నవతెలంగాణ – మిర్యాలగూడ
తెలంగాణ ఉద్యమకారులు సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని టి యు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు ప్రపుల్ రామ్ రెడ్డి అన్నారు. సోమవారం అమరవీరుల స్తూపం వద్ద భారీ బహిరంగ సభ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ప్రపుల్ రాంరెడ్డి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని అన్నారు. ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు. నికార్సైన తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలంతో పాటు నాలుగు గదుల ఇళ్లను నిర్మించి ఇవ్వాలన్నారు. అంతేకాకుండా మలిదశ తెలంగాణ ఉద్యమంలో అమరులైన 1200 మంది అమరుల కుటుంబాలకు 10 లక్షల నగదు ప్రభుత్వ ఉద్యోగము ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
జిల్లా కేంద్రంలో ఉద్యమ అమరులకు స్మారక భవనం నిర్మించాలన్నారు. తెలంగాణ అమరవీరుల చరిత్రను తెలంగాణ ఉద్యమ చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులపై మోపిన అక్రమ కేసులను బేషరతుగా ఎత్తివేయాలన్నారు. అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు మోహన్ బైరాగి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన ఉద్యమకారులను గుర్తించి సంఘం డిమాండ్లను నెరవేర్చాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారుల సంక్షేమ సంఘానికి ఇచ్చిన హామీల నెరవేర్చాలన్నారు లేనిచో ఉద్యమం ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చంద్రన్న ప్రసాద్ దుండిగాల అంజయ్య డాక్టర్ రాజు సాగర్ తెలంగాణ హఫీజ్ కిరణ్ మూసర్ భాయ్ సింగర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.



