Wednesday, January 7, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఅమెరికా దాడి అంతర్జాతీయ నేరం

అమెరికా దాడి అంతర్జాతీయ నేరం

- Advertisement -

మదురో దంపతులను విడుదల చేయాలి
చమురు నిల్వల దోపిడీయే ట్రంప్‌ అసలు లక్ష్యం
అమెరికా ఏజెంట్‌లా వ్యవహరిస్తున్న మోడీ : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో సీపీఐ(ఎం) నిరసన ప్రదర్శన

నవతెలంగాణ-సిటీబ్యూరో
వెనిజులా అధ్యక్షులు మదురో దంపతులను వెంటనే విడుదల చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. వెనిజులా దేశ సార్వభౌమాధికారాన్ని కాలరాస్తూ, ఆ దేశ అధ్యక్షులు నికోలస్‌ మదురో, ఆయన భార్య సిలియానాను అమెరికా బలగాలు నిర్బంధించడాన్ని నిరసిస్తూ సోమవారం సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. యుద్ధ విమానాలతో ఒక దేశ మిలటరీ హెడ్‌ క్వార్టర్స్‌పై దాడి చేసి.. నిద్రిస్తున్న అధ్యక్ష దంపతులకు బేడీలు వేసి దేశం దాటించి తీసుకెళ్లడం అత్యంత హేయమైన చర్యని అన్నారు. ఒక స్వతంత్ర దేశ నేతను నిర్బంధించే సత్తా తమకే ఉందన్న అహంకారాన్ని అమెరికా ప్రదర్శిస్తోందన్నారు.

వెనిజులాలోని చమురు నిల్వలను దోచుకోవడమే ట్రంప్‌ అసలు లక్ష్యమని తెలిపారు. బ్రిటీష్‌ సామ్రాజ్యవాదాన్ని ఎదిరించి స్వాతంత్య్రం పొందిన భారతదేశానికి ప్రధానిగా ఉన్న మోడీ, వెనిజులాలో జరుగుతున్న అన్యాయాన్ని ఖండిరచకపోవడం సిగ్గు చేటన్నారు. అమెరికా అధ్యక్షులు భారత్‌పై టారిఫ్‌లు విధిస్తామని బెదిరిస్తున్నా మోడీ స్పందించకపోవడం దేశ ప్రతిష్టకు భంగకరమన్నారు. నేటి వెనిజులా పరిస్థితే రేపు క్యూబా, కొలంబియా, చిలీ, బ్రెజిల్‌ వంటి దేశాలకు పడుతుందని అమెరికా హెచ్చరించడం ప్రపంచాన్ని భయపెట్టే చర్య అన్నారు. చైనా, రష్యాను ఏమీ చేయలేక భారతదేశం పట్ల అమెరికా మెతక వైఖరిని అవలంబిస్తోందన్నారు. ట్రంప్‌ బెదిరింపులకు భయపడి ప్రధాని మోడీ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

అమెరికా చర్య అత్యంత సిగ్గు : టి.జ్యోతి
అమెరికా చర్య అత్యంత సిగ్గుమాలిన చర్య అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతి అన్నారు. ప్రపంచ దేశాలన్నింటినీ తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలనే అమెరికా దురాకాంక్షకు ఇది నిదర్శనం అన్నారు. వెనిజులా ప్రజలకు అండగా నిలబడాలని, మదురో దంపతులను బేషరతుగా విడుదల చేసే వరకూ తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

ప్రపంచ పోలీస్‌గా వ్యవహరిస్తున్న ట్రంప్‌: జూలకంటి రంగారెడ్డి
డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ పోలీస్‌గా వ్యవహరిస్తున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. న్యూయార్క్‌ మేయరే ఈ చర్యను ఖండిస్తుంటే, మోడీ మౌనంగా ఉండటం శోచనీయమని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో వెనిజులా అధ్యక్షులు మదురో అక్రమ అరెస్టును ఖండిస్తూ ప్రభుత్వం తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, నున్నా నాగేశ్వరరావు, బండారు రవికుమార్‌, టి.సాగర్‌, ఎండీ అబ్బాస్‌, మల్లు లక్ష్మి, రాష్ట్ర కమిటీ సభ్యులు, నగర కమిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్‌, నాయకులు పాల్గొన్నారు.

జిల్లాల్లో..
వెనిజులాపై అమెరికా దాడిని ఖండించాలని ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించి అమెరికన్‌ సామ్రాజ్యవాద దిష్టిబొమ్మను దహనం చేశారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి దిష్టిబొమ్మను దహనం చేశారు. సంగారెడ్డి జిల్లాలోని ఐడీఏ బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో, సదాశివపేట పట్టణంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో బస్టాండ్‌ వద్ద, అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో నిరసన తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌక్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు.

యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ జహంగీర్‌ మాట్లాడారు. వెనిజులాపై అమెరికా సామ్రాజ్యవాద కాంక్షతో దాడి చేయడం దుర్మార్గమన్నారు. ఆ దేశ ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న అధ్యక్షులు నికోలస్‌ మదురోను, ఆయన భార్యను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు. ప్రపంచశాంతి కాముకుడిగా గొప్పలు చెప్పుకుంటున్న డోనాల్డ్‌ ట్రంప్‌ పక్క దేశాలపై బాంబు దాడులకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. భూదాన్‌పోచంపల్లి మండల కేంద్రంలోని చౌటుప్పల్‌ రోడ్‌లో నిరసన తెలిపారు.

ట్రంప్‌తో ప్రపంచానికి ముప్పు : ఎస్‌.వీరయ్య
ట్రంప్‌నకు మూకుతాడు వేయకపోతే ప్రపంచానికే ప్రమాదకరమని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్య అన్నారు. తమ దేశ చట్టాల ప్రకారం విచారిస్తామనడం అమెరికా దుందుడుకు తనానికి పరాకాష్ట అని తెలిపారు. ట్రంప్‌ మొదటిసారి అధ్యక్షుడయినప్పటి నుంచే ఈ విషయం స్పష్టంగా చెప్తున్నాడని, ఇప్పుడు ఆచరణలోకి వచ్చిందని తెలిపారు. కరోనా కాలంలో మన దేశంలో ఉత్పత్తి అవుతున్న మందులను తమకు పంపించాలని బహిరంగంగా చెప్పిన 48 గంటల్లోనే ఆ మందులను మోడీ ప్రభుత్వం అమెరికాకు తరలించిందన్నారు. తాను బెదిరించడం వల్లే భారత్‌-పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ జరిగిందని 50సార్లకు మించి చెప్పినా.. మోడీ నోరు మెదపలేదన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -