Wednesday, January 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఉద్యానపంటల సాగు విస్తీర్ణం పెరగాలి

ఉద్యానపంటల సాగు విస్తీర్ణం పెరగాలి

- Advertisement -

– కూరగాయల రైతులకు మార్కెట్లు అందుబాటులోకి రావాలి
– తెలంగాణ రైజింగ్‌లో భాగంగా వ్యవసాయ రంగంలో లక్ష్యాలు పెట్టుకుని ముందుకెళ్తాం : రైతు కమిషన్‌ చైర్మెన్‌ కోదండరెడ్డి
– పత్తి, వరే కాదు మిగతా పంటలపైనా దృష్టి పెట్టాలి
– రాష్ట్రానికి వ్యవసాయ ప్రణాళిక రూపొందించాలి : రైతు సంఘం నేత సారంపల్లి మల్లారెడ్డి
– బీఆర్‌కే భవన్‌లో వ్యవసాయ రంగ భవిష్యత్తు ప్రణాళికలపై వర్క్‌షాపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెరగాల్సిన అవసరముందనీ, కూరగాయలు సాగు చేసే రైతులకు మేలు చేసేలా మరిన్ని మార్కెట్లు అందుబాటులోకి రావాలని తెలంగాణ రైతు కమిషన్‌ చైర్మెన్‌ కోదండరెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లో తెలంగాణ వ్యవసాయ రంగం భవిష్యత్‌ ప్రణాళికలపై వర్క్‌షాపును నిర్వహించారు. కోదండరెడ్డి అధ్యక్షతన ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ వర్క్‌షాప్‌ లో 2034- 2047 వరకు దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ రంగ అభివద్ధి, భవిష్యత్‌ ప్రణాళికలపై వక్తలు వారి అభిప్రాయాలను వ్యక్తపర్చారు. ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ..పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో వ్యవసాయ రంగం నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. ఎరువులు, విత్తనాలు కల్తీమయం కావడంతో రైతులు తీవ్ర నష్టపోయారనీ, రైతుల చేతుల్లోంచి విత్తనం ప్రయివేటు కంపెనీల చేతుల్లోకి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల వాడకం పెరగడంతో భూమి, నీరు, వాతావరణం కాలుష్యం అవుతోందనీ, అధిక ఎరువులతో పండిన పంట తినడంతో రోగాల భారిన పడే వారి శాతం పెరుగుతున్నదని వివరించారు. తెలంగాణ రైతు సంఘం సీనియర్‌ నేత సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ..వ్యవసాయ రంగం ప్రతిఏటా ప్రణాళికలు కీలకమని నొక్కి చెప్పారు. రాష్ట్రంలో కోటి 30 లక్షల ఎకరాలు సాగు చేస్తుంటే.. అందులో వరి 60 లక్షలు, పత్తి 50 లక్షల ఎకరాల్లో పంటలనే పండించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. భూసార పరీక్షలు చేసి, దానికి అనుగుణంగా పంటలు సాగు చేయాలనీ, పంట మార్పిళ్లపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఉద్యానవన పంటల సాగు పెరిగేలా చూడాలనీ, ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ విత్తనోత్పత్తికి సరైన ప్రాంతం కాబట్టి ఆ దిశగా ప్రణాళికలు రూపొందించాలన్నారు.
టీజేఎస్‌ అధ్యక్షులు, ప్రొఫెసర్‌ కోదండరామ్‌ మాట్లాడుతూ..చిన్న, సన్నకారు, మహిళా రైతులను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయరంగంలో భవిష్యత్‌ ప్రణాళికలు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. వరి, పత్తితో పాటు మిగతా పంటలకు మద్దతు ధర కల్పించాలని కోరారు. ఎఫ్‌పీఓల బలోపేతంతో రైతుల జీవన విధానంలో మార్పులు తీసుకురావొచ్చన్నారు.

సీడ్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ అన్వేష్‌ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనం అందాలనీ, ప్రయివేటు విత్తన కంపెనీల వద్ద తయారయ్యే విత్తనాలు, వ్యవసాయ యూనివర్సిటీలో తయారుచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. దానికోసం ఆగ్రోస్‌, విత్తనాభివృద్ధి సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని వివరించారు.
రైతు కమిషన్‌ సభ్యులు రాములు నాయక్‌ మాట్లాడుతూ..రాష్ట్రంలో పదేండ్లలో 10వేలమంది రైతులు చనిపోయారనీ, అందులో పత్తి, మిర్చి, వరి రైతులే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. కేసీఆర్‌ రైతు బంధు ఇచ్చి వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశారని తెలిపారు. పోడు, గిరిజన రైతులకు అదికూడా ఇవ్వలేదన్నారు. ధరణి తెచ్చి భూములను ఆగం చేశారనీ, కమిషన్‌ వచ్చిన తర్వాత రైతుల్లో అవగాహన తీసుకొస్తున్నదని తెలిపారు.
కమిషన్‌ సభ్యులు గోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి రైతు ఆర్గానిక్‌ వ్యవసాయం చేసేలా చూడాలన్నారు. ఎరువులు వాడటం తగ్గింపుపై దృష్టిసారించాలని కోరారు. రైతులు విత్తనాలను తయారుచేసుకోని సాగు చేయాలన్నారు. కమిషన్‌ సభ్యురాలు భవానీ రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో మహిళల పాత్ర కీలక మన్నారు. డీడీఎస్‌ను మహిళలే ముందుండి నడిపిస్తున్నారన్నారు. కేరళలో ఆదర్శపద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారనీ, అక్కడ వ్యవసాయ మార్కెట్లు రైతుల చేతుల్లోనే ఉన్నాయని వివరించారు.

సెంటర్‌ ఫర్‌ సస్టైనబుల్‌ అగ్రికల్చర్‌ డైరెక్టర్‌ రామాంజనేయులు మాట్లాడుతూ.. రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లాలనన్నారు. యువత వ్యవసాయంలోకి రావాలని ఆకాంక్షించారు. ప్రతి రైతు తప్పని సరిగా పశువుల పెంపకం చేపట్టాలని పశువుల ఎరువుతోనే వ్యవసాయం చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. పర్యావరణ రక్షణ, ఆహార భద్రత, పబ్లిక్‌ హెల్త్‌, ఫార్మర్‌ లైవ్‌లీవుడ్‌ లాంటి అంశాలకు వ్యవసాయ భవిష్యత్‌ ప్రణాళికలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
సమావేశంలో రైతు కమిషన్‌ సభ్యులు భూమి సునీల్‌, కమిషన్‌ సలహాదారులు దొంతి నర్సింహారెడ్డి, మెంబర్‌ సెక్రెటరీ గోపాల్‌, హార్టికల్చర్‌ యూనివర్సిటీ వీసీ రాజిరెడ్డి, నాబార్డు సీజీఎం ఉదరు భాస్కర్‌, మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ లక్ష్మి భాయి, అగ్రికల్చర్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ నర్సింహారావు, దక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ డైరెక్టర్‌ దివ్య, రైతు సంఘం నాయకులు నల్లమల వెంకటేశ్వర్లు, సీనియర్‌ జర్నలిస్ట్‌ దిలీప్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -