Monday, November 10, 2025
E-PAPER
Homeజాతీయంవ్యవసాయ రంగాన్నిఆహార ఉత్పత్తి, భద్రతగా చూడాలి

వ్యవసాయ రంగాన్నిఆహార ఉత్పత్తి, భద్రతగా చూడాలి

- Advertisement -

ఫాస్‌ సదస్సులో నిపుణులు

నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
వ్యవసాయ రంగాన్ని వ్యాపారం, లాభాల దృక్పథంతో కాకుండా ప్రజలకు ఆహార ఉత్పత్తి, ఆహార భద్రతగా చూడాలని వ్యవసాయరంగ నిపుణులు సూచించారు. కేరళలోని తిరువనంతపురంలో మూడు రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు ఆదివారం ముగిసింది. చివరి ప్లీనరీ సభకు ఫౌండేషన్‌ ఫర్‌ అగ్రేరియన్‌ స్టడీస్‌ (ఫాస్‌) కన్వీనర్‌, కేరళ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్‌ వి.కె. రామచంద్రన్‌ అధ్యక్షత వహించారు. నాలుగు రోజులు జరిగిన ఈ అంతర్జాతీయ సదస్సులో పలువురు మేధావులు, శాస్త్రవేత్తలు, నిపుణులు, దేశ విదేశాల ప్రముఖులు సమర్పించిన పత్రాలను సమీక్షించారు. మానవ మనుగడకు, అభివృద్ధికి ప్రజలకు అందుతున్న ఆహారం, వ్యవసాయ రంగం పరిస్థితితో పాటు విద్య, వైద్యం, సగటు జీవన ప్రమాణాలు ప్రాతిపదికలుగా ఉంటాయన్నారు. సంస్కరణలు వీటిని ధ్వంసం చేశాయని, సగటు జీవన ప్రమాణాలను, గ్రామీణ జీవన విధానాన్ని దిగజార్చాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యయం, సహకారం రైతుకు కాకుండా కార్పొరేట్‌ కంపెనీలకు చేరడం అత్యంత ప్రమాద కరమన్నారు. చైనా, వియత్నాం లాంటి దేశాలు వ్యవసాయ రంగంలో సాధిస్తున్న ఫలితాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. వ్యవసాయ రంగం లో ప్రభుత్వ వ్యయం పెంపు, స్థానిక సంస్థలకు అధికారాలు కీలకంగా ఉంటాయన్నారు. వ్యవసాయరంగ అభివృద్ధికి దేశాలు తీసుకో వాల్సిన పలు చర్యలను సూచించారు.

ఇలాంటి అంతర్జాతీయ సదస్సుల నిర్వహణ వ్యవసాయ రంగ అభివృద్ధికి మార్గదర్శకంగా పనిచేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ దిశగా ఫాస్‌ చేస్తున్న విస్తృత అధ్యయనాలు, కృషిని అభినందిస్తూ అందరు ప్రోత్సహించాలన్నారు. అఖిల భారత కిసాన్‌ సభ అధ్యక్షుడు అశోక్‌ ధావలే మాట్లాడుతూ వ్యవసాయ రంగం, రైతుల స్థితిగతుల అధ్యయనానికి ఈ అంతర్జాతీయ సదస్సు ఎంతగానో తోడ్పడిందన్నారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ మాట్లాడుతూ దేశంలోని వ్యవసాయ కార్మికుల స్థితిగతులపై విస్తృతంగా సర్వేలు నిర్వహించేల ఫాస్‌ మరింత కృషి చేయాలన్నారు. అమెరికా, కెనడా, బ్రిటన్‌ దేశాల ప్రతినిధులు చివరిరోజు తమ పత్రాలు సమర్పించారు. దేశంలోని 15 రాష్ట్రాలు, 25 విదేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్న ఈ అంతర్జాతీయ సదస్సు అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. శనివారం రాత్రి ప్రదర్శించిన కథాకళి సాంస్కృతిక ప్రదర్శన విశేషంగా ప్రతినిధులను ఆకట్టుకుంది. ఈ సదస్సులో తెలంగాణ నుంచి అరిబండి ప్రసాదరావు, టి.సాగర్‌, వెంకట్రాములు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి బి.బలరాం చర్చల్లో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -