపోతే దేశంలో సామాజిక తిరుగుబాటు తప్పదని అఖిలపక్ష పార్టీల నేతలు, బీసీ సంఘాల జేఏసీ నేతలు హెచ్చరించారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఇచ్చిన చలో ఢిల్లీ పిలుపు మేరకు సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీల మహాధర్నా నిర్వహించారు దీనికి టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్, సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, మాజీ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్, బీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, మాజీ పార్లమెంట్ సభ్యులు వి హనుమంత రావు, రాపోలు ఆనందభాస్కర్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా, ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు, మహారాష్ట్ర అధ్యక్షులు సచిన్ రాజోలుకర్ హాజరయ్యారు.
ఈసందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ వెనుకడుగు వేయదన్నారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించామే తప్ప, బీసీ రిజర్వేషన్ల ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ వైదొలగలేదని అన్నారు. ఈ విషయమై ఇప్పటికే రాహుల్ గాంధీ , మల్లికార్జున ఖర్గేతో చర్చించామని తెలిపారు. అతి త్వరలోనే కేంద్రంపై పోరాడడానికి తమ రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా బీజేపీ అడుగడుగునా అడ్డుపడు తున్నదన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలను తమ చేతిలో పెట్టుకుని బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్రలు చేస్తుందని ఆయన ఆరోపించారు. తెలంగాణ నుంచి ఎన్నికైన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దెబ్బకు దిగి వస్తుందని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్ మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ నుంచి కాంగ్రెస్ పార్టీ రాజకీయ డ్రామాలు ఆడుతున్నదన్నారు.
రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు పెట్టిన, చట్టం చేసిన బీఆర్‌ఎస్ పార్టీ అండగా నిలబడిందన్నారు. కానీ కాంగ్రెస్ చిత్తశుద్ధితో ప్రయత్నించకుండా వ్యవహరిస్తున్నదని వారు ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి అఖిలపక్షంతో ఢిల్లీకి వచ్చి ప్రధానిని కలవాలని కోరినా, ఆ పనిచేయడం లేదన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి నేతలు పార్లమెంటులో కనీసం మాట్లాడడం లేదనీ, కాంగ్రెస్ బీజేపీతో కలిసి పార్లమెంటులో ఆమోదించుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు. బీసీ బిల్లు విషయంలో మాత్రం రెండు పార్టీలు సహకరించడం లేదని విమర్శించారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి మాట్లాడుతూ బీసీలపై పార్లమెంటులో కొట్లాడుతున్న బీజేపీ స్పందించడం లేదన్నారు. మాజీ పార్లమెంట్ సభ్యులు వి హనుమంతరావు మాట్లాడుతూ బీసీ ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నప్పటికీ బీసీలకు న్యాయం జరగకపోవడం దురదష్టకరమన్నారు. పార్లమెంటులో బీసీ రిజర్వేషన్లపై ప్రయివేటు బిల్లు పెట్టేలా రాహుల్ గాంధీపై ఒత్తిడి తీసుకొస్తామని ఆయన తెలిపారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉధృతం చేస్తున్నామన్నారు. అయినా బీజేపీ, కాంగ్రెస్ స్పందించకుండా బీసీలకు అన్యాయం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఇప్పటికీ రెండుసార్లు రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన చేపట్టినా అఖిలపక్షంతో ప్రధాని ఎందుకు కలవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇక బీజేపీ బీసీలకు బద్ద శత్రువుగా మారిందన్నారు. నాటి మండల్ నుంచి నేటి బీసీ రిజర్వేషన్ల వరకు బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందనీ అన్నారు. ఈ మహా ధర్నాకు బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మెన్ గుజ్జ కృష్ణ సమన్వయం చేయగా బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్‌గౌడ్, మహిళా సంఘం అధ్యక్షురాలు బి మని మంజరి సాగర్, పెరిక సురేష్, ప్రొఫెసర్ సంఘని మల్లేశ్వర్, కే వీరస్వామి, పిట్ల శ్రీధర్, కౌల జగన్నాథం, నాగ మల్లేశ్వరరావు, నందగోపాల్, జాజుల లింగం గౌడ్, వేముల రామకష్ణ, మడత వెంకట్ గౌడ్, గూడూరు భాస్కర్, స్వర్ణ, గౌతమి, ఉదయనేత, శివమ్మ, శివకుమార్, సుమన్ , బిక్షం గౌడ్, అశోక్, తదితరులు పాల్గొన్నారు
50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



